కర్నూలు వైసీపికి ఉక్కపోత

కర్నూలు వైసీపికి ఉక్కపోత


కర్నూలు వైసీపీలో సోషల్ మీడియా చిచ్చుపెట్టిందా? వైసీపీ నేతల రహస్య ఆడియోలు రచ్చగా మారాయా? ఆడియో లీకులు ఎమ్మెల్యేకి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయా? వైసీపీ లీడర్ల బాగోతాలతో ఆ పార్టీ పరువు బజారున పడిందా?

కర్నూలు వైసీపీలో సోషల్ మీడియా పోస్టింగ్‌లు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారం చినికి చినికి గాలివానలా మారడంతో అధికార పార్టీకి తలనొప్పిగా మారినట్లు టాక్ వినిపిస్తోంది. కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్ లో అధికార పార్టీ రాజకీయాలు..ఒకే పార్టీలోనే ఉన్న లీడర్ల మధ్య ఆధిపత్య పోరుకు తెరలేపింది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్..మరో నేత మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిల మధ్య వర్గపోరు సాగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఎన్నికల ముందు వరకూ వీరిద్దరూ భాగానే ఉన్నా..ఎన్నికల తరువాత మాత్రం హఫీజ్ గెలుపొందడంతో సెగ్మెంట్ లో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమయయినట్లు టాక్ నడుస్తోంది. తాజాగా వీరి మధ్యకు మాజీ కాంగ్రెప్ పార్టీ జిల్లా అధ్యక్షులైన అహ్మద్ అలీఖాన్ మరో ముస్లిం మైనార్టీ నేత వైసీపిలో చేరి..రానున్న ఎన్నికల్లో వైసీపి టికెట్ ఆశిస్తున్నారు.

అయితే తాజాగా మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సతీమణి విజయమనోహరికి వైసీపి అధిష్టానం కేడీసీసీబి చైర్మన్ పోస్టుని కేటాయించింది.దీంతో రాబోయే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తూ తనకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నఎస్వీ మోహన్ రెడ్డి సమస్య తొలగిపోయిందని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వర్గం లోలోపల సంబర పడింది. ఇక పార్టీలో కొత్తగా చేరిన అహ్మద్ అలీఖాన్ తనకు పోటీనే కాదని హఫీజ్ ఖాన్ భావించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపి టికెట్ ఖరారు అయిపోయిందని..ఎం.ఎల్.ఏ.హఫీజ్ ఖాన్ తో పాటు ఆయన వర్గీయులు హ్యాపీ మూడ్ లో ఉన్నట్లు పార్టీ క్యాడర్‌లో చర్చ జరుగుతోంది. అయితే హఫీజ్ ఖాన్ ఆనందం వారం తిరగకముందే ఆవిరయినట్లు తెలుస్తోంది. తన గురించి బయట జరుగుతున్న ప్రచారం కంటి మీద కునుకులేకుండా చేస్తోందట. ఆయనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కర్నూలు వైసీపీలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.

ఇటీవల ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఓ మహిళతో వాట్సప్ కాల్ లో మాట్లాడిన వీడియో లీకవడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో మూడు కోట్లు ..నా మీద నమ్మకం లేదా మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను అంటూ ఎమ్మెల్యే ఓ మహిళ మధ్య జరిగిన సంభాషణ నెట్టింట్ వైరల్ అయింది. ఈ వ్యవహారంపై సొంత పార్టీ నేతలే విమర్శలకు దిగడంతో విచారణ జరిపించాలంటూ జిల్లా ఎస్పీని కలసి మరీ ఎమ్మెల్యే హఫీజ్ ఫిర్యాదు చేశారు.

ఇక టికెట్ తనకే దక్కుతుందని భావించిన హఫీజ్ ఖాన్‌కు ఈ పరిణామాలు శరాఘాతంగా తగిలినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలతో హఫీజ్ ఖాన్ నోరు మెదపలేని పరిస్థితి తీసుకొచ్చిందని ఆయన సన్నిహితుల టాక్. ఇదిలా ఉంటే వీడియో కాల్ మాట్లాడిన మహిళ హఫీజ్ ఖాన్ తన మీద హత్యాయత్నానికి ఒడిగట్టారంటూ ఆమె సెల్ఫీ వీడియో తీసి జిల్లా పోలీస్ ఉన్నతాధికారికి పంపడంతో ఈ వ్యవహారం వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారినట్లు ప్రచారం ఉరుగుతోంది.

అసలే ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతుండగా, గడప గడపలో ఎమ్మెల్యేలకు నిరసనలు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కర్నూలు వైసీపీ రాజకీయాలు పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Read MoreRead Less
Next Story