ఎంపీ అవినాష్‌ అరెస్ట్‌ విషయంలో నేడు బిగ్‌ డే

ఎంపీ అవినాష్‌ అరెస్ట్‌ విషయంలో నేడు బిగ్‌ డే
అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్‌ విచారణ చేపట్టనుంది

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ వ్యవహారంలో ఇవాళ బిగ్‌ డే అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్‌ విచారణ చేపట్టనుంది. ఇప్పటికే ఈ విషయంలో అవినాష్‌ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ విచారణ జరపాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ అవినాష్‌ పిటిషన్‌పై విచారణ జరిపి న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది. ఇక హైకోర్టు ఇవ్వబోయే ఆర్డర్లపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

అవినాష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లో వివేకా కుమార్తె సునీత కూడా ఇంప్లీడ్‌ కానున్నారు. అవినాష్‌కు ముందస్తు బెయిల్‌ ఇస్తే కేసులో జరిగే పరిణామాలపై కోర్టు దృష్టికి తీసుకెళ్తామని సునీత పేర్కొన్నారు.. ఇక సీబీఐ కూడా ఈ పిటిషన్‌లో ఇంప్లీడ్‌ కానున్నట్లు తెలుస్తోంది. అవినాష్‌ను అరెస్టు చేయాల్సిన అవసరాన్ని సీబీఐ.. కోర్టులో చెప్పనుంది. అలాగే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను కూడా కోర్టుకు వివరించనుంది. అవినాష్‌ విచారణకు హాజరు కాకుండా తప్పించుకోవడంతో ఈ కేసులో ఆయనపై అనుమానాలు బలపడుతున్నాయని సీబీఐ చెబుతుంది. ఇదే విషయాన్ని ఇవాళ కోర్టులో చెప్పనుంది. దీంతో అవినాష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ నిర్ణయం ఎలా ఉండబోతోందన్న చర్చ మొదలయ్యింది. హైకోర్టు ఇచ్చే ఆర్డర్‌ను బట్టి సీబీఐ అడుగులు ఉంటాయనే టాక్‌ వినబడుతోంది. ఏదేమైనా నేడు ఈ వ్యవహారం బిగ్‌ ఎపిసోడ్‌ కానుంది.

మరోవైపు తల్లి ఆరోగ్యంతో పాటు కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ పేరుతో గత కొన్ని రోజులుగా అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకావడం లేదు. సీబీఐ అధికారులు పదే పదే నోటీసులు ఇస్తున్నప్పటీకి అవినాష్ మాత్రం.. గైర్హాజరువుతూనే వస్తున్నారు. ఇక ఇవాళ్టి కోర్టు తీర్పును బట్టి సీబీఐ ముందుకు వెళ్లనునట్లు తెలుస్తోంది. ఒక వేళ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరిస్తే.. సీబీఐ దూకుడు పెంచే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు అవినాష్ అరెస్ట్‌ ఖాయమంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. వారం రోజులుగా సీబీఐకి స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలోనే తల్లితో కలిసి అవినాష్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అవినాష్‌నే వెంబడిస్తున్న సీబీఐ బృందం సైతం.. గత నాలుగు రోజులుగా కర్నూలులోని గెస్ట్‌ హౌస్‌లోనే ఉంది. ఇక ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ఆసక్తిగా మారనుంది.

మరోవైపు అవినాష్‌ రెడ్డి అరెస్టుతో మూలాలు కదలనున్నాయనే టాక్‌ గట్టిగానే విబడుతోంది. అందుకోసమే అవినాష్‌ను సీబీఐ అరెస్టు చేయకుండా తీవ్రంగా అడ్డుకుంటున్నారని చర్చించుకుంటున్నారు. చివరకు అధికార పార్టీ ఎంపీ కోసం పోలీసులను, ప్రజా ప్రతినిధులను కూడా వాడుకుంటున్నారని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనంగా చెప్తున్నారు. కర్నూలు విశ్వభారతి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వద్ద అదే హైడ్రామా నడుస్తోంది. తన తల్లికి బాగోలేదని అవినాష్‌ ఆస్పత్రిలోనే ఉన్నారు. ఇక కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిని రక్షణగా చేసుకుని అవినాష్‌ నడుపుతున్న హైడ్రామా అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. మొత్తంగా అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ పై విచారణ నేపథ్యంలో.. ఇవాళ ఏం జరగబోతుందోనని అందరిలోనూ ఆసక్తి పెరిగింది.

Tags

Read MoreRead Less
Next Story