విశాఖ వైసీపీలో కత్తులు దూసుకుంటున్న నేతలు వారేనా..?

విశాఖ వైసీపీలో కత్తులు దూసుకుంటున్న నేతలు వారేనా..?
ఎలక్షన్ ఇయర్ కావడంతో విశాఖ వైసీపీలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయా? నియోజకవర్గాల వారీగా వైసీపీ నేతలు విడిపోయారా?

ఎలక్షన్ ఇయర్ కావడంతో విశాఖ వైసీపీలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయా? నియోజకవర్గాల వారీగా వైసీపీ నేతలు విడిపోయారా? ఆధిపత్యం కోసం సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారా? అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయా? గ్రూపుల గోల ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపనుందా?

అధికార పార్టీలో కుమ్ములాటలు అధినేతకు ఆందోళన కలిగిస్తున్నట్లు పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఓ వైపు రోజురోజుకూ అధికార పార్టీపై రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతుండడం.. మరో వైపు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ బలోపేతం అవ్వడం జగన్ టీంకు దడ పుట్టిస్తోందని సమాచారం. రాజధానిగా ప్రకటించిన విశాఖలో చంద్రబాబు క్రేజ్ చూస్తుంటే అధికార పార్టీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నట్లు ఆ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలతో ముందస్తుకు వెళ్లాలన్న యోచనలో జగన్ ఉన్నట్లు విశాఖలో జోరుగా ప్రచారం సాగుతోంది.

అధికార పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతతో సతమవుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ లు నియోజకవర్గాల్లో ఇంటిపోరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశాఖలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తూర్పు నుంచి మొదలెడితే అక్కడ ఇంచార్జ్ అక్కరమానికి ఆదినుంచి ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ పక్కలో బల్లెంలా తయారైనట్లు టాక్ వినిపిస్తోంది. తనకు సీట్ లేకుండా చేశారని అక్కరమానిపై వంశీకృష్ణ మనసులో పెట్టుకోగా...తన ఓటమికి వంశీకృష్ణ కారణమన్న భావనతో అక్కరమాని అగ్గిమీద గుగ్గిలమవుతున్నట్లె తెలుస్తోంది. దీనికి తోడు మేయర్ ఫ్యామిలీ, ఎంపీ ఎంవివిలు నియోజకవర్గ రాజకీయాల్లోకి తలదూరుస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక టీడీపీ నుంచి వచ్చిన వాసుపల్లి గణేష్ కుమార్‌కి నియోజకవర్గంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. మొదట ద్రోణంరాజు రూపంలో ఇబ్బందిని ఎదుర్కొన్న గణేష్ కుమార్‌కు ప్రస్తుతం సీతoరాజు సుధాకర్ పక్కలో బల్లెంలా తయారయ్యారని ఆయన అనుచరుల్లో చర్చ సాగుతోంది. సుధాకర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తర్వాత సౌత్ సీట్ కోసం కర్చీఫ్ వేసుకుని కూర్చున్నారన్న సమాచారంతో వాసుపల్లికి కంటిమీద కునుకు లేకుండా పోయింది. దీనికి తోడు కోలా గురువులు రూపంలోనూ ఇబ్బంది పొంచి ఉందని వాసుపల్లికి బెంగ పట్టుకుంది. ఇదే సమయంలో సగానికి పైగా కార్పొరేటర్లు వాసుపల్లిని వ్యతిరేకించడం సౌత్ వైసీపీలో సెగలు పుట్టిస్తోంది..

విశాఖ నార్త్ లో కేకే రాజు కంఫర్ట్ గా ఉన్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే 2019లో గంటా గెలుపుతో నియోజకవర్గం కాపుల కోటాలోకి వెళ్ళింది. ఇందులో భాగంగానే కాపునాడు అధ్యక్షుడు తోట రాజీవ్ పేరు తెరమీదకు తెస్తున్నారు వైసీపీ కాపు నేతలు. ఇక విశాఖ వెస్ట్‌లో 2019లో పోటీ చేసి ఓటమిపాలయిన మళ్ళ విజయ్ ప్రసాద్ కొంతకాలంపాటు నియోజకవర్గ ఇంచార్జ్ గా వ్యవహరించారు. ఆ తర్వాత విజయ్ ప్రసాద్‌ను తప్పించి యలమంచిలికి చెందిన ఆడారి ఆనంద్ కుమార్ కి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. దీంతో నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి నివురుగుప్పిన నిప్పులా తయారయినట్లు టాక్ వినిపిస్తోంది.

ఇక భీమిలి, గాజువాక, పెందుర్తిలోనూ వైసీపీకి గడ్డుపరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం. అవంతి శ్రీనివాస్‌కు అక్కరమాని రూపంలోనూ, తిప్పల నాగిరెడ్డికి చింతలపూడి వెంకట్రామయ్య, అధీప్ రాజుకు పంచకర్ల రమేశ్‌లు పక్కలో బల్లెంలా తయారయ్యారని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరోవైపు పలు నియోజకవర్గాలలో నెలకొన్న కుమ్ములాటలపై ఐ ప్యాక్ టీం రిపోర్ట్‌ను అధినేతకు ఇచ్చినట్లు సమాచారం. అయితే వర్గపోరుకు అధినేత ఎలా చెక్ పెడతారోనని క్యాడర్‌లో చర్చ నడుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story