Editorial: సూళ్లూరుపేట వైసీపీలో భగ్గుమన్న అసంతృప్తి

Editorial: సూళ్లూరుపేట వైసీపీలో భగ్గుమన్న అసంతృప్తి
సూళ్లూరుపేట వైసీపీలో వర్గ పోరు తారాస్థాయికి చేరిందా? రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకి అధినేత హ్యాండివ్వనున్నారా? సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారా? ఎంపీ గురుమూర్తి పేరు ప్రచారంలోకి రావడంపై ఎమ్మెల్యే కిలివేటి అనుచురులు ఆగ్రహంగా ఉన్నారా?

ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో అధికార వైసీపీ వర్గపోరుతో సతమతం అవుతోంది. దాదాపు ప్రతినియోజకవర్గంలో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఓ వర్గం తయారయినట్లు టాక్ వినిపిస్తోంది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ వైసీపిలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు పావులు కదపుతుండటంతో పార్టీలో చీలిక వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌కు ఎసరు పెట్టడానికి అసమ్మతి నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గం వైసీపీలో అంతర్గతంగా నాయకుల మధ్య కుమ్ములాటలు తీవ్రస్థాయిలో జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం నియోజకవర్గ ఇన్చార్జిగా తిరుపతి ఎంపీ గురుమూర్తిని తీసుకొచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. రెండు సార్లు శాసనసభ్యులుగా ఉన్న కిలివేటి పార్టీ క్యాడర్ కాదని తన సొంతంగా మరో వర్గాన్ని ప్రోత్సహించడంతో పార్టీలోని సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సూళ్లూరుపేట వైసీపీలో ఇటీవల జరిగిన ఘటనలు వర్గపోరుకు మరింత ఆజ్యం పోశాయని సొంత పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండు వర్గాలుగా ఉన్న నేతల్లో ఎంపీపీ అనిల్ రెడ్డికి ఎమ్మెల్యే అండదండలు ఉండగా.. పురపాలక ఛైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి దూరమయ్యారు. పురపాలక వ్యవహారాలలో అనిల్ రెడ్డి తల దూర్చడంతో పాలకవర్గంలో గొడవలకు ఎమ్మెల్యే కారణంగా మారారని ఆ పార్టీ నేతలు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఛైర్మన్ శ్రీమంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని సోషల్ మీడియా కన్వీనర్ గా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి బాబురెడ్డిని తొలగించడం, ఆ తర్వాత తన కష్టాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పై ఎమ్మెల్యే బాబు రెడ్డిని పోలీసులతో కొట్టించడంపై నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతోంది. ఈ వివాదం చల్లారకముందే అదే పురపాలికలో కో ఆప్షన్ మెంబర్‌గా ఉన్న సునీల్ రెడ్డి వర్పెస్ ఎమ్మెల్యేగా సాగిన వివాదంపై ఎమ్మెల్యే తీరును సునీల్ రెడ్డి బహిరంగంగా తూర్పారబట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆదేశాలతో సునీల్ రెడ్డిని స్టేషన్‌కు రప్పించి దారుణంగా కొట్టారని వైసీపీ నేతలే ఆరోపిస్తున్నారు. సునీల్ రెడ్డి స్టేషన్‌లో ఉండగానే దబ్బల శ్రీమంత్ రెడ్డి తన వర్గంతో స్టేషన్‌ను ముట్టడించడంపై అధికారపార్టీలో చర్చకు దారితీసింది.

ఇదిలా ఉండగా ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం పూర్తి మద్దతు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తికేనని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది. చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేణిగుంట విమానాశ్రయంలో టికెట్ విషయమై నేతల ముందే చర్చించినట్లు టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే నుద్దేశించి సీఎం చేశారని చెబుతున్న వ్యాఖ్యలు నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి. సంజీవయ్య నువ్వు నా గుండెల్లో ఉన్నావు నీకు ఏదైనా చేస్తా అంటూ టికెట్ రాదని హెచ్చరించేలా మాట్లాడారని ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటోంది.

సూళ్లూరుపేట నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను తనకు అనుగుణంగా మార్చుకునేందుకు ఎంపీ గురుమూర్తి నేరుగా సూళ్లూరుపేట నాయకులతొ టచ్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. సునీల్ రెడ్డి వ్యవహారంలో ఎంపీ గురుమూర్తి నాయుడుపేటలో మకాం వేసి ఎస్పీ, డీఐజీలతో మాట్లాడి సునీల్ రెడ్డిని విడిపించేందుకు సహకరించారు. ఎలాగూ ఎమ్మెల్యేకి ఎంపీకి దూరం పెరిగింది.. నియోజకవర్గంలోని దాదాపు నేతలందరు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అభ్యర్థి మార్పు అనివార్యమై అధిష్టానం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి

Tags

Read MoreRead Less
Next Story