Editorial: భువనగిరి కోట హస్తగతమయ్యేనా..?

Editorial: భువనగిరి కోట హస్తగతమయ్యేనా..?
పీపుల్స్ మార్చ్ ను.. భువనగిరిలో విజయవంతం చేయడంతో క్యాడర్‌లో జోష్ వచ్చిందని పబ్లిక్‌లో ప్రచారం జరుగుతోంది


గత నాలుగు దశాబ్దాలుగా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు ఆమడ దూరంలో నిలుస్తోందా? గత ఎన్నికల్లోనూ హస్తం హవా కొనసాగనప్పటికీ.. గెలుపు ముంగిటే ఆగిపోయిందా? గత 40 ఏళ్ల చరిత్రను తిరగ రాసేందుకు.. వ్యూహాలు రచిస్తున్న లీడర్ ఎవరు..? ఆయన ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఆయన స్కెచ్ వేస్తే ప్రత్యర్థులు చిత్తేనా ఇంతకీ ఎవరా లీడర్?

అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఉన్న తెలంగాణలో విజయం కోసం ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో ఆశావహులు ఆయా నియోజకవర్గాలలో ఆత్మీయ సమ్మేళనాలు, పరామర్శలు, పాదయాత్రలతో నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో.. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ.. గత నాలుగు దశాబ్దాలుగా గెలుపుకు ఆమాడ దూరంలోనే నిలుస్తోందని పబ్లిక్‌లో టాక్ నడుస్తోంది. గతంలో టీడీపీ హయాంలో మాధవరెడ్డి హవా ఆయన మరణానంతరం సతీమణి ఉమా మాధవ రెడ్డి హవా నడిచింది. ఇక 2014, 2018 లో గులాబీ జెండా రెపరెపలాడింది. ఈ రెండు ఎన్నికల్లోనూ.. హస్తం పార్టీ విజయానికి చేరువగా వచ్చినప్పటికీ అది సాధ్యం కాలేదు. అయితే.. ప్రస్తుతం యాదాద్రి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి గత పదేళ్లుగా భువనగిరి నియోజవర్గంలో.. కాంగ్రెస్‌ పార్టీ ఇంఛార్జిగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో భువనగిరి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి.. ఓటమి పాలయ్యారు. అయినప్పటికి.. హస్తం పార్టీనే అంటిపెట్టుకుని.. అధికార పార్టీ ప్రలోభాల నుంచి తమ నాయకులు, కార్యకర్తల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు.. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై పోరాడుతున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు ఇచ్చి విఫలమైన అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ నేత కుంభం అనిల్ కుమార్ రెడ్డి సక్సెస్ అయ్యారని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వరుసగా రెండు పర్యాయాలు భువనగిరి ఎమ్మెల్యేగా పైళ్ల శేఖర్ రెడ్డి విజయం సాధించగా ప్రస్తుతం ఆయనమీద ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలోనూ అనిల్ కుమార్ రెడ్డి ముందున్నట్లు టాక్ వినిపిస్తోంది. రాహుల్ గాంధీ చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్రకు సంఘీభావంగా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోసైతం పాదయాత్ర చేపట్టారు.ఈ క్రమంలో.. క్షేత్ర స్థాయి సమస్యలపై పోరాడుతూ ప్రజలతో మమేకమవుతున్నారు అనిల్ కుమార్ రెడ్డి. మూసీ కాలువను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి, రీజినల్ రింగ్ రోడ్డు పేరుతో.. భువనగిరి మండల పరిధిలోని రైతుల భూములను ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ను.. భువనగిరి నియోజకవర్గంలో విజయవంతం చేయడంతో కాంగ్రెస్ క్యాడర్‌లో జోష్ వచ్చిందని పబ్లిక్‌లో ప్రచారం జరుగుతోంది. ఓవైపు భూదాన్ పోచంపల్లిలో గులాబీ పార్టీ నేతల భూదందాను వ్యతిరేకిస్తూ ధర్నాలు, ఆందోళనలు చేయడం.. భూదాన్ పోచంపల్లిలో మున్సిపాలిటీకి చెందాల్సిన భూములను అధికార పార్టీ నేతలు కబ్జా చేశారన్న ఆరోపణలను కుంభం గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్ళారు. దీంతో రెవిన్యూ, పోలీసులు తప్పని పరిస్థితుల్లో భూ ఆక్రమణకు పాల్పడినవారిపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. మరోవైపు రీజినల్ రింగ్ రోడ్డు అంశం టీపీసీసీ పెద్దలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవండంతో కుంభం అనిల్ కుమార్ రెడ్డికి కలిసొచ్చారని టాక్ వినిపిస్తోంది. జైలులో బాధితుల్ని పరామర్శించడం, వారికి బెయిల్ ఇప్పించేందుకు కుంభం చొరవ తీసుకోవడాన్ని టీపీసీసీ పెద్దలు మెచ్చుకున్నట్లు తెలుస్తోంది.

MLA ఫైళ్ల శేఖర్ రెడ్డి బినామీ పేర్లతో లే అవుట్ అభవృద్ది పేరుతో కాంట్రాక్ట్ పనులను చేయిస్తున్నారనే ప్రచారాన్ని కాంగ్రెస్ జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ ఘటనలతో.. భువనగిరి లో గులాబీ పార్టీకి చాలా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అనుచరులు భూములు కాపాడుకునేందుకే..రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చారనే ఆరోపణలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ సక్సెస్ అయ్యిందని ప్రచారం జరుగుతోంది. అన్నదాతలు ధాన్యం అమ్మలేక ఆకలితో అలమటిస్తుoటే.. బీఆర్ఎస్ దశాబ్ది వేడుకల పేరుతో సంబరాలు చేసుకుంటోందని అనిల్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

మొత్తానికీ వచ్చే ఎన్నికల్లో.. భువనగిరి అసెంబ్లీ సెగ్మెంట్ లో విజయం సాధించేందుకు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పక్కా ప్రణాళికతో ప్రజల్లోకి వెళుతున్నట్లు తెలుస్తోంది. అయితే కుంభం ఎత్తులు ఫలించి కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్ల కల నెరవేరుతుందో లేదో వేచి చూడాల్సిందే.

Tags

Read MoreRead Less
Next Story