మెదక్‌లో మైనంపల్లి రోహిత్ దూకుడు..బరిలో నిలిచేందుకు పక్కా ప్లాన్‌

మెదక్‌లో మైనంపల్లి రోహిత్ దూకుడు..బరిలో నిలిచేందుకు పక్కా ప్లాన్‌
సేవా కార్యక్రమాలతో ప్రజలకు తలలో నాలుకలా మారారా? తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న రోహిత్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్నారా?

మెదక్‌లో దూకుడు పెంచిన మైనంపల్లి రోహిత్ మెదక్ నియోజకవర్గంపై మైనంపల్లి రోహిత్ పట్టు బిగించారా? సేవా కార్యక్రమాలతో ప్రజలకు తలలో నాలుకలా మారారా? తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న రోహిత్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్నారా? రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు పక్కా స్కెచ్ వేశారా?

ఎన్నికల ఏడాది రావటంతో అధికార బీఆర్ఎస్ నేతలు పావులు వేగంగా కదుపుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోవాలని వ్యూహరచన చేస్తున్నారు. అయితే మెదక్ జిల్లాలోని ఓ సీటు వ్యవహారం కూడా అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారుతోంది. గతంలో మెదక్ ఎమ్మెల్యేగా పనిచేసిన మైనంపల్లి హన్మంతరావు తనయుడ్ని బరిలో దించాలని భావిస్తున్నారు. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా హన్మంతరావు కుమారుడు మైనంపల్లి రోహిత్ పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ నియోజకవర్గంపై పట్టు బిగించారు. నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. . తనకు రాజకీయ భిక్ష పెట్టి...రెండు సార్లు ఎమ్మెల్యేను చేసిన మెదక్ అభివృద్ధి కోసం తన మైనంపల్లి హన్మంత రావు కృషి చేస్తున్నారు. మెదక్‌లో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు తన కుమారుడు రోహిత్‌ను రంగంలోకి దింపారు. తండ్రి ఆదేశాలతో మైనంపల్లి రోహిత్ మెదక్ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుబడుతున్నారని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది.

స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండేదుకు మెదక్ టౌన్‌లో రోహిత్ ఇంటి నిర్మాణం చేపట్టారు. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా మెదక్ నియోజకవర్గంలో అనాథ పిల్లలకు ఒకొక్కరికి 25 వేల రూపాయల చొప్పున 500 మందికి ఒక కోటి 25 లక్షల రూపాయలను ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్ల ను అందించారు. 1997 నుంచి మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తనకు రెండు కళ్ళ లాంటి మెదక్ , మల్కాజిగిరి ప్రజలకు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అండగా ఉంటుందని మైనంపల్లి రోహిత్ భరోసా ఇస్తున్నారు. గతంలో మెదక్ ఎమ్మెల్యేగా తన తండ్రి మైనంపల్లి హన్మంత రావు ప్రతి గ్రామంలో బోర్లు వేయించి ....అందరికి త్రాగు నీరు అందించి వాటర్ మ్యాన్‌గా గుర్తింపు పొందారు. మెదక్ ప్రజలకు శుద్ధమైన త్రాగు నీరు అందించేందుకు నార్సింగి మండలంలో ఆర్వో ప్లాంట్‌లను మైనంపల్లి రోహిత్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే మైనంపల్లి రోహిత్ రాకను స్వాగతించిన మెదక్ ప్రజలు పార్టీలకతీతంగా గెలిపిస్తామని అభిమానులు చెబుతున్నారు. సర్వేలు అన్ని మెదక్‌లో మైనంపల్లి రోహిత్ వైపు మొగ్గు చూపుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ అధిష్ఠానం రోహిత్ పట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మెదక్ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల లను దత్తత తీసుకొని వాటిని మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఆధునికీకరిస్తున్నట్లు సమాచారం. మెదక్ గర్ల్స్ హైస్కూల్, దామర చెరువు స్కూళ్లకు రంగులు వేయించడంతో పాటు కంప్యూటర్ లాబ్‌లు , సీసీటీవీ, పార్క్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

రామాయంపేట మండలం దంతపల్లి గ్రామంలో తల్లిదండ్రులు లేని పేద పిల్లలకు ఇళ్ళు కట్టించారు. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా 100 జంటల పెళ్ళిలకు మంగళ సూత్రాలు, మెట్టలు అందించారు. రంజాన్ సందర్భంగా మెదక్ నియోజకవర్గ వ్యాప్తంగా రెండు వేల మంది పేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసరాల కిట్లను పంపిణీ చేశారు. మెదక్‌లో పేదవారికి ఎమ్‌ఎస్‌ఎస్‌వో ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. ఇళ్ళు లేని పేదలకు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ గూడు కల్పిస్తూ పేదలను అదుకుంటోందని పబ్లిక్ టాక్. అంతేకాదు చనిపోయిన పేద వారి అంతిమ సంస్కారాల కోసం ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇటీవల పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్స్ పంపిణీ చేశారు. మెదక్ నియోజకవర్గంలో అవసరం ఉన్నచోట బోర్లు వేయిస్తూ వేసవిలో దాహార్తిని తీరుస్తున్నారు. ఇటీవల మెదక్ నియోజకవర్గం హవేలీ ఘన్పూర్ మండలం కూచంపల్లి గ్రామంలో అగ్నిప్రమాదానికి గురై రెండు ఇళ్ళు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నికి ఆహుతయిన ఇళ్లను పరిశీలించిన మైనంపల్లి రోహిత్ బాధితులకు భరోసా ఇచ్చారు. తక్షణ సాయంగా ఒక్కో ఇంటికి 25 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. మెదక్ నియోజకవర్గంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అండగా ఉంటుందని రోహిత్ భరోసానిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story