Editorial: నెల్లిమర్ల వైసీపీలో వర్గపోరు

Editorial: నెల్లిమర్ల వైసీపీలో వర్గపోరు
నెల్లిమర్ల వైసీపీ బరిలో బొత్స ఝాన్సీ దిగనున్నారా? సమీప బంధువు బడ్డుకొండ అప్పలనాయుడికి చెక్ పెట్టనున్నారా? సిట్టింగ్ ఎమ్మెల్యే బొత్స మాట వినడం లేదా? ఎమ్మెల్యే అవినీతిపై సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారా? ఎమ్మెల్యే బడ్డుకొండకు చెక్ పెట్టేందుకు కుటుంబ సభ్యులంతా ఒక్కటయ్యారా?

ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో టికెట్ కన్ఫర్మ్ చేసుకునేందుకు ఇప్పటినుండే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ వైసీపీలో టికెట్ పోరు తెరపైకి వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబంలో ముసలం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. తన సమీప బంధువు, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుకు ప్రత్యామ్నాయంగా

బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మీని బరిలో దింపేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం వద్ద చక్రం తిప్పుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి బొత్స ఝాన్సీ గత ఎన్నికల్లో ఎంపీ సీటు కోసం ప్రయత్నించగా రాజకీయ సమీకరణాల కారణంతో టికెట్ మిస్సయినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఈ సారి ఎంపీ టికెట్ కాకుండా ఎమ్మెల్యే టికెట్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. బొత్స ఝాన్సీ లక్ష్మీ రెండు పర్యాయాలు జిల్లా పరిషత్ చైర్మన్ గానూ, రెండు సార్లు ఎంపీ గానూ పని చేశారు. దీంతో ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టాలని వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే నెల్లిమర్ల నియోజకవర్గంలో బొత్సకు సమీప బంధువు బడ్డుకొండ అప్పల నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో సొంత కుటుంబ సభ్యుడయిన బడ్డుకొండకు ఈ సారి చెక్ పెట్టాలని బొత్స ప్లాన్ వేసినట్లు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. అయితే కుటుంబ సమస్యల కారణంగా బడ్డుకొండ, బొత్స ఫ్యామిలీలు దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడును రాజకీయాల్లోకి తీసుకొచ్చిన బొత్స సత్యనారాయణే ఆయనకు ఎసరు పెట్టేలా విమర్శలు గుప్పిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నెల్లిమర్ల బరిలో దిగేందుకు సతీమణి చేస్తున్న ప్రయత్నాలకు బొత్స సత్యనారాయణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టికెట్ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న బొత్స సోదరుడు లక్ష్మణరావు గత ఎన్నికల్లో టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. ప్రస్తుతం వదిన ఝాన్సీలక్ష్మి టికెట్ కోసం చేస్తున్న ప్రయత్నాలకు లక్ష్మణరావు కూడా సపోర్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బడ్డుకొండ చేస్తున్న అవినీతి , అక్రమాలు , క్యాడర్ నుండి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను చూపిస్తూ టికెట్ కావాలని కోసం ప్రయత్నిస్తున్నారు బొత్స ఝాన్సీ.

వాస్తవానికి నెల్లిమర్ల నియోజకవర్గంలోని భోగాపురం, పూసపాటి రేగ, నెల్లిమర్ల మండలాల్లోని సొంత పార్టీ నేతల నుండే ఎమ్మెల్యే బడ్డుకొండపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే వ్యవహారశైలి నచ్చని నియోజకవర్గ సీనియర్ నేతలు కందుల రఘుబాబు, కాకర్లపూడి శ్రీనివాస్ రాజులతో పాటు మరి కొందరు నేతలు ఎమ్మెల్యేకు దూరంగా ఉంటున్నారు. వీరితో పాటు పూసపాటి రేగ మండలంలోని 11 పంచాయతీలకు చెందిన వైసీపీ నేతలతో పాటు జిల్లా మత్య్సకార అధ్యక్షుడుగా ఉన్న బర్రి చిన్నప్పన్న వంటి నేతలు కూడా ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు అక్రమ క్వారీ తవ్వకాలు చేపడుతూ అవినీతికి పాల్పడుతున్నారంటూ సొంత పార్టీ శ్రేణులే మండిపడుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇవే కాకుండా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భూ సేకరణలో లబ్ధిదారుల పేర్లను తారుమారు చేసి లబ్ధిపొందారని ఎమ్మెల్యే పై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అలానే నియోజకవర్గంలో వేసిన వెంచర్లు, లేఔట్స్ నుండి కూడా కమీషన్లు దండుకుంటున్నారని టాక్ బలంగా వినపడుతోంది.

మరోవైపు ఎమ్మెల్యే పనితీరుపై వైసీపీ చేసిన సర్వేలో కూడా నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బడ్డుకొండ అప్పలనాయుడు ఓడిపోతారని... క్యాండిడేట్‌ను కచ్చితంగా మార్చాలని నివేదిక వచ్చినట్లు పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో బడ్డుకొండను తప్పించి తనకే టికెట్ ఇవ్వాలని అధిష్ఠానం వద్ద బొత్స ఝాన్సి పట్టు బడుతున్నట్లు తెలుస్తోంది. నెల్లిమర్ల నియోజకవర్గం పరిణామాలపై వైసీపీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో , ఎవరికి టికెట్ కేటాయిస్తుందో వేచి చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story