Editorial: మునుగోడు బీఆర్ఎస్‌లో ఆశావహుల హల్‌చల్

Editorial: మునుగోడు బీఆర్ఎస్‌లో ఆశావహుల హల్‌చల్
మునుగోడు బరిలో దిగేందుకు బీఆర్ఎస్ అశావహులు పోటీ పడుతున్నారా? సేవా కార్యక్రమాలతో ప్రజలతో మమేకమవుతున్నారా? వాల్ పోస్టర్ల ద్వారా ప్రచారం ముమ్మరం చేశారా? టికెట్ టార్గెట్‌గా పాలిటిక్స్ చేస్తున్నారా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అధికార బీఆర్ఎస్‌లో సిట్టింగులు, ఆశావహుల మధ్య టికెట్ పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. నల్లగొండ జిల్లా లోని మునుగోడు నియోజకవర్గంలో ఈ పోటీ ఎక్కువగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ పై గులాబీ ఆశావహులు గంపెడాశతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే.. చాపకింద నీరులా ఎన్జీవోలు, ఫౌండేషన్ల పేరుతో ఆ పార్టీ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు.

మునుగోడు ఉపఎన్నికలు ముగిసి ఏడు నెలలు గడుస్తుండగా.. అప్పట్లో గులాబీ అగ్ర నేతలు ఇచ్చిన హామీల్లో.. ఒక్కోక్కటిగా అమలవుతున్నాయి. బీటీ రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణం సహా వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పనులు ప్రారంభం కాగా.. చర్లగూడెం రిజర్వాయర్ భూ నిర్వాసితులకు R అండ్ R ప్యాకేజీ సైతం ముగింపు దశకు వచ్చినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూసుకుంట్ల సుడిగాలి పర్యటనలు చేస్తుండగానే.. మరోవైపు.. గులాబీ పార్టీలోని ఆశావాహులంతా మళ్లీ క్రియాశీలకంగా మారుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈక్రమంలో.. జడ్పీటీసీ, ఎంపీటీసీ సర్పంచ్ లు సైతం.. ఎమ్మెల్యే మీద గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరంతా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కించుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. వీరిలో బీసీ సామాజికవర్గం నుండి నారబోయిన రవి ముదిరాజ్ ముందంజలో ఉండగా.. తాజాగా గుత్తా అమిత్ రెడ్డి సైతం బరిలో దిగేందుకు పావులు కదుపుతున్నారు. వీరితో పాటు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణా రెడ్డి వంటివారు కూడా రేసులో ఉన్నామని ప్రచారం చేసుకుంటున్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో, 2022 ఉప ఎన్నిక సమయంలో దాదాపు అర డజను మంది అభ్యర్థులు తెరపైకి వచ్చారు. ఈసారి మాత్రం.. మునుగోడు టికెట్ రేసులో.. సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా.. మరో ఇద్దరు, ముగ్గురు వ్యక్తులే ప్రధానంగా కనిపిస్తున్నారు. వీరిలో.. గత ఐదేళ్లుగా క్షేత్రస్థాయిలో పార్టీ ఆదేశించిన అన్ని కార్యక్రమాలు సహా సామాజక, సేవా కార్యక్రమాలు చేస్తున్నాననీ.. నారబోయిన రవి ముదిరాజ్ చెబుతున్నారు. గతంలో సామాజిక సమీకరణాల నేపథ్యంలో టికెట్ దక్కలేదని చెబుతున్నారు. ప్రస్తుతం మునుగోడు జడ్పీటీసిగా.. నారబోయిన రవి సతీమణి.. నారబోయిన స్వరూప కొనసాగుతున్నారు. ఈసారి మునుగోడు బరిలో తప్పక దిగుతానని రవి ముదిరాజ్ బాహాటంగానే చెబుతున్నారు. తన ఎన్జీనో ద్వారా సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా వాల్ రైటింగ్స్, పోస్టర్లతో.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ది, సంక్షేమ పథకాలతో.. అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ పోస్టర్లను వేయిస్తున్నారు. అలాగే.. తనకు గట్టి పట్టున్న మునుగోడు మండలంతోపాటు.. మిగతా మండలాలల్లోనూ క్యాడర్‌ను పెంచుకునేందుకు పక్కా స్కెచ్‌తో ముందుకు వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరోవైపు మునుగోడు బరిలో నేనూ ఉన్నానంటున్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి. నల్లగొండ, మునుగోడు అసెంబ్లీలే టార్గెట్ గా ఆయన రాజకీయాలు చేస్తున్నారు. గతకొంతకాలంగా.. మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ లోనే ఎక్కువగా. గుత్తా వెంకట్ రెడ్డి ఫౌండేషన్ పేరుతో.. సామాజిక, సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇటీవల.. మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ లో.. గుత్తా అమిత్ రెడ్డి వైపు వెళుతున్నారనే నెపంతో సంస్థాన్ నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమ ప్రేమ్ చందర్ రెడ్డి మీద ఎమ్మెల్యే కూసుకుంట్ల వర్గం అవిశ్వాస తీర్మానం పెట్టిందనే ప్రచారమూ సాగుతోంది. ఇదిలావుంటే.. నల్లగొండ ఎమ్మెల్యే సోదరుడైన కంచర్ల కృష్ణారెడ్డి సైతం బరిలో ఉన్నానంటున్నారు. గత బైపోల్ లో.. చివరివరకు టికెట్ రేసులో ఉండగా.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో.. ఎన్నికల బాద్యతలను నిర్వహించారు. దీంతో ఈసారి ఎలాగైనా అవకాశం రాకపోద్దా అని ఎదురు చూస్తున్నారు కంచర్ల కృష్ణారెడ్డి.

మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వర్గం మాత్రం.. ఎవరెన్ని కుప్పిగంతులేసినా.. తమకే టికెట్ వస్తుందంటూ ప్రచారం చేస్తోంది. అందుకు తగ్గట్టే.. వాల్ రైటింగ్స్, పోస్టర్లతో నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. అదే సమయంలో ఈసారి తమ అదృష్టాన్ని పరిక్షించుకోవాలని నారబోయిన రవి, గుత్తా అమిత్ రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి తమ తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story