బీఆర్ఎస్ నేతల యువ మంత్రం

బీఆర్ఎస్ నేతల యువ మంత్రం
ఓటర్లకు గాలం వేసేందుకు నేతలు వేస్తున్న స్కెచ్


తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నాయా ఓటర్లును ఆకర్షించేందుకు నేతలు పడరాని పాట్లు పడుతున్నారా ప్రభుత్వ పథకాలకు తోడుగా సొంత పథకాలను అమలు చేస్తున్నారా యువ ఓటర్లకు గాలం వేసేందుకు నేతలు వేస్తున్న స్కెచ్ ఏంటి

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు వినూత్నంగా వ్యవహరిస్తున్నారు. యువ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఓటు హక్కు పొందిన యువతకు గాలం వేస్తున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. కొత్తగా యువతను ఆకట్టుకునే విధంగా నూతనంగా ఓటు హక్కు పొందిన వారిని ఆకర్షించేలా కొత్త కొత్త జిమ్మికులతో ప్రజల్లోకి వస్తున్నాయి. 18 ఏళ్లు నిండి ఓటు హక్కు పొందిన యువతకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇప్పిస్తున్నాయి.. తద్వారా రాబోయే ఎన్నికల్లో తమకే ఓటు వేయాలని యువతను అభ్యర్థిస్తున్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నాగర్ కర్నూల్, గద్వాల నియోజకవర్గాలలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నికల్లో గెలుపు కోసం ముందస్తు వ్యూహాలు అమలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అందిస్తూ వాటిని ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నారు. మరోవైపు యువ ఓటర్లను ఆకట్టు కునేందుకు సరికొత్త మార్గాలు వెతుకుతున్నారు. ఇందులో భాగంగా కొత్తగా ఓటు హక్కు పొందిన వారికి డ్రైవింగ్ లైసెన్స్ లను ఉచితంగా అందిస్తున్నారు. అందుకోసం ప్రత్యేక డ్రైవ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళా పేరుతో నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాలో ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు.. డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అంటే కాస్త ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఎమ్మెల్యేలు కార్యక్రమాన్ని చేస్తున్నట్లు ప్రకటించడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. కొత్తగా ఓటు హక్కు పొందిన వారితో పాటు పర్మినెంట్ లైసెన్స్ పొందని వాళ్లు కూడా పెద్ద ఎత్తున తరలిరావడంతో అధికార పార్టీ నేతలు ఊహించినదానికంటే ఎక్కువగా సక్సెస్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. నాగర్ కర్నూల్ జిల్లాలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తన తండ్రి పేరుతో ఎంజీఆర్ టెస్టు పేరుతో కార్యక్రమాన్ని చేపట్టగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఉచిత మేళా పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తున్నారు.

రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు యూత్ ని లక్ష్యంగా చేసుకుంటూ ఓట్లు కొల్లగొట్టేలా వ్యూహాలు రచిస్తున్నారు. సరికొత్త పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. మరి లైసెన్స్ పొందిన యూత్ అంతా వచ్చే ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపిస్తారో లేదో వేచి చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story