ఉమ్మడి మెదక్ జిల్లాలో మేమింతేనంటున్న కాంగ్రెస్ లీడర్లు

ఒకప్పుడు మెదక్ జిల్లాలో తిరుగులేని విజయాలు సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు డీలా పడింది? పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే ఆ జిల్లాలో పర్యటించలేని పరిస్థితి నెలకొనడానికి నేతల మధ్య విభేదాలే కారణమా? ఆ ముగ్గురు ముఖ్య నేతలతో రేవంత్‌రెడ్డికి ఉన్న గ్యాపే వల్లే పర్యటన వాయిదా పడుతోందా? పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా మారుతున్నా నేతల్లో మార్పు రావడం లేదా..?
ఉమ్మడి మెదక్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట... దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఇక్కడి నుండి ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. ఆమె క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ జిల్లా ఆదరించి అక్కున చేర్చుకోవడంతో మెదక్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అలాంటి కంచుకోటకు రాష్ట్ర విభజన తరువాత బీఆర్ఎస్ ఎఫెక్ట్‌తో బీటలు వారింది. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో అయితే... సరైన నాయకుడు లేకపోవడంతో క్యాడర్ దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని టాక్ వినిపిస్తోంది. ఇంత జరుగుతున్నా నేతల తీరు మాత్రం మారడం లేదు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో చేయాలనుకున్నారట. దీనికి తగ్గట్లు నెల రోజుల క్రితం ఏర్పాట్లు జరిగాయి. కానీ పర్యటన వాయిదా పడింది. ఇటీవల మళ్లీ... ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ మళ్లీ సేమ్ సీన్ రిపీటయింది. ఇంతకీ రేవంత్‌రెడ్డి టూర్ జరుగుతుందా... లేదా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు.
జిల్లాలో కీలకంగా ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి, పీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, మరో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిల మధ్య అభిప్రాయభేదాలున్నాయి. ఈ ముగ్గురు నేతలకూ రేవంత్‌రెడ్డికీ మధ్య గ్యాప్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రేవంత్‌రెడ్డి పేరు చెబితేనే నేతలు ఫైర్ అవుతుండటంతో ..ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్‌రెడ్డి జిల్లాలో పర్యటిస్తే... ముగ్గురు నేతలూ వచ్చే పరిస్థితులు కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి పర్యటన చేపడితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని కాంగ్రెస్ ముఖ్య నేతలు భావిస్తున్నారు. అందుకే... వరుసగా రేవంత్‌రెడ్డి టూర్ వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు నారాయణఖేడ్‌లో ఉన్న గ్రూపు తగాదాలతో పార్టీ పరువు బజారున పడుతోందని ప్రచారం జరుగుతోంది. మాజీ ఎంపి సురేష్ షెట్కార్, పీసీసీ నేత సంజీవరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట. పార్టీ కార్యక్రమాలు కూడా వేర్వేరుగానే చేస్తుండటంతో క్యాడర్ గందరగోళానికి గురవుతోందట.
అటు ముగ్గురు సీనియర్లు రేవంత్ రెడ్డి పర్యటనకు డుమ్మా కొట్టే అవకాశాలుండటం, ఇటు గ్రూపు తగాదాలతో మరిన్ని ఇబ్బందులు తలెత్తే ప్రమాదంతో జోడో యాత్ర వాయిదా పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ నేతలు ఐక్య కార్యాచరణతో ముందుకెళ్లకపోగా ..ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా వ్యవహరిస్తున్నారని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com