Editorial: కొవ్వూరు దూసుకుపోతున్న సైకిల్

Editorial: కొవ్వూరు దూసుకుపోతున్న సైకిల్
ఎన్నికల బరిలో అధికార వైసీపీ ఫ్యాన్ రెక్కలు ఊడిపోవడం ఖాయమని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది

కొవ్వూరులో సైకిల్ రయ్ మంటూ దూసుకుపోతోందా? ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు క్యూ కడుతున్నారా? అధినేత గ్రీన్ సిగ్నల్ కోసం నేతలు ఎదురు చూస్తున్నారా? ఈ సారి ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు ఊడిపోవడం ఖాయమేనా?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ అక్కడి ఓటర్లు సైకిల్ వెంటే నడుస్తారు. 2004లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గెలిచినా, కొవ్వూరు ఓటర్లు మాత్రం తెలుగుదేశానికే పట్టం కట్టారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ సారి నియోజకవర్గంలో పార్టీ గెలుపు నల్లేరుపై నడకేనన్న చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆశావహుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ పరిణామాల నేపధ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు ద్విసభ్య కమిటీని నియమించారు. కమిటీలో సభ్యులుగా సీనియర్ నాయకులు జొన్నలగడ్డ చౌదరి, కంఠమని రామకృష్ణలను నియమించారు. ఇరువురు నేతలు కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకువస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో దాదాపు 90 శాతం మంది నాయకులు, కార్యకర్తలు అంతా ఏకతాటిపైకి రాగా, కేవలం కొద్ది మంది మాత్రం అధికార పార్టీ అరాచకాలకు భయపడుతూ దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. వీరు కూడా ఎన్నికల సమయానికి పార్టీలో చురుగ్గా పాల్గొంటారని పార్టీ వర్గాలు అంచనావేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ తరపున పోటీ చేసేందుకు పలువురు అశావహులు క్యూ కడుతుండటంతో అటు క్యాడర్‌లో జోష్ నెలకొంది.

2014 ఎన్నికల్లో కొవ్వూరు నుంచి జవహార్ పోటీ చేసి గెలుపొందగా, 2019 ఎన్నికల్లో వంగలపూడి అనిత పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజా పరిణామాల నేపధ్యంలో దాదాపు ఆరడజను మందికి పైగా నేతలు కొవ్వూరు నుండి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆశావహుల్లో ముఖ్యంగా మాజీ మంత్రి, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు జవహర్ అయితే ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో తిరువూరు నుంచి పోటీ చేసిన ఆయన, ఇప్పుడు కొవ్వూరు నుంచి మళ్లీ ఎన్నికల బరిలో దిగాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఇక మరో మాజీ మంత్రి పీతల సుజాత కూడా ఈ సారి కొవ్వూరు నుంచి పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. చింతలపూడి లేదా కొవ్వూరు నియోజకవర్గాల నుండి ఎక్కడ టిక్కెట్ కేటాయించినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధినేతకు విన్నవించినట్లు సమాచారం. వీరితో పాటు కొందరు స్థానిక నేతలు సైతం ఈ సారి ఎన్నికల బరిలో దిగేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వారిలో కొందరు ఇప్పటికే పార్టీ పెద్దాయనను కలిసి, ఆయన ఆశీస్సులు కూడా తీసుకున్నట్లు పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. సివిల్ ఇంజనీర్ అయిన గెడ్డం గంగాచలం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆయన పార్టీ అధినేత చంద్రబాబును కలిసి తన మనసులోని మాటను చెప్పినట్లు వినికిడి.

మరోవైపు గెడ్డం గంగాచలం ద్విసభ్య కమిటీ సభ్యులతో ఎక్కువగా టచ్‌లో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. నియోజకవర్గ టీడీపీలో నెలకొన్న సానుకూల వాతావరణం నేపథ్యంలో నేతలు పోటీపడుతుండటంతో అటు క్యాడర్‌లో ఉత్సాహం ఉరకలేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే జోష్‌తో ఎన్నికల బరిలో దిగితే అధికార వైసీపీ ఫ్యాన్ రెక్కలు ఊడిపోవడం ఖాయమని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story