Editorial: సూర్యాపేట కాంగ్రెస్‌లో టికెట్ ఫైట్

Editorial: సూర్యాపేట కాంగ్రెస్‌లో టికెట్ ఫైట్
సూర్యాపేట కాంగ్రెస్‌లో వర్గపోరు పతాక స్థాయికి చేరిందా? టికెట్ రేస్ సీనియర్ వర్సెస్‌ జూనియర్ అన్నట్లుగా సాగుతోందా? దామోదర్ రెడ్డి, రమేష్‌ రెడ్డి వర్గాలు టికెట్ నాకంటే నాకని ప్రచారం చేసుకుంటున్నాయా?

సూర్యాపేట కాంగ్రెస్‌లో వర్గపోరు పతాక స్థాయికి చేరిందా? టికెట్ రేస్ సీనియర్ వర్సెస్‌ జూనియర్ అన్నట్లుగా సాగుతోందా? దామోదర్ రెడ్డి, రమేష్‌ రెడ్డి వర్గాలు టికెట్ నాకంటే నాకని ప్రచారం చేసుకుంటున్నాయా?

అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఉన్న తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టికెట్ ఆశిస్తున్న పలువురు ఆశావహులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆశావహుల పోటీతో ఇప్పటికే బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్న అభ్యర్థులు తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా సూర్యాపేట కాంగ్రెస్‌లలో నివురు గప్పిన నిప్పులా ఉన్న వర్గ పోరు భగ్గు మంటోంది. ఓవైపు సీనియర్ నేత మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి.. మరోవైపు రేవంత్ రెడ్డితో పాటు టీడీపీ నుండి కాంగ్రెస్‌లో చేరిన పటేల్ రమేష్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వస్తే భగ్గుమంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో హస్తం పార్టీ టిక్కెట్ కోసం పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. దామోదర్ రెడ్డి, రమేష్ రెడ్డి వర్గాలు.. ఎవరికి వారే గ్రూపులు మెయింటైన్ చేస్తూ.. రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. వాస్తవానికి సీనియర్ పొలిటీషియన్ అయిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి వయసు రీత్యా ఆరోగ్యం సహకరించడం లేదని పార్టీలో చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన మోకాలి ఆపరేషన్ దామోదర్ రెడ్డికి ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో.. హస్తం పార్టీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న రమేష్ రెడ్డి కి ఏఐసీసీ, టీపీసీసీ పెద్దలు హ్యాండ్ ఇవ్వడంతో నిరాశకు గురయ్యారు. దామోదర్ రెడ్డికి రాష్ట్ర, జాతీయ పార్టీ నాయకత్వాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఆయనకు టికెట్ తెచ్చిపెట్టాయని అప్పట్లో ప్రచారం జరిగింది.

ఈ నేపధ్యంలో ఈసారి తనకు అవకాశమివ్వాలని పటేల్ రమేష్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దగ్గర గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి రేవంత్ రెడ్డిని నమ్ముకునే.. గతంలో పటేల్ రమేష్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే 2018 ఎన్నికల్లో సూర్యాపేట నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ సీనియర్ నేత దామోదర్ రెడ్డినే టికెట్ వరించింది. ఆ సమయంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇస్తామని అధిష్ఠాన పెద్దలు పటేల్ రమేష్ రెడ్డికి హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఈసారి టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న రమేష్ రెడ్డి తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఇటు పీసీసీ చీఫ్ రేవంత్ .. తన శిష్యుడు రమేష్ రెడ్డి టికెట్ కోసం హైకమాండ్‌ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ మధ్య దామోదర్ రెడ్డి అనారోగ్యం బారిన పడటంతో రమేష్ రెడ్డి మరింత దూకుడు పెంచినట్లు టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన హాథ్ సే హాథ్ జోడోయాత్రకు మద్దతుగా.. సూర్యాపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో.. దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర అన్ని గ్రామాల్లో హాథ్ సే హాథ్ జోడో యాత్ర నిర్వహించారు పటేల్ రమేష్ రెడ్డి. అంతేకాకుండా ఓ ఎన్జీవో ద్వారా గత ఐదేళ్లుగా పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువయినట్లు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.

వచ్చే ఎన్నికల్లో సూర్యాపేట హస్తం పార్టీ టిక్కెట్ తనకే దక్కుతుందన్న ధీమాతో ఉన్నారు పటేల్ రమేష్ రెడ్డి. ఆయన అనుచరులు సైతం ఇదే విషయాన్ని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీంతో ఓ వైపు రమేష్ రెడ్డికే టికెట్ అని ప్రచారం జరుగుతుండటంతో దామోదర్ రెడ్డి వర్గీయులు సైతం అదును చూసి రమేష్ రెడ్డి వైపు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈక్వేషన్స్ కలిసొస్తే రమేష్ రెడ్డి టిక్కెట్‌కు ఢోకా లేదని ఆయన కేడర్ డంకా బజాయించి మరీ చెబుతోంది. పరిస్థితులు తలకిందులై రమేష్ రెడ్డికి హైకమాండ్ మరోసారి హ్యాండిస్తే దాని పరిణామాలు మరోలా ఉంటాయని క్యాడర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. టిక్కెట్ వచ్చినా.. రాకున్నా బరిలో దిగేది మాత్రం పక్కా అని కార్యకర్తలతో రమేష్ రెడ్డి చెబుతున్నట్లు తెలుస్తోంది. మనమంతా యుద్దానికి సిద్ధమవుదామని క్యాడర్‌కు ఇప్పటికే సంకేతాలిచ్చిన రమేష్‌ రెడ్డి నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వయస్సు, ఆరోగ్యం సహకరించకపోయినా.. తగ్గేదేలే అంటున్న దామోదర్ రెడ్డి తన అనుచరులతో సమీక్ష నిర్వహిస్తూ రమేష్ రెడ్డి ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు.. ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నట్లు సమాచారం.

ఓ వైపు సూర్యాపేట నుంచి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ మంత్రి జగదీష్ రెడ్డి వ్యూహరచన చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి భావిస్తున్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. అయితే.. పటేల్ రమేష్ రెడ్డి దామోదర్ రెడ్డికి అడ్డంకి మారారని ఈసారి యువనేత రమేష్ రెడ్డికే టికెట్ అన్నట్లుగా ఆయన వర్గం ప్రచారం చేస్తుండటంతో.. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇరువురి నేతల ఆధిపత్య పోరుతో సూర్యాపేట కాంగ్రెస్‌లో సీనియర్ వర్సెస్ జూనియర్‌ల మధ్య కోల్డ్ వార్ హాట్ హాట్ గా కొనసాగుతోందని క్యాడర్‌లో ప్రచారం జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story