తెలంగాణలో బీజేపీ టార్గెట్ మిషన్ 90

తెలంగాణలో బీజేపీ టార్గెట్ మిషన్ 90
X
తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచనుందా? మిషన్ 90 లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టనుందా? కాంగ్రెస్, బీఆర్ఎస్ అసమ్మతి నేతలకు బీజేపీ గాలం వేస్తోందా?

తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచనుందా? మిషన్ 90 లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టనుందా? కాంగ్రెస్, బీఆర్ఎస్ అసమ్మతి నేతలకు బీజేపీ గాలం వేస్తోందా? కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీలోకి భారీగా చేరికలుంటాయా?

తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలలు మాత్రమే సమయం ఉండటంతో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. పార్టీ బలోపేతమే లక్ష్యంగా వేగంగా ఆ పార్టీ నేతలు అడుగులు వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అసంతృప్త నేతలను తమ వైపు తిప్పుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారట ఆ పార్టీ నేతలు. ముఖ్యంగా బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజా వ్యతిరేక విధానాలపై అంశాల వారిగా పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో పార్టీలో చేరికలను కూడా వేగవంతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. గత కొంత కాలంగా పార్టీలో చేరికలు మందగించడంతో ఇటీవల అమిత్‌ షా టూర్ సందర్భంగా పార్టీ నేతలకు క్లాస్ తీసుకున్నట్లు అప్పట్లో చర్చ జరిగింది. నేతల మధ్య ఆధిపత్య పోరుకు స్వస్తి పలికి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అమిత్ షా హెచ్చరించినట్లు వార్తలు వినిపించాయి. బీజేపీలో చేరేందుకు పలు పార్టీల నేతలు సిద్దంగా ఉన్నా పార్టీలో విభేదాలు నెలకొన్న నేపథ్యంలో వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పార్టీలో భారీగా చేరికలుంటాయని చెప్పడం తప్ప ఎవరూ చేరకపోవడంతో అమిత్ షా ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.

రాష్ట్రంలో చేరికలపై జాతీయ నాయకత్వం సైతం సీరియస్ గానే ఫోకస్ చేసింది. అసంతృప్త నేతలతో సంప్రదింపులు జరిపి పార్టీలో చేరేలా బీజేపీ రాష్ట్ర నేతలకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అయితే జాతీయ నాయకత్వం అనుకున్న స్థాయిలో చేరికలు లేకపోవడంతో జాతీయ నాయకత్వం నుండి ఎప్పటికప్పుడు రాష్ట్ర నేతలకు చివాట్లు తప్పడం లేదన్న చర్చ కూడా ఉంది. తాజాగా తెలంగాణ బీజేపీ నేతల ఆశలన్నీ కర్ణాటక ఎన్నికలపైనే ఉన్నట్లు సమాచారం. అక్కడ గెలిస్తే తెలంగాణలోనూ ఆ ప్రభావం భారీ స్థాయిలో ఉంటుందని పార్టీ నేతలు అంచనావేస్తున్నారు. అమిత్ షా లాంటి బీజేపీ అగ్రనేతలు కూడా దక్షిణాదికి ఎంట్రీ అయిన కర్ణాటకలో మళ్లీ గెలుస్తామంటూ ...ఆ తరువాత దక్షిణాదిలో అధికారంలోకి వచ్చేది తెలంగాణలోనేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక కర్ణాటక ఎన్నికల తరువాత బీజేపీ జాతీయ నాయకత్వం పూర్తి ఫోకస్ తెలంగాణ పైనే పెట్టాలని భావిస్తోందట. ముందుగా గతంలో చర్చలు పూర్తి చేసుకుని పెండింగ్ లో ఉన్న నేతలకు కండువా కప్పేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నారట.

ఇందులో భాగంగానే బీఆర్ఎస్ బహిష్కృత నేతలైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో సంప్రదింపుల ప్రక్రియలను మరోసారి చేపట్టాయి. గతంలో అంతర్గతంగా జరిపిన చర్చలతో లాభంలేదని భావించిన బీజేపీ నాయకత్వం ఈ సారి చేరికల కమిటీ సభ్యులంతా కలిసి ఖమ్మం లో పొంగులేటిలో లంచ్ మీట్ ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా బీజేపీ ముఖ్య నేతలంతా ఖమ్మం బాట పట్టడంతో పాటు చేరికలను వేగవంతం చేయడంతో పాటు ఇతర పార్టీల్లో అసమ్మతి నేతలకు భరోసా కల్పించేదిశగా పావులు కదుపుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. చాలా రోజుల తరువాత బీజేపీ చేరికలపై మరోసారి దూకుడు పెంచడం.. కర్ణాటక ఎన్నికలు పూర్తైతే తెలంగాణపైనే ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Tags

Next Story