ఎచ్చెర్ల వైసీపీలో భగ్గుమన్న అసమ్మతి..ఇక ఆ ఎమ్మెల్యేకు కష్టమేనా..?

ఎచ్చెర్ల వైసీపీలో భగ్గుమన్న అసమ్మతి..ఇక ఆ ఎమ్మెల్యేకు కష్టమేనా..?
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ వైసీపీలో అసమ్మతి గళం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది

ఆ నియోజకవర్గంలో అధికార పార్టీకి అన్నీ ప్రతికూల పరిస్ధితులే ఎదురవుతున్నాయా? ఎమ్మెల్యే కి సొంత పార్టీ నేతలే షాకిస్తున్నారా? గడప గడపకు వెళ్తున్న ఎమ్మెల్యేకు ద్వితీయ శ్రేణి నేతలు సహకరించలేమని చేతులెత్తేశారా? భారీ మెజారిటీతో గెలిచిన ఆ ఎమ్మెల్యేకు క్షేత్ర స్ధాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి? ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు?

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ వైసీపీలో అసమ్మతి గళం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌పై సొంత పార్టీకి చెందిన అసమ్మతి నేతలంతా రోడ్డెక్కటం అధికారపార్టీలో కాక రేపుతోంది. గడప గడపకు ప్రభుత్వంలో భాగంగా గ్రామాల్లో తిరుగుతున్న ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి తీవ్ర ప్రతి ఘటన ఎదురౌతున్నట్లు చర్చ నడుస్తోంది. ఓ వైపు వైసీపీ పెద్దలు 99 శాతం హామీలు నెరవేర్చామని గొప్పలు చెబుతుంటే స్ధానిక ఎమ్మెల్యేలను మాత్రం ప్రజలు కడిగిపారేస్తున్న ఘటనలు ఎదురవడంపై సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిరణ్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కిరణ్ ఎక్కడికి వెళ్లినా ప్రజల నిలదీతలు, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

2019 ఎన్నికల్లో గొర్లె కిరణ్ భారీ మెజారిటీతో ఎచ్చెర్ల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న నాలుగు మండలాల్లో నలుగురు ముఖ్య నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. వారంతా ఇపుడు సామంత రాజులు మాదిరిగా మారటంతో పార్టీలో తీవ్ర అసమ్మతి వ్యక్తమౌతోందని వైసీపీలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే కార్యక్రమాలను సొంత పార్టీ నేతలే బహిష్కరిస్తుండటం పరిస్థితికి అద్దం పడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎచ్చెర్ల మండలంలో అధికార పార్టీ నేతల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు తారా స్ధాయికి చేరడంతో క్యాడర్ నలిగిపోతున్నట్లు క్షేత్ర స్థాయిలో ప్రచారం జరుగుతోంది. నేతల మధ్య ఉన్న విబేధాలను చక్కదిద్దాల్సిన ఎమ్మెల్యే కిరణ్ చేతులెత్తేయడంతో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని నియోజక వర్గంలో చర్చ జరుగుతోంది. దీంతో పార్టీలో ఇమడలేక ఒకరిద్దరి పెత్తనాన్ని భరించలేక మండలంలోని ద్వితీయ శ్రేణి నేతలంతా ఎమ్మెల్యే తీరుపై మండిపడుతున్నట్లు సమాచారం.

ఎచ్చెర్ల ఎంపిపి మొదలవలస చిరంజీవి తీరుపై ఆది నుంచీ ద్వితీయ శ్రేణి నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తొలి రెండేళ్ల తర్వాత చిరంజీవి ఎంపిపి పదవికి రాజీనామా చేయాల్సి ఉన్నప్పటికీ ఆయన సీటుని వదలక పోవడం...పైగా ఎమ్మెల్యే కిరణ్‌కు చిరంజీవి కొరకరాని కొయ్యలా తయారయ్యారని చర్చ జరుగుతోంది. చిరంజీవిని కట్టడి చేయలేక పోవటంతో ఎమ్మెల్యే కిరణ్ కు ద్వితీయ శ్రేణి నాయకత్వం దూరమౌతుందనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఎచ్చెర్ల మండలంలో గడప గడపకు తిరుగుతున్న ఎమ్మెల్యేను సొంత పార్టీ నేతలే టార్గెట్ చేయడంతో ఆయన కంగుతిన్నారు. ఎంపిపీ చిరంజీవికి, పార్టీ మండలాధ్యక్షుడు జరుగుళ్ల శంకర్రావు మధ్య కోల్డ్ వార్ తారాస్ధాయికి చేరింది. ఎంపిపి ఒత్తిళ్లకు తలొగ్గుతున్న ఎమ్మెల్యే కిరణ్ తమ గ్రామాల్లో పనులు చేయటం లేదంటూ శంకర్రావు వర్గం ఆరోపిస్తోంది. ఎమ్మెల్యేకి తమ సమస్యలు చెప్పినా పట్టించుకోకపోవటంతో ఎచ్చెర్ల మండలంలోని 10 పంచాయితీల నేతలు ఎమ్మెల్యే కిరణ్ కు సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయించినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే నేతల మధ్య విబేధాల నేపధ్యంలో ఎచ్చెర్ల మండలంలో గడప గడప కార్యక్రమం పూర్తి స్ధాయిలో నిర్వహించలేని పరిస్ధితి నెలకొంది. ఇన్నాళ్లూ ఓపిక పట్టిన మండలాధ్యక్షుడు జరుగుళ్ల వర్గం తమ గ్రామాల్లో పర్యటించవద్దంటూ ఎమ్మెల్యే కిరణ్ కు తేల్చి చెప్పేశారట. అక్కడితో ఆగకుండా ఎమ్మెల్యే కార్యక్రమాలకు మెజారిటీ నేతలెవరూ హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో సతమతమౌతున్న ఎమ్మెల్యేకు ఇపుడు పార్టీ నేతల మధ్య విభేదాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సొంత పార్టీ నుంచి అసమ్మతి స్వరాలు వినిపించడంతో ఎమ్మెల్యే వర్గీయులు, సీనియర్ నేతలు కంగుతిన్నారు. సొంత పార్టీ నేతలే రోడ్డెక్కి నిరసన తెలపడంతో అధికార పార్టీ నేతల్లో చర్చనీయాంశమైంది.

Tags

Read MoreRead Less
Next Story