Editorial: ఉప్పల్ కాంగ్రెస్‌లో టికెట్ ఫైట్

Editorial: ఉప్పల్ కాంగ్రెస్‌లో టికెట్ ఫైట్
ఉప్పల్ కాంగ్రెస్‌లో టికెట్ పోరు తారస్థాయికి చేరిందా? రేవంత్ రెడ్డి పర్యటనలో ఆశావహులు బల ప్రదర్శనకు దిగారా ? ఉప్పల్ టికెట్ కోసం పోటీ పడుతున్న ఆ ముగ్గురు నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా? ఎవరికి వారు తమకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారా? అసలు ఉప్పల్ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో ఎన్నికల కోలాహలం మొదలయింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత మంచి జోష్ మీద ఉన్న కాంగ్రెస్‌లో టికెట్ కోసం పోటీ తీవ్రమైంది.మరి ముఖ్యంగా ఉప్పల్ కాంగ్రెస్ టికెట్ కోసం నేతలు బలప్రదర్శన దిగుతున్నారు. 2009 లో ఏర్పడ్డ ఉప్పల్ నియోజవర్గానికి మూడు సార్లు ఎన్నికలు జరగ్గా మూడు పార్టీ లు ఒక్కో సారి విజయం సాధించాయి. 2009 లో కాంగ్రెస్ నుంచి బండారు రాజిరెడ్డి, 2014 లో టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్ విజయం సాధించారు. 2018 లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి భేతి సుభాష్ రెడ్డి విజయం సాధించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ఉప్పల్ నియోజక వర్గంలో ఆశావహుల మధ్య పోటీ నెలకొంది. 2020లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రెండు డివిజన్లలో మాత్రమే గెలిచింది.అది కూడా ఉప్పల్ నియోజక వర్గ పరిథిలోని ఉప్పల్ డివిజన్ నుంచి రజిత పరమేశ్వర్ రెడ్డి , ఏఎస్‌ రావు నగర్ నుండి శిరీష సోమశేఖర్ రెడ్డి విజయం సాధించారు. అంతకు ముందు 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరి ఎంపీగా రేవంత్ రెడ్డి విజయం సాధించడంలో ఉప్పల్ నియోజకవర్గం కీలక పాత్ర పోషించింది.

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఉప్పల్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు పలువురు ఆశావహులు పోటీ పడుతున్నారు. దీంతో ఉప్పల్ కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట నడుస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. 2009లో కాంగ్రెస్ , 2014 లో బీజేపీ , 2018 లో BRS ...ఇప్పుడు ఉప్పల్‌లో ఏ పార్టీ జెండా ఎగురనుందోనని ప్రజల్లో చర్చ నడుస్తోంది. ఉప్పల్‌లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని ప్రజలు ఈ సారి కాంగ్రెస్ పార్టీ కే పట్టం కడతారని ఆశావహులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ బలంగా ఉన్న ఉప్పల్ లో టికెట్ వస్తే....గెలుపు నల్లేరు మీద నడకే అనే భావన లో ఉన్న నేతలు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల వరద ముంపు ప్రాంతాల పర్యటనకు వచ్చిన రేవంత్ రెడ్డి ముందే నేతలు బలప్రదర్శనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. రాగిడి లక్మరెడ్డి పెట్టిన ఫ్లెక్సీలో ఉప్పల్ కార్పొరేటర్ ఫోటో లేదని... రజిత పరమేశ్వర రెడ్డి అనుచరులు ఫ్లెక్సీలను చించేవేసి రేవంత్ రెడ్డి ముందే బాహాబాహీకి దిగారు. ఉప్పల్ కాంగ్రెస్ టికెట్ కోసం ముగ్గురు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ బీ బ్లాక్ ప్రెసిడెంట్ గా ఉన్న సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ....ఉప్పల్ కాంగ్రెస్ టికెట్ రేసులో ముందున్నారు. సోమశేఖర్ రెడ్డి కుటుంబానికి ఉప్పల్ నియోజకవర్గ రాజకీయల్లో విడదీయ రాని అనుబంధం ఉంది. సింగిరెడ్డి కుటుంబ సభ్యులు గతంలో కాప్రా సర్పంచ్‌గా పనిచేశారు. మున్సిపాలిటీ అయినతర్వాత కాప్రా కౌన్సిలర్‌గా సింగిరెడ్డి కుటుంబ సభ్యులే ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో ఏఎస్‌ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ గా సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి భార్య శిరీష ఉన్నారు. సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి .....ఎన్‌ఎస్‌యూఐ నాయకుడి నుంచి కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నారు.సోమశేఖర్ రెడ్డి మల్కాజ్ గిరి పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. యువ సేన ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో హాత్ సే హాత్ జోడో యాత్రతో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. స్థానిక సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడుతూ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడినైన తనకే ఉప్పల్ కాంగ్రెస్ టికెట్ వస్తుందని సోమశేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఉప్పల్ ఏ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా ఉన్న మందుముల పరమేశ్వర రెడ్డి కూడా ఉప్పల్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. 2009లో ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్‌గా పరమేశ్వర రెడ్డి విజయం సాధించారు. 2014 లో ఉప్పల్ ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికి మహా కూటమి పొత్తులో భాగంగా టికెట్ మిస్ అయ్యింది. 2020లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఉప్పల్ కార్పొరేటర్‌గా పరమేశ్వర రెడ్డి భార్య రజిత విజయం సాధించారు. కరోనా సమయంలో పేదలకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేసిన పరమేశ్వర రెడ్డి నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు. ఉప్పల్ లో హాత్ సే హాత్ జోడో యాత్ర తో పరమేశ్వర రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.

రాగిడి లక్ష్మారెడ్డి 1997 నుంచి యూత్ కాంగ్రెస్ నాయకుడిగా పార్టీలో పని చేస్తున్నారు. YS రాజశేఖర్ రెడ్డి కి అనుచరుడిగా ఉన్న రాగిడి లక్ష్మారెడ్డి 2009 లో ఉప్పల్ కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. 2009 లో బండారు రాజిరెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో ఆయన గెలుపు కోసం కృషి చేశారు. 2014 లో కాంగ్రెస్ పార్టీ బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వడంతో అప్పుడు కూడా పార్టీ కోసం పని చేశారు.2018 లో మహా కూటమి పొత్తులో భాగంగా ఉప్పల్ టికెట్ టీడీపీ వెళ్ళింది.అయినా పార్టీ ఆదేశాలతో టీడీపీ విజయం కోసం పని చేశారు రాగిడి లక్ష్మారెడ్డి. కాంగ్రెస్ పార్టీ పిలువు ఇచ్చిన కార్యక్రమాలు చేస్తూనే ...మరో వైపు తమ మధుర ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ....ప్రజలకు చేరువ అవుతున్నారు.

మొత్తం మీద ...ఉప్పల్ టికెట్ రేసులో ఉన్న నేతలు నిత్యం ప్రజల్లోనే ఉంటూ ఎవరికి వారు టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉప్పల్‌లో రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా బలప్రదర్శన చేసి టికెట్ దక్కించుకునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎవ్వరికి టికెట్ ఇస్తుందో వేచి చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story