Editorial: ఆ మంత్రికి ఈ సారి టికెట్ డౌటేనా..?

Editorial: ఆ మంత్రికి ఈ సారి టికెట్ డౌటేనా..?
ఆ మంత్రికి సొంత సెగ్మెంట్లోనే కష్టాలు మొదలయ్యాయా? టికెట్ కోసం ఆశావహులు పోటీ పడుతుండటంతో ఆమాత్యులు ఉక్కిరిబిక్కిరవుతున్నారా? అవినీతి ఆరోపణలు వివాదాలు చుట్టుముట్టడంతో ఆమాత్యునికి ఎదురుగాలి వీస్తోందా? ఇంతకీ ఎవరా మంత్రి?

ఆ మంత్రికి సొంత సెగ్మెంట్లోనే కష్టాలు మొదలయ్యాయా? టికెట్ కోసం ఆశావహులు పోటీ పడుతుండటంతో ఆమాత్యులు ఉక్కిరిబిక్కిరవుతున్నారా? అవినీతి ఆరోపణలు వివాదాలు చుట్టుముట్టడంతో ఆమాత్యునికి ఎదురుగాలి వీస్తోందా? ఇంతకీ ఎవరా మంత్రి?

గుమ్మనూరు జయరాం ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేస్తూ వార్తల్లో ఉండే ఏపీ మంత్రి. కర్నూలు జిల్లా ఆలూరు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న జయరాం అమాత్యునిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన స్వగ్రామంలో మంత్రి సోదరులు పేకాట క్లబ్‌లు, నాటు సారా స్థావరాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో సెబ్ అధికారులు దాడులు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అయినా బీసీ బోయ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే కావడంతో జగన్ కేబినెట్‌లో రెండో సారి అమాత్యునిగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో సొంత సెగ్మెంట్‌లోనే మంత్రి జయరాంకు కష్టాలు ఎదురవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో ఆలూరు టికెట్ ఆశించే నేతల సంఖ్య పెరగడంతో జయరాం కలవరపడుతున్నట్లు తెలుస్తోంది. ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ ఇంచార్జ్ కోట్ల సుజాతమ్మ బలంగా ఉండటంతో ఆమెను ఢీకొట్టేందుకు బలమైన అభ్యర్థిని వైసీపీ అధిష్ఠానం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలూరులో బీసీల ప్రాబల్యం అధికంగా ఉన్నా .. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కోట్ల సుజాతమ్మ తమ పుట్టింటి ప్రాంతం అయిన ఆలూరు సెగ్మెంట్‌లో టీడీపి తరపున గట్టిగా పోరాడుతున్నట్లు టాక్. మహిళా నేత అయ్యుండి ధైర్యంగా మంత్రి జయరాంని ఢీకొంటున్నట్లు వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మంత్రి జయరాంని సార్వత్రిక ఎన్నికల బరిలో దించేందుకు వైసీపీ అధిష్టానం వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కోట్ల సుజాతమ్మ ఆలూరు టీడీపీ బరిలో ఉన్నారు కాబట్టి ఆమెను ఢీ కొట్టేందుకు రెడ్డి సామాజిక వర్గం లేదా..బలమైన మరో బీసీ నేతకు టికెట్ కేటాయించాలని వైసీపీ పెద్దలు భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ జాబితాలో జడ్పీటీసీ విరుపాక్షి పేరు ముందు వరుసలో ఉన్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. జడ్సీటీసీ విరూపాక్షి ఆర్థికంగా బలమైన నేతే కాకుండా బోయ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆమెకే ఆలూరు టికెట్ ఇవ్వొచ్చనే టాక్ జోరుగా వినిపిస్తోంది. అయితే మంత్రి జయరాం మాత్రం తనకు ఎంపీ టికెట్ ఇచ్చినా ఆలూరు టికెట్ మాత్రం తమ కుటుంబానికే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

మరోవైపు బీసీ బోయ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన దివంగత కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు కుమార్తె బొజ్జమ్మ వైసీపీలో చేరడం జయరాం వర్గంలో మరింత టెన్షన్ పెంచినట్లు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ అధిష్టానం బొజ్జమ్మను ఆలూరులో పార్టీ బలోపేతం పై ఫోకస్ పెట్టాలని సూచించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే బొజ్జమ్మ చేరిక మంత్రి జయరాం వర్గానికి మింగుడుపడటం లేదని తెలుస్తోంది. పార్టీ అధిష్టానం నేరుగా బొజ్జమ్మతో సంప్రదింపులు జరిపి పార్టీలో చేర్చుకోవడంతో జయరాం ఏమీ చేయలేక మిన్నకుండిపోయినట్లు సమాచారం. ఈ క్రమంలో బొజ్జమ్మ ఆలూరు నియోజకవర్గంలో పర్యటిస్తూ వైసీపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారితే మంత్రి జయరాం వర్గీయులు, ఆయన సోదరులు సపోర్ట్‌ చేస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయినా ఆలూరు టికెట్ తమదేనంటూ బొజ్జమ్మ వర్గీయులు హల్‌చల్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ అడ్డువస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పోలీసులను సైతం బొజ్జమ్మ వర్గీయులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది.

మరోవైపు కోట్ల సుజాతమ్మకు దీటుగా రెడ్డి సామాజిక వర్గం నేతలను వైసీపీ ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ కోసం కష్ట పడి ఎలాంటి పదవి దక్కక తీవ్ర అసంతృప్తిలో ఉన్న వైసీపీ రాష్ట్ర నాయకులు తెరనేకల్ సురేందర్ రెడ్డి ఆలూరు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఆలూరు మాజీ ఎమ్మెల్యే దివంగత నీరజారెడ్డి కుమార్తె , ఎన్నారై హిమవర్ష రెడ్డి కూడా ఆలూరు టికెట్‌ను ఆశిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆలూరు టికెట్ జయరాం కుటుంబానికి ఇవ్వకపోతే జడ్పీటీసీ విరుపాక్షికా, బొజ్జమ్మకా..లేక రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తారా అన్నది నియోజకవర్గంలో చర్చ నీయాంశంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story