ఆదిలాబాద్‌ బీఆర్ఎస్‌లో భగ్గుమన్న వర్గపోరు

ఆదిలాబాద్‌ బీఆర్ఎస్‌లో భగ్గుమన్న వర్గపోరు


ఆ ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందా ఒకే జిల్లాకు చెందిన ఆ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరుతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్‌లో నేతల మధ్య విభేదాలు బహిర్గత మవుతున్నాయి. ఒకే పార్టీలో ఉంటున్న వైరి వర్గాలు అవకాశం చిక్కినప్పుడల్లా పైచేయి సాధించేందుకు ఒకరిపై ఒకరు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదిలాబాద్ బీఆర్ఎస్‌లో నెలకొన్న వర్గపోరు రచ్చకెక్కింది. చూడటానికి కలిసిమెలిసి ఉన్నట్టు కనిపించే ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న... బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు జోగు రామన్న మంత్రిగా ఉన్న సమయంలో ఆయనతో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ చెట్టాపట్టలేసుకు తిరిగినట్లు జోరుగా ప్రచారం జరిగింది. రామన్న మంత్రి పదవి పోయాక రాథోడ్ బాపూరావ్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెంతకు చేరారు. అనంతరం జోగురామన్నకి జిల్లా అధ్యక్ష పదవి రావడంతో అప్పుడప్పుడు రామన్నను కలుస్తూ ఉండేవారు. అయితే బోథ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ వ్యతిరేక వర్గం గత కొంతకాలంగా యాక్టివ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే అవినీతితో పాటు నియోజకవర్గ అభివృద్దిపై బహిరంగానే విమర్శలు కురిపిస్తుండటంతో ఎమ్మెల్యే బాపూరావ్ ఇరకాటంలో పడ్డారు. ముఖ్యంగా బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ తనకంటూ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఓ గ్రూప్‌ని మెయిన్ టెయిన్ చేస్తూ ఎమ్మెల్యే బాపురావ్ కి కొరకరాని కొయ్యగా మారారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఎంపీపీ తుల శ్రీనివాస్ ఎమ్మెల్యే జోగురామన్నకి సన్నిహితుడు కావడంతో జోగురామన్న కావాలనే శ్రీనివాస్‌ని తనపై ఉసి గొల్పుతున్నారని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.


సొనాల మండల ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ఆయన వ్యతిరేక వర్గానికి పెద్ద యుద్ధమే జిరిగినట్లు తెలుస్తోంది. మండల సాధన సమితి చేపట్టిన నిరసన దీక్షల్లో ఎంపిపి తుల శ్రీనివాస్ వర్గం యాక్టివ్‌గా పాల్గొని ఎమ్మెల్యే వర్గాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పాటు ప్రకటనలు వచ్చినా.. సొనాల మండలంపై ప్రకటన రాకపోవడంతో ఇరువర్గాలు ఇరకాటంలో పడ్డాయి. సిఎం కేసీఆర్ ఆసిఫాబాద్ పర్యటన నేపథ్యంలో ఎంపిపి తుల శ్రీనివాస్, ఎమ్మెల్యే జోగు రామన్నలు సొనాల మండలంపై కేసిఆర్‌తో ప్రకటన విడుదల చేయించడమే కాకుండా నోటిఫికేషన్ కూడా జారీ చేయించారు. మండల ఏర్పాటు తమవల్లే సాధ్యమైందని సంబురాలు సైతం జరుపుకున్నారు. ఇది జరిగిన రెండు రోజులకే సొనాలలో బీఆర్ఎస్ చేపట్టిన విజయోత్సవ ర్యాలీతో వివాదం మరింత ముదిరినట్లు క్యాడర్‌లో చర్చ జరుగుతోంది. ఎంపిపి తుల శ్రీనివాస్ నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ సభకు స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్‌ని ఆహ్వానించకపోవడమే కాకుండా పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే జోగురామన్న, బోథ్ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎంపి గోడం నగేష్ లను ఆహ్వానించారు. సభకు వచ్చిన నేతలు రాథోడ్ బాపురావ్ టార్గెట్ గా విమర్శలు కురిపించడంతో బాపురావ్‌ తీవ్ర ఆగ్రహానికి గురయినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ మండల ఏర్పాటుకు రాథోడ్ బాపురావ్ అడ్డుపడ్దారని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మండలం ఏర్పాటు చేశామని నేతలు చేసిన ప్రకటనలు బీఆర్ఎస్‌లో అగ్గిరాజేశాయి.


తన నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో తనను పిలవ కుండా సంబురాలు చేసి ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఏం సందేశమిచ్చారని భగ్గుమంటున్నారు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్. ఈ పంచాయితీ కాస్త ప్రగతి భవన్ కి చేరగా.. ఎమ్మెల్యే జోగురామన్న వ్యవహార శైలిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు రాథోడ్ బాపురావ్. వాస్తవానికి ఈ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య విభేదాలు గత కొంతకాలం కిందనే మొదలయ్యాయి. బోథ్ లో ఉండాల్సిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉంటూ ఇక్కడి భూ సమస్యలు, రియల్ ఎస్టేట్ వంటి అంశాల్లో జోక్యం మితిమీరిందని రామన్న వర్గం ఆరోపిస్తోంది. ఇదంతా గమనిస్తున్న ఎమ్మెల్యే జోగురామన్న అవకాశం కోసం ఎదురుచూస్తూ వచ్చారు. జిల్లా అధ్యక్ష పదవి రావడంతో బోథ్ నియోజకవర్గంలో రామన్న కల్పించుకోవడంతో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం యాక్టివ్ అయింది..


మొత్తానికి ఆదిలాబాద్ జిల్లాలోని ఈ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ అధికార బీఆర్ఎస్‌తో పాటు విపక్షాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పార్టీ పెద్దలు కల్పించుకొని ఇద్దరు ఎమ్మెల్యేలను వివాదాన్ని పరిష్కరిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story