దర్శి వైసీపీలో ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే

దర్శి వైసీపీలో ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
దర్శి వైసీపీలో ఆధిపత్య పోరు అధిష్ఠానానికి తలబొప్పికట్టిందా? ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగుతోందా? నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాటకు విలువ లేకుండా పోయిందా? వర్గపోరుతో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేగలేకపోతున్నారా?

ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు ఫ్యాను పార్టీకి తలనొప్పిగా మారిందని టాక్ వినిపిస్తోంది. కరవమంటే కప్పకు కోపం... విడమంటే పాముకు కోపం అన్నట్లు ఇద్దరు నేతలు తమ ఆధిపత్యం కోసం వైసీపీ పార్టీకి తల బొప్పి గట్టిస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. పందెం కోళ్లలా ఢీ కొంటూ.., పార్టీని పాతాళంలోకి పాతేస్తున్నారని కేడర్ బావురుమంటోంది.

2004 లో బూచేపల్లి కుటుంబం నుంచి బూచేపల్లి సుబ్బారెడ్డి ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. ఆ తర్వాత వైఎస్ తో ఉన్న సాన్నిహిత్యంతో కాంగ్రెస్‌లో చేరారు. 2009లో బూచేపల్లి కుటుంబ వారసుడిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీచేసి..., విజయం సాధించారు. కానీ, 2014 ఎన్నికల్లో మాత్రం టీడీపీ అభ్యర్థి శిద్ధా రాఘవరావు చేతిలో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్తిగా పోటీ చేయమని కోరినా.., ఆర్థికంగా దెబ్బతినడంతో ఎన్నికల్లో పోటీచేయలేనని తన అశక్తతను వ్యక్తం చేశారట. దీంతో 2019 ఎన్నికల్లో మద్దిశెట్టి వేణుగోపాల్ కి వైసీపీ పార్టీ టికెట్ ఇవ్వడంతో ఆయన విజయం సాధించారు. కానీ, ఎమ్మెల్యేగా గెలిచిన నెల రోజులకే మద్దిశెట్టి , బూచేపల్లి మధ్య ఆధిపత్య పోరు మొదలైందని పబ్లిక్‌లో టాక్ వినిపిస్తోంది. పార్టీ కార్యక్రమం అయినా.., ప్రభుత్వ కార్యక్రమం అయినా..., రెండు వర్గాలు ఎదురపడితే కొట్టుకునే పరిస్థితి నియోజకవర్గంలో నెలకొంది.

మరోవైపు.., జెడ్పీ ఎన్నికల్లో విజయం అనంతరం వైసీపీ పార్టీ.. బూచేపల్లి శివప్రసాద్ తల్లి సుబ్బాయమ్మను జెడ్పీ ఛైర్మన్‌గా నియమించింది. దీంతో రెండు వర్గాల మధ్య వర్గపోరు మరింత పెరిగినట్లు సమాచారం. దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాటకు విలువ లేకుండా పోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. జెడ్పీ ఛైర్మన్ పరిధిలోని అన్ని పోస్టుల్లో ఎమ్మెల్యేకు తెలియకుండా..., బూచేపల్లి సుబ్బాయమ్మ నియమించేస్తున్నట్లు చెవులుకొరుక్కుంటున్నారు. దీంతో మద్దిశెట్టి వేణుగోపాల్.., మాజీ ఎమ్మెల్యే, జెడ్పీ ఛైర్మన్ వర్గాలను ఎదుర్కోలేక.., ఏ క్షణంలోనైనా పార్టీని వీడేలా ఉన్నారని ఆయన సన్నిహితులే ఆఫ్ ద రికార్డు మాట్లాడుతున్న పరిస్థితి నియోజకవర్గంలో నెలకొంది.

2019 ఎన్నికల తర్వాత టీడీపీని వీడి వైసీపీలో జాయిన్ అయిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు.., తన కుటుంబంలో ఒకరికి దర్శి టికెట్ కావాలని అధిష్ఠానానన్ని కోరుతున్నట్లు సమాచారం. బూచేపల్లి , మద్దిశెట్టి ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఇచ్చేకంటే.., శిద్ధా కుటుంబానికి టికెట్ ఇస్తే తలనొప్పి వదులుతుందని వైసీపీ అధిష్టానం కూడా లోలోపల భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే మద్దిశెట్టి తనదారి తాను చూసుకోవడం ఖాయమని ఆయన అనుచురులు బహిరంగంగానే చెబుతున్నారు.

2009లో ప్రజారాజ్యం నుంచి పోటీచేసిన మద్దిశెట్టి ఓటమిపాలయ్యారు. కాపు సామాజికవర్గం కావడం, పవన్ కల్యాణ్ తో సన్నిహత సంబంధాలుండటంతో మద్దిశెట్టి జనసేన అభ్యర్తిగా బరిలో నిలిచే అవకాశం ఉందని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు.., పొత్తులో భాగంగా దర్శి నియోజకవర్గం తమకు కావాలని జనసేన కోరుతుండటం కూడా ఈ అనుమానాలకి మరింత బలాన్ని చేకూర్చుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మద్దిశెట్టి ఫ్యానును వదిలేసి జనసేనలో చేరితే., శిద్దా కుటుంబం వైసీపీ తరపున ఎన్నికల బరిలో దిగితే.., మరి బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి దారెటో నని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story