Editorial: ఉప్పల్ బీఆర్ఎస్‌లో టికెట్ వార్

Editorial: ఉప్పల్ బీఆర్ఎస్‌లో టికెట్ వార్


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో పలు నియోజకవర్గాలలో ఆశావహులు టికెట్ రేసు మొదలు పెట్టారు. ముఖ్యంగా ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్‌లో టికెట్ ఫైట్ తార స్థాయికి చేరినట్లు టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధిష్టానం తనకే టికెట్ ఇస్తుందన్న ధీమాను ఎవరికి వారు వ్యక్తం చేస్తూ పోటా పోటీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2009లో ఏర్పడిన ఉప్పల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ వరుసగా విజయం సాధించలేదు. 2009 లో కాంగ్రెస్ అభ్యర్థి బండారి రాజిరెడ్డి విజయం సాధించగా.. 2014 లో బీజేపీ అభ్యర్థి ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్ విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భేతి సుభాష్ రెడ్డి విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో ఉప్పల్ బరిలో దిగేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డితో పాటు జీహచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి సోదరుడు బండారి లక్ష్మారెడ్డి, జీహెచ్‌ఎంసీ డిప్యుటీ మేయర్ భర్త మోతె శోభన్ రెడ్డి ....ఇన్నాళ్ళు చాప కింద నీరులా ప్రచారం చేస్తున్న నేతలు తాజాగా ఉప్పల్ నియోజకవర్గంలో ...KTR పర్యటన సందర్భంగా బల ప్రదర్శన దిగడం అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఎవరికి వారు కేటీఆర్‌కు కు స్వాగతం పలుకుతూ బ్యానర్లు , హోర్డింగులు ఏర్పాటు చేయడం తో పాటు అనుచరులతో ప్లకార్డ్ లు ప్రదర్శించారు.

రాబోయే ఎన్నికల్లో ఉప్పల్ నియోజక వర్గంలో మరో సారి టికెట్ నాకే అనే ధీమా లో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి. సుభాష్ రెడ్డి పై వ్యక్తిగతంగా ఎలాంటి విమర్శలు లేనప్పటికీ..బీఆర్ఎస్‌లో టికెట్ పోటీ ఎక్కువ కావడంతో క్యాడర్ చీలిపోయింది.ఎవరెన్ని గ్రూప్ లు కట్టినా కేసీఆర్‌కు తెలంగాణ ఉద్యమ సహచరుడయిన తనకే అధినేత ఆశీస్సులు మెండుగా ఉన్నాయని.... ఉప్పల్ టికెట్ నాదేనని భేతి సుభాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ మేయర్‌గా ఉన్న సమయంలోనే 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఉప్పల్ BRS టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈ సారైనా ఉప్పల్ టికెట్ వస్తుందని ఆశతో ఉన్నారు బొంతు రామ్మోహన్. కేటీఆర్ అండదండలు మెండుగా ఉన్న తనకే ఉప్పల్ టికెట్ వస్తుందని రామ్మోహన్ చెబుతున్నారు. చెర్లపల్లి కార్పొరేటర్ గా తన భార్య ఉండటం తెలంగాణ ఉద్యమ కారుడనైన తనకే అధిష్ఠానం టికెట్ కేటాయిస్తుందని బొంతు రామ్మోహన్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ఉప్పల్ టికెట్ ను ఆశిస్తున్న బండారి.లక్ష్మారెడ్డి బీఎల్‌ఆర్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. 2014 లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన లక్ష్మారెడ్డి ....2018 లో మహా కూటమి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే పొత్తులో భాగంగా ఉప్పల్ టికెట్ టీడీపీకి కేటాయించడంతో లక్ష్మారెడ్డి బీఆర్ఎస్‌లో చేరి ఆ పార్టీ అభ్యర్థి భేతి సుభాష్ రెడ్డి గెలుపు కోసం కృషి చేశారు. 5 ఏళ్ళుగా పదవి లేకున్నా అనునిత్యం ప్రజల్లో ఉంటూ బీఎల్‌ఆర్ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు లక్ష్మారెడ్డి.ఉప్పల్ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా , రాష్ట్ర ప్రభుత్వ పధకాలు ప్రజలకు చేరువ అయ్యేలా చేస్తున్నారు. ఏ పదవీ లేకున్నా పార్టీకి విధేయుడిగా ఉంటున్న బీఎల్ఆర్... KCR , హరీష్ రావు ,KTR తో ఉన్న సత్సంబంధాలతో పాటు వివాదరైతుడిని అయిన నాకే ఉప్పల్ BRS టికెట్ అంటున్నారు ...బండారి లక్ష్మారెడ్డి.

మరోవైపు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత భర్త... మోతె శోభన్ రెడ్డి ...ఉప్పల్ బరిలో నేనూ ఉన్నానంటూ హల్చల్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఉన్న పిడికెడు మంది ఉద్యమకారుల్లో ఒకరు శోభన్ రెడ్డి. కేసీఆర్‌కు నమ్మిన బంటుగా, ప్రస్తుత బీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న శోభన్ రెడ్డికి ఉప్పల్ నియోజకవర్గంలోని పలు కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులతో సత్సంబంధాలున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సారి తనకు టికెట్ కేటాయిస్తారని అధినేత కేసీఆర్‌ పై గంపెడాశలు పెట్టుకున్నారు.

ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇటీవల కేటీఆర్ ఏ నియోజకవర్గంలో పర్యటించినా అక్కడే జరిగే బహిరంగ సభలో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిని దాదాపు ప్రకటించేస్తున్నారు. కానీ ఉప్పల్ మీటింగ్ లో ఎవ్వరి పేరు చెప్పకపోవడం ఉప్పల్ బీఆర్ఎస్‌లో చర్చనీయాంశంగా మారింది. ఆశావహులందరిని స్టేజ్ పై తన ప్రక్కనే కూర్చోబెట్టుకున్న కేటీఆర్ ..వచ్చే ఎన్నికల్లో టికెట్ సిట్టింగ్ కు ఇస్తారా....లేక సిటింగ్ కు ఫిట్టింగ్ పెట్టి ఆశావహులలో ఎవరికో ఒకరికి ఇస్తారోనని నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు కాంగ్రెస్.. బీజేపీలు ప్రయత్నాలు మొదలుపెట్టిన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ లో వర్గపోరుకు పార్టీ అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story