AMBEDKAR: మన తరం బుద్దుడు..యుగానికొక్కడు.. అంబేద్కర్

డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ భారతదేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన మహా నేత. ఆయన జీవితం బడుగు, బలహీన, పేద వర్గాల హక్కుల కోసం సాగిన ఒక నిరంతర పోరాటగాథ. అణగారిన వర్గాలకు స్వాభిమానం కలిగించిన ఈ మహాపురుషుడు భారత రాజ్యాంగ నిర్మాతగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. ఇక కులాల పునాదులను తుదకంటా కదల్చాలని ఒక మహనీయుడు చెప్పిన నేలపై అవే కులాలు వెయ్యి అడుగుల లోతు పునాదిపై దృఢంగా పాతుకునిపోతున్నాయి. సమానత్వాన్ని జాతి జనులు పాడుకునే గీతంగా పరిమళింపజేసే రాజ్య వ్యవస్థను ఆయన కోరుకుంటే, అసమానతలకు ఆజ్యం పోసి నరనరానా కుల స్వభావాన్ని, కులాహంకారాన్ని, కులపీడనను జాతి గుండెల్లో ప్రతిష్టింపజేసే పనిలో పాలకులు మునిగి పోతున్నారు. పౌరుల గౌరవాన్ని పెంచే పాలనను ఆయన కలగంటే పౌరుల సమస్త హక్కులనూ రకరకాల ముసుగులతో తొక్కివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సకల జీవన రంగాల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని ఆయన ఆశిస్తే, ఆ భావననే రాజ్యాంగంలోంచి తొలగించేసాహసానికి నేటి పాలకులు పూనుకుంటున్నారు.
ఆ పోరాటానికి ఏమివ్వగలం
బాబాసాహెబ్’గా ప్రసిద్ధి పొందిన భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశంలోని అణగారిన వర్గాల ఆర్థిక, సామాజిక సాధికారికతకోసం తన జీవితం చివరి వరకూ పోరాటం చేశారు. రాజ్యాంగ పరిషత్తు సభ్యునిగా అంబేడ్కర్ విశేష శ్రమకోర్చి రాజ్యాంగ రచన చేయడం ఆయన జీవితంలో ప్రముఖ ఘట్టం. ధర్మశాస్త్ర పండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నేత, స్వంతంత్ర భారత తొలి న్యాయ మంత్రి, జాతీయోద్యమంలో తొలి దళిత నేత, వృత్తి రీత్యా లాయరు, బౌద్ధుడు, తత్వవేత్త, మానవశాస్త్ర అధ్యయనకర్త, చరిత్రకారుడు, ప్రసంగికుడు, రచయిత, అర్థికవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త ఇలా ఆ మహనీయుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బాల్యంలో అడుగడుగునా ఛీత్కారాలు, ఎన్నో అవమానాలకు గురయి.. పేదరికాన్ని ఎదుర్కొంటూ స్వయంకృషి, స్వీయప్రతిభతో ఎదిగి స్వతంత్ర భారతానికి తొలి కేంద్ర మంత్రి పదవిని అలంకరించేస్థాయికి అంబేద్కర్ చేరుకున్నారు. తన జీవితాంతం అణగారివర్గాల గొంతుకను వినిపించి, వారి సాధికారికతకు అంబేడ్కర్ పాటుపడ్డారు. కొలంబియా వర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి అర్ధశాస్త్రంలో గౌరవ డాక్టరేట్లు, అలాగే, ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థల్లో న్యాయ, ఆర్ధిక, రాజకీయ శాస్త్రాల్లో పరిశోధనలు చేశారు. విద్యాభ్యాసం తర్వాత ఆర్ధికవేత్తగా, ప్రొఫెసర్‌గా, న్యాయవాదిగా పలు పాత్రలు పోషించారు. తరువాత జాతీయోద్యమంలోకి వచ్చారు. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత దళితుల రాజకీయ హక్కులు, సామాజిక స్వేచ్ఛ కోసం పనిచేశారు. రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడిగా సేవలందించి ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం తయారీలో కీలక పాత్ర పోషించారు.
జీవితాంతం పోరాటమే
జీవితాంతం అణగారి వర్గాల కోసం పోరాడి, వారికి ఆశాజ్యోతిగా నిలిచారు. తన జీవిత చరమాంకంలో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. గౌతమ బుద్దుని బోధనలకు ప్రభావితమైన అంబేడ్కర్.. బౌద్ధుడిగా మారారు. అంటరానితనంపై ఆయన పూరించిన సమర శంఖం నేటికీ నిప్పు కణికలా జ్వలిస్తూనే ఉంది. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడాయన. కుల, మత రహిత ఆధునిక భారతావనికి కోసం అంబేద్కర్ తన జీవితకాలం పోరాటం చేశారు. దళితుల నాటి సమాజంలో ఉన్న వివక్షను పారద్రోలడానికి అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిది. అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. బడుగు, బలహీనవర్గాలను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా అంబేడ్కర్.. వారి అభ్యున్నతకి రాజ్యాంగంలో రిజర్వేషన్ల అంశాన్ని చేర్చి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. అలాగే అంటరానితనం, అస్పృశ్యతను శిక్షార్హమైన నేరంగా చేశారు. ఆర్థికవేత్తగా కూడా ఎంతో గుర్తింపు పొందారు. భారత సామాజిక, ఆర్థిక, రాజకీయ చిత్రపటంపై అంబేద్కర్ చెరిగిపోని సంతకం అనేది నిర్వివాదాంశం. ఆయన ఆధునిక భారత నిర్మాణంలో కీలకమైన వ్యక్తి. అంబేద్కర్‌కు భారతదేశ ప్రాచీన చరిత్ర పట్ల సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. దీనితోపాటు ఆయా వ్యవస్థల అభివృద్ధి విషయంలో తనదైన దృష్టికోణం ఉందనేది అంబేద్కర్ రచనలు, ఆయన చేసిన ప్రసంగాలు అధ్యయనం చేసిన వారికి అర్థమవుతుంది. ఆయన రాజకీయాల గురించి రాసినా, సామాజిక అంశాలను విశ్లేషించినా, చివరకు సాహిత్యంపై మాట్లాడినా అన్నింటిలోనూ సాధికారమైన జ్ఞానంతోపాటు.. ఆయా రంగాలలో ప్రజాస్వామిక విలువల్ని సాధించడానికి ఆయన పడిన తపన స్పష్టంగా కనిపిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
