పాలమూరు హస్తంలో జోష్

పాలమూరు హస్తంలో జోష్
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైనట్లే అని ప్రచారం జరుగుతోంది.

ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు మారనున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు నేతలు తమ రాజకీయ భవిష్యత్‌పై కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు కొడంగల్ కు చెందిన సీనియర్ నేత గుర్నాథ్ రెడ్డి సొంత గూటికి చేరేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీరితో పాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి సైతం హస్తం చెంతకు చేరే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతుంది.అధికార బిఆర్ఎస్ లో అసమ్మతి నేతలుగా ముద్ర పడిన నేతలు చేయి అందుకోబోతున్నట్లు ఇటీవలి కాలంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైనట్లే అని ప్రచారం జరుగుతోంది. ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో అగ్రనేతల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆయన ఇటీవల పలువురు కాంగ్రెస్ నేతలతో తరచుగా చర్చలు జరుపుతుండటం.. ఇందుకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ప్రచారం జరగడంతో మరో మారు కొడంగల్ రాజకీయం రసవత్తరంగా మారింది. నియోజకవర్గంలో 30 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవంతో ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేసి ఆయన గెలుపులో కీలక పాత్ర కూడా పోషించారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ లోకి వెలుతున్నట్టు ప్రకటించడంతో కొడంగల్ రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయని పబ్లిక్ టాక్.

మరోవైపు ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి సైతం కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరే అంశంపై ఇప్పటికే టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవితో చర్చించిన కూచుకుళ్ళ త్వరలో పార్టీ సీనియర్ నేత నాగం జనార్ధన్ తోనూ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో తన కొడుకు రాజేష్ రెడ్డిని ఈసారి ఎన్నికల బరిలో నిలిపేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్ లోకి వస్తానంటే స్వాగతిస్తామని కానీ తన గెలుపుకు సహకరించాలని నాగం బహిరంగంగానే కుచుకుళ్లకు కండిషన్ పెట్టిన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరువురి నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం.

మొత్తంగా అసెంబ్లీ ఎన్నికలు కొద్ది నెలల్లో జరగనున్న నేపథ్యంలో సీనియర్ నేతలు కాంగ్రెస్‌లోకి క్యూ కడితే జిల్లాలో రాజకీయ ముఖచిత్రం మారిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story