Editorial: మంచిర్యాల BRSలో టికెట్ ఫైట్

Editorial: మంచిర్యాల BRSలో టికెట్ ఫైట్
సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో పార్టీకి విధేయులుగా ఉన్నవారిని ఎన్నికల బరిలో దింపేందుకు బీఆర్ఎస్‌ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.


మంచిర్యాల బీఆర్ఎస్‌లో టికెట్ వార్ జరుగుతోందా? నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే నడిపెల్లి విఫలమయ్యారా? కొత్త నేతను తెరపైకి తెచ్చేందుకు అధిష్ఠానం కసరత్తు చేస్తోందా?టికెట్‌ రేసులో ముందున్న నేత ఎవరు?

ఎన్నికల ముంగిట ఉన్న తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలు బహుముఖవ్యూహాలతో ఎన్నికల బరిలో దింగేందుకు సమాయత్తమవుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో పార్టీకి విధేయులుగా ఉన్నవారిని ఎన్నికల బరిలో దింపేందుకు బీఆర్ఎస్‌ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గులాబీ బాస్ కేసీఆర్ ఈ విషయంలో నిర్మొహమాటంగా వ్యవహరిస్తూ అభ్యర్ధుల వడపోత కార్యక్రమాన్ని చేపట్టినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ బీఆర్ఎస్‌లో పరిణామాలు మారుతున్నాయి. కొత్త పేర్లు తెరపైకి వస్తుండటంతో సిట్టింగ్ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు తన సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందోనని దిగులు పడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సారి ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని లేని పక్షంలో తన కుమారుడు విజిత్ రావును బరిలోకి దించాలనే యోచనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దివాకర్ రావు పనితీరుపై ప్రజలు, అటు క్యాడర్ అసంతృప్తితో ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఈసారి ఆయనను పక్కకు పెట్టాలని అధిష్టానం భావిస్తున్నట్టు సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గ అభివృద్ధికి పెద్దగా చేసిందేమీ లేదన్న అపవాదును ఎదుర్కొంటున్నారు. కేవలం కమీషన్ల కోసమే పనులు చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు అరోపిస్తున్నారు. మంచిర్యాల, నస్పూర్, లక్సెట్టిపేట మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యే అనుచరులు, అధికార పార్టీ లీడర్ల అవినీతి దందాల వెనుక ఆయన పాత్ర ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దివాకర్ రావు పట్ల తీవ్ర ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందని సొంత పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ పట్ల వ్యతిరేకత ఉన్న విషయం అధిష్టానం వద్దకు చేరడంతో రాబోయే ఎన్నికల్లో ఆయనను తప్పించబోతున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యే వర్గం కలవర పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో అప్రమత్తమయిన నడిపెల్లి కుమారుడు విజిత్ రావు బరిలోకి దిగేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.

మరోవైపు పనితీరు బాగోపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేలను సైతం తప్పిస్తామని సీఎం హెచ్చరికల నేపథ్యంలో పలువురు సీనియర్ లీడర్లు తెరపైకి వస్తున్నట్లు సమాచారం. వీరిలో మాజీ ఎమ్మెల్యే అరవింద రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌తో పాటు ఫిల్మ్ డెవలప్ మెంట్ మాజీ చైర్మన్ రామ్మోహన్ రావులు టికెట్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గెలుపు గుర్రాల అన్వేషణలో భాగంగా బీఆర్ఎస్ అధిష్టానం ఫిల్మ్ డెవలప్‌మెంట్ మాజీ చైర్మన్ పూస్కూర్ రామ్మోహన్ రావు పేరును నిశితంగా పరిశీలిస్తున్నట్టు నియోజక వర్గంలో ప్రచారం జరుగుతోంది. రామ్మోహన్ రావు బీఆర్ఎస్‌లో క్షేత్రస్థాయి నిర్మాణం నుండి కేసీఆర్‌కి సన్నిహితంగా మెలిగారని, అవినీతి ఆరోపణలు లేని క్లీన్ ఇమేజ్ ఉన్న నేత కావడంతో అధిష్టానం ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కేసీఆర్ మంచిర్యాల జిల్లా పర్యటన సందర్భంగా రామ్మోహన్ రావు స్వాగత పోస్టర్లను నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జీర్ణించుకోలేని ఎమ్మెల్యే దివాకర్ రావు తన అనుచరులతో పోస్టర్లను తొలగించారని రామ్మోహన్ రావు వర్గం ఆరోపిస్తోంది. దివాకర్ రావుకి రామ్మోహన్ రావుకి మధ్య ఉన్న టికెట్ వార్ నడుస్తుండగా మరోవైపు పలువురు దివాకర్ రావు అనుచరులు రామ్మోహన్ రావుతో టచ్ లో ఉన్నట్లు సమాచారం.

మరోవైపు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ లీడర్ అరవింద రెడ్డి పేరు సైతం నియోజకవర్గంలో జోరుగా వినిపిస్తోంది. ఆయన 2009-14 మధ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేశారు.. 2014 లో కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం 2018 లో కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో బీఆర్ఎస్‌లో చేరి దివాకర్ రావుకి గెలుపుకు కృషి చేశారు.. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ ఆదేశిస్తే ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు వినికిడి. ఇక మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ కూడా టికెట్ రేసులో ఉన్నట్టు అధిష్టానానికి సంకేతాలు పంపారు. ఆయన కూడా నియోజకవర్గంలో పర్యటిస్తూ పాత క్యాడర్‌ని కూడగడుతున్నట్లు సమాచారం.

ఏది ఏమైనా మరోసారి బరిలో దిగేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్ రావు శతవిధాల ప్రయత్నిస్తున్నారు ఒకవేళ తనకు టికెట్ నిరాకరిస్తే తన కొడుకు విజిత్ ను రంగంలోకి దింపేందుకు అన్ని రకాల ఎత్తుగడలు వేస్తున్నారు .. సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్ రావు టికెట్ సాధించుకుంటాడో, తన కొడుకుకు ఇప్పించుకుంటాడ లేక వేరే వాల్లకు వెళుతుందా టికెట్ అన్న చర్చ జోరుగా సాగుతోంది..ఈ పరిణామాలు ఎలా ఉండబోతాయో మరికొంత కాలం వేచి చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story