విజయనగరం వైసీపీలో ముదిరిన ముసలం

విజయనగరం వైసీపీలో ముదిరిన ముసలం
విజయనగరం వైసీపీలో అసమ్మతి జ్వాలలు ఎగసిపడుతున్నాయి

విజయనగరం వైసీపీలో ముసలం పుట్టిందా? తండ్రీ, కూతురు హవాతో నేతలు ఇబ్బందులు పడుతున్నారా? ఎమ్మెల్యే తీరుతో కార్పొరేటర్లు, రూరల్ వైసీపీ నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారా? సొంత పార్టీలో కార్పొరేటర్లకు కనీస గౌరవం కూడా దక్కడం లేదా? కార్పొరేషన్ ను ఎమ్మెల్యే తన గుప్పెట్లో పెట్టుకున్నారా?

విజయనగరం వైసీపీలో అసమ్మతి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి తీరుతో నియోజకవర్గ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు సమాచారం. అటు టౌన్‌లోనూ, రూరల్ లోనూ కూడా ఇదే పరిస్థితి నెలకొన్నట్లు టాక్ వినిపిస్తోంది. విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్‌లో ఉన్న 50 డివిజన్‌లలో 48 డివిజన్లకు వైసీపీ అభ్యర్థులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో సగం మంది కార్పొరేటర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. పార్టీలో ఏ కార్పొరేటర్‌కు కనీసం గౌరవం దక్కడం లేదని అసలు విలువ లేకుండా పోయిందని పలువురు కార్పొరేటర్లు ఆవేదన చెందుతున్నారు. కార్పొరేషన్ మేయర్‌గా తన అనుచర కార్పొరేటర్‌కి పట్టం కట్టడమే కాకుండా ఆమెను డమ్మీ చేసినట్లు సొంత పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ మేయర్- టు ఎమ్మెల్యే కుమార్తెకోలగట్ల శ్రావణిని నిలబెట్టి కార్పొరేషన్ మొత్తం ఆయన గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మేయర్ దగ్గర నుండి కార్పొరేటర్ వరకు ఎవరికి అధికారం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్డుల్లో ఏ చిన్న సమస్య ఉన్నా తీర్చలేని పరిస్థితిల్లో ఉన్నామని కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విజయనగరం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నీ తానై వ్యవహరిస్తూ పెత్తనం చెలాయిస్టున్నట్లు సొంత పార్టీ నేతలు ఆరోపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. విజయనగరంలో క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఏ పని జరగాలన్నా స్వామి వారి ఆజ్ఞ, తప్పనిసరిగా ఉండాల్సిందేనంటున్నారు సొంతపార్టీ నేతలు. మేయర్ మొదలుకుని సర్పంచ్ వరకు , ఉన్నతాధికారి మొదలుకుని బంట్రోతు వరకు ఇలా ఒకరేంటి నియోజకవర్గంలో ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా స్వామి వారికి చెప్పనిదే ఏపనీ చేయడానికి వీలులేదని సొంత పార్టీ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలతో పార్టీ శ్రేణులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. పట్టణ నాయకులతో పాటు రూరల్ నియోజకవర్గంలో ఉన్న నాయకుల పరిస్థితి దయనీయంగా మారినట్లు తెలుస్తోంది. ఆయా వార్డుల్లో కార్పొరేటర్లకు, గ్రామాల్లో ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛనివ్వకుండా, ఏ చిన్న పని అయినా కూడా స్వామి అనుమతి తీసుకోవాల్సి రావడంతో తీవ్ర ఆవేదనతో తలలు పట్టుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ప్రతీ వార్డులోనూ అసమ్మతి వర్గాన్ని ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారంటూ ద్వితీయ శ్రేణి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు అనుకూలంగా ఉన్న వారికే ఎమ్మెల్యే ప్రాధాన్యత నిస్తున్నారని ద్వితీయశ్రేణి నేతలు ఆరోపిస్తున్నారు. రూలింగ్ పార్టీలో ఉన్నా పవర్ లేని కార్పొరేటర్లుగా, నాయకులుగా మిగిలిపోయిన వైనాన్ని తలచుకుంటూ వైసీపీ నేతలు కుమిలిపోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో తాము ఉండలేమంటూ కొందరు నేతలు పార్టీకి దూరమవుతున్నట్లు సమాచారం. డిప్యూటీ మేయర్‌ ఇసరపు రేవతీదేవి అర్ధాంతరంగా తన పదవికి రాజీనామా చేయడమే పార్టీలో ముసలానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే , ఆయన కూతురు తీరుతో గతంలోనే పలువురు నేతలు పార్టీని వీడినట్లు టాక్ వినిపిస్తోంది. విజయనగరం రూరల్ మండలం గొల్లలపేట, రీమాపేట, పిన వేమలి గ్రామాలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు, వైసీపీ కార్యకర్తలు, పట్టణానికి చెందిన ఐదుగురు కార్పొరేటర్లు పార్టీ నుండి బయటకు వచ్చినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రాబోయే రోజుల్లో మరి కొంతమంది నేతలు పార్టీని వీడతారన్న టాక్ వినిపిస్తోంది. ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయాయమని లేదంటే ఇప్పుడే బయటకు వెళ్లేపోయేవాళ్లమని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు క్యాడర్‌లో చర్చ నడుస్తోంది.

ఎమ్మెల్యేతీరుతో విసిగిపోయిన వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని సవాల్ విసురుతున్నారు. అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న అధినేతకు నియోజకవర్గాలలో అసమ్మతి తలనొప్పిగా మారినట్లు సమాచారం.

Tags

Next Story