సాలూరు వైసీపీలో కుమ్ములాటలు

సాలూరు వైసీపీలో కుమ్ములాటలు
వర్గపోరుకు చెక్ పెట్టలేక అమాత్యుడే చేతులెత్తేశారా?


సాలూరు వైసీపీలో వర్గపోరు ముదిరి పాకాన పడిందా?
విభేదాలతో ద్వితీయ శ్రేణి నేతలు రచ్చకెక్కారా?
ఆధిపత్య పోరుతో మంత్రి సభలకే డుమ్మా కొడుతున్నారా?
వర్గపోరుకు చెక్ పెట్టలేక అమాత్యుడే చేతులెత్తేశారా?


పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ వైసీపీ నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రయిన పీడిక రాజన్నదొరకు... నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నేతల మధ్య ఏర్పడ్డ వర్గపోరు కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో మక్కువ మండలం మినహా మిగతా మూడు మండలాలతో పాటు సాలూరు పట్టణంలోనూ వర్గపోరు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రోజుకొక పంచాయతీతో అసమ్మతి నేతలకు సర్ది చెప్పుకోలేక జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు దగ్గరకు పంపించేస్తున్నారు. వర్గపోరుకు సంబంధించి ప్రధానంగా సాలూరు, పాచిపెంట, మెంటాడ మండలాల నేతలు, సాలూరు మున్సిపాలిటీ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. ఒక వర్గం పార్టీ కార్యక్రమం నిర్వహిస్తే మరొక వర్గం ఆ కార్యక్రమానికి డుమ్మా కొట్టడం పరిపాటిగా మారినట్లు ప్రచారం జరుగుతోంది. నేతలు డుమ్మా కొట్టడంతో పాటు తమ వర్గానికి చెందిన నేతలు, క్యాడర్‌ను కూడా వెళ్లనీయడం లేదని ప్రచారం జరుగుతోంది.

ఇటీవల మెంటాడ మండల కేంద్రంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమానికి వెళ్లిన రాజన్నదొరకు ఘోర అవమానం ఎదురైనట్లు తెలుస్తోంది. మంత్రి వచ్చినా కార్యకర్తలు హాజరుకాలేదు. దీంతో ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడంతో మంత్రి రాజన్న దొర చిందులు వేసినట్లు నియోజకవర్గం వైసీపీలో ప్రచారం జరుగుతోంది. మెంటాడ మండల కేంద్రంలో ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు, సీనియర్ వైసీపీ నాయకుడు రెడ్డి రాజ అప్పల నాయిడు మధ్య వర్గపోరు భీభత్సంగా కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రెడ్డి సన్యాసినాయిడు నిర్వహించిన సభకు రెడ్డి రాజ అప్పల నాయిడు వర్గీయులు డుమ్మా కొట్టారు. అలానే పాచిపెంట మండల కేంద్రంలోని నిర్వహించిన సభకు కూడా అక్కడ ఎంపిపిగా ఉన్న ప్రమీల డుమ్మా కొట్టారు. అయితే అనారోగ్య సమస్యల కారణంగానే ప్రమీల హాజరుకాలేదని మంత్రి గారికి రాయబారం పంపినట్లు ప్రచారం జరిగింది.

పాచిపెంట మండలంలో ఎంపీపీ ప్రమీల, జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి డోల బాబ్జిల మధ్య కూడా వర్గపోరు సాగుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ రెండు సభలను డోల బాబ్జి కండక్ట్ చేయడంతో ప్రమీల వర్గీయులు డుమ్మా కొట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో కార్యకర్తలు కూడా హాజరుకాకపోవడంతో మంత్రికి ఘోర అవమానం ఎదురైందని సొంత పార్టీలోనే చర్చ నడుస్తోంది. దీనికి తోడు పాచిపెంట మండల కేంద్రంలో జరిగిన గడప గడప కార్యక్రమంలో కూడా వీళ్లిద్దరి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎంపీపీ వర్గీయులు పుష్ప గుచ్ఛం ఇచ్చి వెళ్లిపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్త మయ్యాయి. ఎంపిడిఓ కార్యాలయంలో సమావేశం అనంతరం గడప గడప కార్యక్రమంలో పాల్గొనకుండానే నేతలు వెనుతిరిగడంతో ఇరువురి మధ్య విభేదాలు తార స్థాయికి చేరుకున్నాయని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది.

అలానే సాలూరు మున్సిపాలిటీలో కూడా వైసీపీ రెండు వర్గాలు చీలిపోవడంతో క్యాడర్ అయోమయంలో పడినట్లు టాక్ వినిపిస్తోంది. సీనియర్ నాయకుడు పువ్వల నాగేశ్వరరావు, వైసీపీ మాజీ టౌన్ ప్రెసిడెంట్ సూరిబాబుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పువ్వల నాగేశ్వరరావు భార్య పువ్వల ఈశ్వరమ్మ మున్సిపల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారట. అలానే జరజాపు సూరిబాబు కోడలు దీప్తి వైస్ చైర్మన్‌గా వ్యవహారిస్తున్నారు. దీంతో కౌన్సిలర్ల కూడా రెండు వర్గాలుగా విడిపోయి రాజకీయం చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. వచ్చే సెప్టెంబర్‌తో మున్సిపల్ పదవులకు రెండున్నర ఏళ్ళు పూర్తవుతుంది. దీంతో సాలూరు మున్సిపాలిటీ ఛైర్మన్ పదవిని తొలుత రెండున్నర ఏళ్ళు పువ్వల వర్గానికి ఆ తర్వాత రెండున్నర ఏళ్ళు జరజాపు వర్గానికి కేటాయిస్తూ గతంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో మొదటి విడత కాలం ముగిసే సమయం ఆసన్నమవడంతో చైర్మన్ పదవి కోసం రెండో వర్గం ఇప్పటి నుండే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య నెలకొన్న విభేదాలతో పదవుల పంపిణీ సక్రమంగా జరుగుతుందా లేదోనని సొంత పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.

మరోవైపు వర్గపోరు చెక్ పెట్టలేక మంత్రి పీడిక రాజన్న దొర సతమతం అవుతున్నట్లు తెలుస్తోంది. ద్వితీయ శ్రేణి నేతల మధ్య విభేదాలు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయని రాబోయే ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం జరగడం ఖాయమని సొంత పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story