CHILDS: తప్పుదారిలో పసి హృదయాలు

చేతిలో ఇమిడిన సాంకేతిక పరిజ్ఞానం పసి హృదయాలపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇప్పటికే కొన్ని నేరాలు సభ్య సమాజాన్నే దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఇవి మరింత శృతి మించకముందే ప్రభుత్వం వీటి నేపథ్యం అధ్యయనం చేసి, ఇటువంటి నేరాలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్త లు తీసుకోవాలి. బాలల ఆలోచనలు ఎందుకు దారి తప్పుతున్నాయి అనే ప్రశ్నకు జవాబు వెతకాలి. ఈ పిల్లలు స్మార్ట్ ఫోన్, పొర్నోగ్రఫీ వ్యసనపరులని వార్తలొచ్చాయి. ఈ రెంటి పైన నియంత్రణ అవసరం. పోర్నోగ్రఫీ, ఆన్లైన్ జూదం, సోషల్ మీడియాల కబంధ హస్తాలకు బాలలు చిక్కకుండా చేసే ఈ యుద్ధంలో తల్లిదండ్రులు ఒంటరిగా పోరాడలేరు.
చిన్న వయసులోనే పోర్నోగ్రఫీకి గురికావడం వారి మానసిక ఆరోగ్యం, ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇన్స్టిట్యూట్ ఫర్ ఫ్యామిలీ స్టడీస్ ప్రచురించిన “అన్ప్రొటెక్టెడ్ ఫ్రమ్ పోర్న్” నివేదిక ప్రకారం, 12-18 సంవత్సరాల వయస్సు గల 97% పైగా అబ్బాయిలు, 78% మంది అమ్మాయిలు పోర్నోగ్రఫీని చూశారు. 18 ఏళ్లు పైబడినవారమని బాలలే తమకు తాము స్వయంగా ప్రకటించుకునే పాప్-అప్లు హాస్యాస్పదంగా మారాయి. బాలల ఉత్తమ ప్రయోజనాలను పరిరక్షించడం అనేది ప్రపంచవ్యాప్తంగా బాలల రక్షణలో ప్రాథమిక సూత్రం. మద్యం, పొగాకు, జూదం విషయంలో ప్రభుత్వాలు ఎలా జోక్యం చేసుకుంటున్నాయో, పిల్లలు అడల్ట్ కంటెంట్‌కు గురి కాకుండా నిరోధించడానికి అదేవిధంగా జోక్యం చేసుకోవాలి. జూలై 2025 నుంచి యునైటెడ్ కింగ్డమ్ తన కొత్త ఆన్లైన్ సేఫ్టీ చట్టాన్ని అమలు చేస్తోంది. దీని ప్రకారం పోర్నోగ్రఫీని అనుమతించే అన్ని సైట్లు, యాప్‌లు - సోషల్ మీడియా, సెర్చ్ ఇంజిన్లు, గేమింగ్ సేవలతో సహా - అత్యంత ప్రభావవంతమైన వయస్సు ధృవీకరణ తనిఖీలను ఉపయోగించాలి. ఏదైనా ప్లాట్‌ఫారమ్ దీనికి కట్టుబడి ఉండకపోతే, భారీ జరిమానాలు లేదా సేవను పూర్తిగా నిలిపివేసే కోర్టు ఉత్తర్వులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆస్ట్రేలియా 2024లో ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ (సోషల్ మీడియా మినిమమ్ ఏజ్) చట్టాన్ని ఆమోదించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com