కూకట్ పల్లి కాంగ్రెస్ లో నువ్వా...నేనా..?

కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌లో ఆ ఇద్దరు నేతలు నువ్వా నేనా అంటూ తలపడుతున్నారా? రాష్టం లోనే అతిపెద్ద నియోజకవర్గాల్లో ఒకటైన కూకట్ పల్లిలో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు నేతలు తహతహ లాడుతున్నారా ? కూకట్ పల్లి కాంగ్రెస్ టికెట్ రేసులో ఉన్న నేతలెవరు ?
గ్రేటర్ హైదరాబాద్ లో అత్యధిక ఓటర్లు ఉన్న నాలుగు నియోజకవర్గాలలో కూకట్ పల్లి ఒకటి. సెటిలర్స్ ఎక్కువగా ఉండే కూకట్ పల్లిలో ఓటర్ల ఎప్పటికప్పుడు భిన్నంగా తీర్పునిస్తున్నారు. 2009లో ఏర్పాటయిన కూకట్ పల్లి నియోజకవర్గంలో తొలిసారి లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ, 2014లో TDP అభ్యర్థి మాధవరం కృష్ణా రావు విజయం సాధించారు.ఆ తర్వాత సైకిల్ దిగి కారెక్కిన మాధవరం కృష్ణా రావు 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో BRS అభ్యర్థిగా పోటీచేసి మళ్ళీ గెలుపొందారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఒకసారి లోక్ సత్తా , ,ఒకసారి BJP మద్దతు తో TDP, ఒకసారి BRS విజయం సాధించాయి. ఈ సారి కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీ కి పట్టం కడతారో నన్న ఆసక్తి అందరిలో నెలకొంది. కూకట్ పల్లి నియోజకవర్గంలో మొత్తం 5 లక్షల మంది ఓటర్లు ఉండగా వీరిలో 25 శాతం సెటిలర్స్ కావడం విశేషం. కూకట్ పల్లిలో ఏ పార్టీ విజయం సాధించాలన్నా సెటిలర్స్ ఓట్లే కీలకంగా మారాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో జోష్ మీద ఉన్న కాంగ్రెస్ నాయకులు ఈ సారి కూకట్ పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు నేతలు తహ తహ లాడుతున్నారు. ఈ నేపథ్యంలో కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ కోసం ఇద్దరు నేతలు నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు.
కూకట్ పల్లి కాంగ్రెస్ టికెట్‌ను TPCC అధికార ప్రతినిధి సత్యం శ్రీ రంగం ఆశిస్తున్నట్లు నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. గతంలో TDPలో ఉన్న సత్యం శ్రీ రంగం రేవంత్ రెడ్డితో పాటు TDP నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తన శ్రీ రంగం ఫౌండేషన్ ద్వారా 20 ఏళ్ళుగా సేవా కార్యక్రమాలు చేస్తూ కుకట్ పల్లి ప్రజలకు చేరువయ్యారు. కరోనా సమయంలో నియోజకవర్గంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడంతో పాటు ఆపదలో ఉన్న పేదలను ఆదుకున్నారు. హాత్ సే హాత్ జోడో యాత్ర తో కూకట్ పల్లి నియోజకవర్గన్ని చుట్టేసిన సత్యం శ్రీరంగం ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందిన త్యం శ్రీ రంగం విద్యా వంతుడైన తనకే కూకట్ పల్లి కాంగ్రెస్ టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
దివంగత కాంగ్రెస్ నేత PJRకు ప్రధాన అనుచరుడైన గొట్టిముక్కల వెంగళ రావు 40 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. TPCC కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్న గొట్టిముక్కల వెంగళ రావు కుకట్ పల్లి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. 2009లో కూకట్ పల్లి కార్పొరేటర్‌గా ఎన్నికయిన వెంగళరావు కూకట్ పల్లి టౌన్ ప్రెసిడెంట్‌గా , యూత్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. కరోనా సమయంలో పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడంతో పాటు....ఆపదలో ఉన్న వారిని అదుకొంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గొట్టిముక్కల వెంగళ రావు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయడం తో పాటు హాత్ సే హాత్ జోడో యాత్రతో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ సారి కూకట్ పల్లి కాంగ్రెస్ టికెట్ తనకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం మీద కూకట్ పల్లి కాంగ్రెస్‌లో పోటీ పడుతున్న ఇద్దరు నేతలు నిరంతరం ప్రజాల్లోనే ఉంటూ , టికెట్ కోసం ప్రయత్నాలు చేపట్టారు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరిలో ఎవరికి కేటాయిస్తుందో వేచి చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com