బీజేపీని వెంటాడుతున్న అభ్యర్థుల కొరత

బీజేపీని వెంటాడుతున్న అభ్యర్థుల కొరత


అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీని అభ్యర్థులు దొరకడంలేదా ? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పట్టుకోసం బీజేపీ ప్రయత్నిస్తోందా? కాంగ్రెస్, బీఆర్ఎస్ అసంతృప్త నేతలకు బీజేపీ గాలం వేస్తోందా? నాయకత్వ లోపాన్ని అధిగమించేందుకు కమలనాథుల వ్యూహాలేంటి?

తెలంగాణలో అధికారం ఖాయమని బీజేపీ అధిష్ఠానం లెక్కలు వేస్తోంది. కానీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ సారి పాగా వేసేందుకు బీజేపీ సర్వ శక్తులను ఒడ్డుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బలమైన అభ్యర్థులపై దృష్టి సారించింది. ఉమ్మడి జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. పలు నియోజకవర్గాలలో బలమైన నాయకుల కొరత బీజేపీని తీవ్రంగా వేధిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పశ్చిమ జిల్లాలో అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉండగా తూర్పు జిల్లాలో ఆ పరిస్థితి కనిపించడంలేదు. దీంతో తూర్పు జిల్లాలో కమలం వికసించాలంటే మంచి పేరుతో పాటు ఆర్థికంగా బలమైన నాయకత్వం అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీలలో ఉన్న అసంతృప్తులపై బీజేపీ అగ్రనేతలు కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే పశ్చిమ జిల్లాలో కాంగ్రెస్ లో కీలక నేతలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్ బీజేపీలో చేరగా.. తూర్పున పట్టు కోసం ప్రయత్నిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. తూర్పు జిల్లాలో ఒకటి, రెండు నియోజకవర్గాల్లో తప్ప మిగతా చోట్ల పెద్దగా ప్రజాకర్షక నేతలు లేకపోవడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ నేతలపై దృష్టి సారించారు. బెల్లంపల్లిలో మాజీ మంత్రి గడ్డం వినోద్‌ను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మంచిర్యాల నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి చేరికకు ఇప్పటికే రంగం సిద్ధమైనట్లు పార్టీ వర్గాల టాక్. వీరిద్దరూ పార్టీలో చేరితే తూర్పు జిల్లాలో కమల వికాసానికి మార్గం సుగమమవుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరితో ఒక విడత చర్చలు పూర్తయిన నేపథ్యంలో త్వరలోనే వీరిద్దరూ బీజేపీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

బెల్లంపల్లిలో గత ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసిన గడ్డం వినోద్ స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఆయనకు బెల్లంపల్లిలో మంచి పట్టు ఉండగా.. బీజేపీలో చేరితే మరింత లాభిస్తుందని భావిస్తున్నారు. అటు మంచిర్యాలలో మంచి పేరు, పట్టు, బలం ఉన్న నేతగా గడ్డం అరవింద్ రెడ్డి పేరు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన బీఆర్ఎస్‌లో కొనసాగుతున్నా.. ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారట. ఆయన ఈసారి తన సతీమణిని బరిలోకి దింపేందుకు సిద్ధవుతున్నారని టాక్ వినిపిస్తోంది. బీజేపీలో చేరి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆయన అనుచరవర్గం కూడా భావిస్తోందట. దీంతో ఈ ఇద్దరు కీలక నేతలతో కమలనాథులు జరిపిన చర్చలు సఫలం కావడంతో వీరి చేరిక ఖరారయినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే తూర్పు జిల్లాలో కమల వికాసానికి దారులు సుగమమైనట్లేనని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ సాగిస్తున్న కమల శ్రేణులు ప్రస్తుత జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఆమె ఇప్పటికిప్పుడు పార్టీలో చేరకపోయినా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ, సిట్టింగ్ కే టికెట్ ఇస్తే మాత్రం సక్కుకే అవకాశం లభిస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాంటప్పుడు ఆమెకు ఎంపీగా అవకాశం లభిస్తుందా.. లేక పార్టీ వీడే అవకాశం ఉంటుందా..అనే దానిపై కొంతకాలం వేచి చూస్తే గానిస్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదని చర్చ నడుస్తోంది. మొత్తానికి ఈ ముగ్గురు నేతల చేరిక జరిగితే తూర్పు ఆదిలాబాద్ జిల్లాలో కమల వికాసానికి మార్గం సుగమం అయినట్లే నని కాషాయ దళం భావిస్తోంది.

Read MoreRead Less
Next Story