బీఆర్ఎస్ టార్గెట్ యూత్

బీఆర్ఎస్ టార్గెట్ యూత్
యువ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అధికార బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది


హ్యాట్రిక్ కొట్టేందుకు బీఆర్‌ఎస్ వ్యూహ రచన చేస్తోందా?
యూత్ టార్గెట్‌గా అధికార పార్టీ ఎమ్మెల్యేలు పాలిటిక్స్ చేస్తున్నారా?
యువ ఓటర్లను ఒడిసిపట్టేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యూహాలు రచిస్తున్నారా

రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార బీఆర్‌ఎస్ పకడ్బందీ వ్యూహరచనతో ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.ముఖ్యంగా యువ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అధికార బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతలకు క్షేత్రస్థాయిలో పలు వర్గాల నుండి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతోపాటు.. సొంత పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకత్వం సైతం ఎమ్మెల్యేలపై గుర్రుగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తుండటంతో అప్రమత్తమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్ని వర్గాల ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఎమ్మెల్యేలు వ్యూహాలు రచిస్తున్నారు.

ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టేందుకు గులాబీ బాస్ కేసీఆర్ పక్కాగా స్కెచ్ వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో.. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రుల వరకు దాదాపు రెండు నెలలపాటు ప్రజల్లోనే ఉండేలా చేశారు. అనంతరం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో.. 22 రోజులపాటు.. రోజుకో కార్యక్రమం పేరుతో ఎమ్మెల్యేలందరినీ నిత్యం ప్రజల మధ్యన ఉండేలా కార్యక్రమాలు రూపొందించారు. గతకొద్దిరోజులుగా.. ప్రతిపక్ష పార్టీల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న బలమైన కాంగ్రెస్ నాయకులను బీఆర్‌ఎస్‌లో ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా భువనగిరి డీసీసీ ప్రెసిడెంట్, కుంభం అనీల్ కుమార్ రెడ్డిని పార్టీ కండువా కప్పారు.

ఈసారి భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డిపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు సర్వే రిపోర్టులో తేలినట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని.. నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ వంటి మేజర్ మున్సిపాలిటీల్లో వందల కోట్ల రూపాయలతో అభివృద్ది జరుగుతున్నా.. పురాతన మున్సిపాలిటీగా ఉన్న భువనగరి లో మాత్రం పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవేగాక.. బస్వాపూర్ రిజర్వాయర్ భూనిర్వాసితుల కోసం పునరావాస ప్యాకేజీ లేటు కావడం,. ప్లాట్లను ఇవ్వడంలోనూ.. ప్లాట్ల డెవలప్మెంట్ కాంట్రాక్ట్ లోనూ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులను ఇప్పించుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. భువనగిరి చుట్టూ వందలాది ఎకరాల్లో వెంచర్లు వేయడం.. తన భూములు రీజినల్ రింగ్ రోడ్ పరిథిలోకి పోకుండా.. పేద రైతుల భూముల గుండా రీజినల్ రింగ్ రోడ్‌ను తీసుకెళ్లడంపై దాదాపు 10 గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో.. రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ నేత కుంభం అనీల్ కుమార్ రెడ్డి ని పార్టీలోకి తీసుకొచ్చారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా యూత్ టార్గెట్ గా.. కొత్తగా ఓటర్లుగా నమోదయిన యువతీ యువకులను ఆకట్టుకోవడానికి.. 18 ఏళ్లు నిండిన వారందరికీ.. ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఉండగానే.. కుంభం అనీల్ కుమార్ రెడ్డి ఫ్రీ డ్రైవింగ్ లైసెన్స్ క్యాంపులను చేపట్టారు. అందుకు ప్రతిగానే.. యవతను ఆకట్టుకునేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే సైతం డ్రైవింగ్ లైసెన్స్ క్యాంపు నిర్వహిస్తున్నారు.

మరోవైపు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్న గొంగిడి సునీత మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే భర్త, ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి.. ఇప్పటికే గులాబీ పార్టీ ముఖ్య నాయకులతోనూ.. మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ లను కలుపుకొని.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. గతంలో.. ఎమ్మెల్యే సునీత. ఆమె భర్త మహేందర్ రెడ్డి వైఖరితో విసుగుచెందిన పలువురు నేతలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో చేరిపోయారు. దీంతో.. పాత నాయకులతోపాటు.. కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన నాయకులను గులాబీ గూటికి తీసుకొచ్చేందుకు సునీత దంపతులు తెరవెనుక ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. సునీత నియోజకవర్గ అభివృద్ది పనుల కోసం సీఎం, మంత్రుల దగ్గర పైరవీలు చేస్తుండగా.. నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేయడంలో భర్త, డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ మహేందర్ రెడ్డి ఫోకస్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆలేరు కేంద్రంలో.. భారీగా ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళా ఏర్పాటుచేసి.. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించే కార్యక్రమం చేపట్టారు. మొదటి రోజు సుమారు ఐదు వేల మంది యువత.. ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే 15 వేల నుండి 20వేల మంది వరకు ఫ్రీ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోనున్నట్లు అంచనా వేస్తున్నారు.

ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆలేరు, భువనగిరి అసెంబ్లీ సెగ్మెంట్లలో.. యూత్ టార్గెట్‌గా అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ్యూహరచన చేస్తున్నారు. అయితే దీనికి దీటుగా ప్రతిపక్షాలు కూడా యూత్‌ని ఆకట్టుకునేందుకు పలు కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story