Editorial: కోర్టు కేసులతో బీఆర్ఎస్‌లో కలవరం

Editorial: కోర్టు కేసులతో బీఆర్ఎస్‌లో కలవరం
ఎన్నికల ముంగిట్లో అధికార పార్టీకి కొత్త చిక్కులు వస్తున్నాయా? గత ఎన్నికల సమయంలో నేతలు ఇచ్చిన తప్పుడు అఫిడవిట్లు ఇబ్బందికరంగా మారాయా? ఎలక్షన్ కమిషన్‌కు తప్పుడు ధృవ పత్రాలు ఇచ్చారంటూ ఒక ఎంపీ, ఎమ్మెల్యేలపై కోర్టు కీలక తీర్పు ఏం చెబుతోంది? బిఆర్ఎస్ నేతలకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో పార్టీకి సమస్యలు తప్పవా?



తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్‌ నేతల్లో టెన్షన్ పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తప్పుడు అఫిడవిట్లను సమర్పించడంతో వారిపై అనర్హత వేటు పడనుందన్న వార్తలు ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తెలంగాణ హైకోర్టులో మొత్తం 28 మంది ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌లు న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. వనమా ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. కొత్తగూడెం నుండి 2018లో వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ 2019లో మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు వేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారమిచ్చారని.. అందుకే వనమా ఎన్నికను రద్దు చేసి తనను కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటించాలని పిటిషన్ లో కోరారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన అనంతరం ఉన్నత న్యాయస్థానం.. వనమా వెంకటేశ్వర రావు ఎన్నికను రద్దు చేసి జలగం వెంకట్రావును కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అంతే కాకుండా.. వనమాకు రూ.5 లక్షల జరిమానా విధించింది. 2018లో వనమా వెంకటేశ్వర్ రావు కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్‌లో చేరారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసిన శ్రీనివాస్ గౌడ్ తొలుత ఒక అఫిడవిట్ సమర్పించారు. నవంబర్ 14న ఆయన నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో వివరాలు అప్‌లోడ్ చేశారు. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చే కొద్దిరోజుల ముందు వెబ్‌పైట్‌లో మరో అఫిడవిట్ దర్శనమిచ్చింది. మొదట అప్‌లోడ్ చేసిన అఫిడవిట్‌లో వివరాలు.. తర్వాత అఫిడవిట్‌లో వివరాల్లో తేడాలున్నట్లు ప్రత్యర్థులు గుర్తించారు. మొదట అప్‌లోడ్ చేసిన అఫిడవిట్‌తో అనర్హత వేటు పడే అవకాశం ఉండడంతోనే ఆయన మరో అఫిడవిట్‌ను అప్‌లోడ్ చేయించారని ప్రత్యర్థులు ఈసీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల అధికారులతో కుమ్మక్కై ఈసీ వెబ్‌సైట్‌ను ట్యాంపరింగ్ చేసి మరీ అఫిడవిట్ మార్చేశారని ఎన్నికల కమిషన్‌కి చేసిన ఫిర్యాదులో తెలిపారు. ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల కమిషన్ ఎన్నికల అధికారుల నుంచి నివేదిక తెప్పించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మధ్యే బదిలీపై వెళ్లిన మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినట్లు తెలుస్తోంది. మరోవైపు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనర్హత పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు అఫిడవిట్‌లు, ఆధారాలను కోర్టుకు సమర్పించాలని పిటిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు విచారణ పై మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని వాది, ప్రతివాదికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

మరోవైపు వేముల వాడ ఎమ్మెల్యే చెన్నమనని రమేష్ పౌరసత్వంపై కోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి. ద్వంద్వ పౌరసత్వం కేసు చెన్నమనేనిని కొన్నేళ్లుగా వెంటాడుతోంది. జర్మనీ పౌరసత్వం ఉన్న రమేష్ ఎలా ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ ప్రత్యర్థి కోర్టును ఆశ్రయించారు. చెన్నమనేని పై కోర్టు అనర్హత తీర్పు కూడా ఇచ్చింది. అయితే సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో చెన్నమనేని ఎమ్మెల్యే గా కొనసాగుతున్నారు.

కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఎన్నికను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌లో బండి సంజయ్‌ విచారణకు హైకోర్టు రిటైర్డ్‌ జిల్లా జడ్జి శైలజను కోర్టు కమిషనర్‌గా నియమించింది. ఈనెల 12 నుంచి 17 వరకు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. గత ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి గంగుల బీఆర్‌ఎస్‌ తరఫున విజయం సాధించారు. అయితే అఫిడవిట్‌లో గంగుల తప్పుడు వివరాలు అందించారని అందువల్ల ఆయన ఎన్నిక చెల్లదని సమీప ప్రత్యర్థి బండి సంజయ్‌ 2019 జనవరిలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కమిషనర్‌ను క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు నియమిస్తూ తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు.

బి అర్ ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురయింది. పాటిల్‌పై ఉన్న నేరాలను అఫిడవిట్‌లో దాచారని దీంతో ఆయన ఎన్నిక చెల్లదని పిటిషన్ దాఖలయింది. దీనిపై రోజువారీ విచారణకు హైకోర్టు ఆదేశించింది. అయితే అనర్హత పిటిషన్ విచారణపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎంపీకి ఊరట లభించలేదు. అనర్హత పిటిషన్‌పై హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేస్తూ బీబీ పాటిల్ వేసిన పిటిషన్‌ను సుప్రీం తోసిపుచ్చింది

2018 లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ పిటిషన్‌లు దాఖలవ్వగా.. కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఒక్కొక్క పిటిషన్‌ విచారణకు వస్తున్నాయి. ఆగస్టులోనే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్న తరుణంలో ఎమ్మెల్యేలపై కేసులు హైకోర్టులో విచారణకు రావడం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో కోర్టు కేసుల వ్యవహారంపై కేసీఆర్ సర్కార్ ఎలా ముందుకెళ్లనుంది. రాబోయే ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యేలకు మళ్లీ కేసీఆర్ టికెట్లు ఇస్తారా..? లేకుంటే పక్కన పెడతారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story