పొంగులేటి అడుగులు అటువైపేనా..?

పొంగులేటి అడుగులు అటువైపేనా..?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు రంజుగా మారాయా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరకుండా మోకాలడ్డుతోంది ఎవరు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు రంజుగా మారాయా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరకుండా మోకాలడ్డుతోంది ఎవరు? పొంగులేటిని హస్తం పార్టీలోకి రానివ్వకుండా తెర వెనుక మంత్రాంగం నడుపుతున్న నాయకులు ఎవరు? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు పొంగులేటి రాక ఇష్టం లేదా..? సొంతపార్టీ పెట్టాలని పొంగులేటిపై ఒత్తిడి పెరుగుతోందా? కర్ణాటక ఎన్నికల ఫలితాలకు పొంగులేటి పొలిటికల్ ఫ్యూచర్‌కు లింకేంటి?

కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడటంతో పొంగులేటి రాజకీయ భవిష్యత్‌పై ఏంటనేది జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చ నడుస్తోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , మాజీమంత్రి జూపల్లి కృష్ణారావులతోపాటు మరికొందరు కాంగ్రెస్ లో చేరతారని టాక్ వినిపిస్తోంది. పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరితే తమకు తీవ్ర నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో బీజేపీలోకి లేదా సొంతపార్టీ పెట్టేలా బీఆర్ఎస్ తెరవెనుక ఉండి ప్రేరేపిస్తున్నారని అందుకు వారి వద్ద అన్ని అస్త్రాలను ఉపయోగిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.. మరోవైపు పొంగులేటి కాంగ్రెస్‌లో చేరకుండా కొంతమంది మోకాలడ్డుతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. అయితే దీనికి సూత్రధారులు ఎవరు..? ఎందుకు చేస్తున్నారని అంటే ఇందులో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎవరి ప్రయోజనాలు వారికున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఈ క్రమంలో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి పొంగులేటి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరూ గెలిచారని గుర్తు చేశారు. పొంగులేటి పార్టీలోకి వచ్చినా రాకున్నా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని సీట్లను కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బలమైన నేత అయితే 2018 ఎన్నికల్లో 9 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు ఎలా ఓడిపోయారంటూ ప్రశ్నించారు. సొంత పార్టీ నేతలను ఓడించిన చరిత్ర పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంతం అంటూ హాట్ కామెంట్స్ చేశారు

గతంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిన సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క..పొంగులేటి ఆత్మీయ సమ్మేళనంలో నియోజకవర్గ వారీగా అభ్యర్థులను ప్రకటించడంతో భట్టి విక్రమార్క సైతం పునరాలోచనలో పడినట్లు టాక్ వినిపిస్తోంది..ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే భట్టి విక్రమార్క వర్గానికి రేణుకా చౌదరి వర్గానికి ఢీ అంటే ఢీ అన్న పరిస్థితి నెలకొందని ప్రచారం జరుగుతోంది. రేణుక,భట్టి మధ్య అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంచాయతీ..ఇప్పటికే భట్టి విక్రమార్క, రేణుక చౌదరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ వర్గం నేతలకు టికెట్లు ఇప్పించుకునేందుకు పావులు కదుపుతున్నారని జిల్లాలో చర్చ జరుగుతోంది. పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరితే జిల్లాలో తమ ఆధిపత్యం పోతుందని ఇరువురు నేతలూ భావిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

పొంగులేటి శ్రీనివాసరెడ్డి కదలికలపై అటు ఇంటలిజెన్స్ వర్గాలు, ప్రధాన రాజకీయ పార్టీలు ఓ కన్నేసినట్లు సమాచారం. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణాలో బీఆర్ఎస్ ను ఓడించాకలిగే పార్టీ కాంగ్రెస్ అని పొంగులేటి నిర్దారణకు వచ్చినట్లు ఆయన అనుచరుల్లో టాక్ వినిపిస్తోంది.తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో రాహుల్ టీం పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో చర్చలు జరిపినట్లు సమాచారం. పొంగులేటిని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ ,బీజేపీ పెద్దలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. షర్మిల పార్టీ పొంగులేటి తమ పార్టీలోకి వస్తారని గంపెడాశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ను ఓడించగలిగే పార్టీలోకి వెళ్లాలని పొంగులేటి భావిస్తున్న నేపథ్యంలో దేశ రాజకీయాలు ఎలా ఉన్నా తెలంగాణలో తనకు కనీస గౌరవం ఇవ్వకుండా అవమానపరిచిన కేసీఆర్ పై కక్ష తీర్చుకోవాలనే పట్టుదలతో పొంగులేటి ఉన్నారట? కేసీఆర్‌ను ఇంటికి పంపాలనే సింగిల్ ఎజెండాతో ఉన్న పొంగులేటి ఏ పార్టీలో చేరతారాన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

పొంగులేటి కాంగ్రెస్ చేరతారని అధికార బీఆర్ఎస్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఏ పార్టీలో చేరేది ఇసుమంతైనా పొక్కనివ్వని పొంగులేటి శ్రీనివాసరెడ్డి..బీఆర్ఎస్ ఓడించాలంటే హస్తం పార్టీలో చేరాలంటూ పొంగులేటి మీద ఆయన అనుచరులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని హస్తం గుర్తుపై పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పొంగులేటికి సూచించినట్లు సమాచారం. జూన్ 2న పార్టీ మార్పుపై పొంగులేటి నిర్ణయం తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది.. అయితే కాంగ్రెస్ పార్టీలో పొంగులేటి చేరికకు మోకాలడ్డుతున్న నేతలను జయించి హస్తానికి జై కొడతారా లేదా అన్నది వేచి చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story