Editorial: ఉమ్మడి పాలమూరులో హస్తం జోష్

Editorial: ఉమ్మడి పాలమూరులో హస్తం జోష్
ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్‌లో నేతల చేరికతో జోష్ నెలకొందా? నేతల చేరికతో ఆశావహులు టెన్షన్ పడుతున్నారా? ఆశావహులను పార్టీ పెద్దలు బుజ్జగిస్తున్నారా? రాబోయే ఎన్నికల్లో మాజీ మంత్రుల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుందా?

ఉమ్మడి మహబూబ్‍నగర్‍ జిల్లాలో వెలవెలబోయిన కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఫలితాలు జోష్ నింపినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్‍ నాయకులు జూపల్లి కృష్ణారావు, గుర్నాథ్‍ రెడ్డి, కూచుకుళ్ళ దామోదర్ రెడ్డిలతో పాటు పలువురు నేతలు కాంగ్రెస్‍ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతుండటంతో కాంగ్రెస్‍ శ్రేణుల్లో కొత్త జోష్‍ కనిపిస్తోంది. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమేనని క్యాడర్లో చర్చ జరుగుతోంది. మరోవైపు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్న హస్తం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు టిక్కెట్ తమకే వస్తుందని ఆశతో ఉన్న నేతలు కొత్తగా పార్టీలో చేరుతున్న నాయకులు తమ టిక్కెట్ ఎక్కడ ఎగరేసుకుపోతారోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పరిస్థితి నాగర్ కర్నూల్‍ జిల్లాలో అధికంగా కనిపిస్తోంది. కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‍ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. జూపల్లిని తమ పార్టీలో చేరాలని ఇటు కాంగ్రెస్‍, అటు బీజేపి పార్టీలు ఆహ్వానిస్తున్న నేపథ్యంలో జూపల్లి కాంగ్రెస్‍ పార్టీలో చేరతానని క్లారిటీ ఇవ్వడంతో కాంగ్రెస్‍ పార్టీలోని పలువురు నేతలకు కంటిమీద కునుకు లేకుండా పోయిందని టాక్ వినిపిస్తోంది.

కాంగ్రెస్ నేతల ఆందోళనకు ప్రధాన కారణం జూపల్లి కృష్ణారావేనన్న టాక్ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. తన అనుచర వర్గానికి టిక్కెట్ ఇవ్వాలని అధిష్ఠానంతో ఒప్పందం చేసుకున్నాకే పార్టీ కండువా కప్పుకోడానికి సిద్దమయినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో జూపల్లి...ఆయన మద్దతు దారులు ఏ ఏ నియోజకవర్గాల టిక్కెట్‌లు ఆశిస్తున్నారోనని రాజకీయ వర్గాల్లో చర్చజరుగుతోంది. దీంతో ఆయా నియోజక వర్గాల్లో తాము పోటీ చెయ్యాలని ఆశలు పెట్టుకున్న నేతలు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడంలేదని వాపోతున్నట్లు క్యాడర్‌లో చర్చ జరుగుతోంది. జూపల్లి కృష్ణారావు ప్రధానంగా మూడు నియోజకవర్గాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అందులో తాను పోటీ చేసే కొల్లాపూర్ నియోజకవర్గంతో పాటు వనపర్తి, నాగర్‍ కర్నూల్‍ అసెంబ్లీ నియోజకవర్గాలపై ఫోకస్‍ పెట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే జూపల్లి డిమాండ్లను కాంగ్రెస్‍ అధిష్ఠానం సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఐతే జూపల్లి వనపర్తి, నాగర్ కర్నూల్‍ నియోజకవర్గాలలో బరిలో దిగబోయే తన మద్దతు దారుల పేర్లు వెల్లడించినట్లు టాక్ నడుస్తోంది. ఇందులో నాగర్ కర్నూల్‍ నుంచి ప్రస్తుత బీఆర్‍ఎస్‍ ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి కుమారుడు కూచుకుళ్ళ రాజేశ్‍రెడ్డి ఒకరు.

పార్టీలో వలసలు క్యాడర్‍ లో జోష్‍ నింపుతున్నా.... ఆశావాహుల్లో మాత్రం తీవ్ర ఆందోళన రేకిత్తిస్తోంది. నేతలకు రెడ్‍ కార్పెట్‍ వేసి ఆహ్వానిస్తున్న కాంగ్రెస్‍ అధిష్ఠానం వచ్చే ఆశావహుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఎలా సర్ది చెప్పాలోనని తలలు పట్టుకుంటున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం నుండి పార్టీలో చేరుతున్న జూపల్లి కృష్ణారావు... తనతో పాటు మరో ఇద్దరికి టిక్కెట్ ఇప్పించుకునేందుకు ఒప్పందం కుదుర్చుకోవడంతో ఆశావాహులు అసంతృప్తితో రగిలిపోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో కొల్లాపూర్ టిక్కెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న జగదీశ్వర్ రావుతో పాటు, నాగర్‍ కర్నూల్‍ లో ను చివరి సారిగా పోటీ చేసే యోచనలో నాగం జనార్ధన్‍ రెడ్డిలు ఉన్నారు. వీరిని బుజ్జగించే ప్రయత్నాలను రాష్ట్ర కాంగ్రెస్‍ పెద్దలు ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇక వనపర్తిలో మాజీ మంత్రి చిన్నారెడ్డి పోటీ చెయ్యాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఐతే చిన్నారెడ్డి బరిలో దిగితే తాము పార్టీలో ఉండమని పలువురు ద్వితీయ శ్రేణి నేతలు అధిష్ఠానానికి పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో మంత్రి నిరంజన్‍ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉండి, ఇప్పుడు మంత్రికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రముఖ కాంట్రాక్టర్‍ మేఘారెడ్డి గట్టి పోటీ నిస్తాడన్న భావనతో జూపల్లి ఆయన్ను తన గ్రూపులో ఎంపిక చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో మాజీ మంత్రి చిన్నారెడ్డికి టికెట్‍ దక్కుతుందా లేదా అని సర్వత్రా చర్చ సాగుతోంది.

అయితే కర్నాటక ఎన్నికల అనంతరం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలువురు నేతలు కాంగ్రెస్‍ పార్టీవైపు అడుగులు వేస్తుండటం ఆ పార్టీకి కలిసొచ్చేఅంశంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కోవలో ఇప్పటికే జూపల్లి కృష్ణారావు, గుర్నాథ్‍ రెడ్డి, కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులుండగా, అధికార, విపక్షాల నుండి మరికొంత మంది చోటా మోటా నేతలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. బీజేపి నేత మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‍ రెడ్డి, గద్వాల జడ్పీ చైర్‍ పర్సన్‍ సరితా, తిరుపతయ్య దంపతులు సైతం కాంగ్రెస్‍ వైపు చూస్తుండటంతో జిల్లా కాంగ్రెస్‍ లో నూతనోత్తేజం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలనాటికి సీట్ల సర్దుబాటు ఎలా జరుగుతుందోనన్న ఉత్కంఠ మాత్రం హస్తం నేతల్లో వ్యక్తమవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story