Serilingampally : శేరీలింగంపల్లి కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట..!

శేరిలింగంపల్లి ( serilingampally ) నియోజకవర్గం కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట కొనసాగుతోందా ? దేశంలోనే అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గమైన శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు నేతలు తహతహ లాడుతున్నారా ? మినీ ఇండియా అయిన శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ టికెట్ కోసం నేతల మధ్య పోటీ పెరిగిందా? శేరిలింగంపల్లి కాంగ్రెస్ ( Telangana Congress )టికెట్ రేసులో ఉన్నది ఎవరు?
తెలంగాణ అసెంబ్లీ ( Telangana Elections 2023 )ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. నిన్న మొన్నటి వరకు స్తబ్ధుగా ఉన్న రాష్ట్ర రాజకీయాలు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత వేగం పుంజుకున్నాయి. అధికార బీఆర్ఎస్‌కు ( BRS Party) ధీటుగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. దీంతో పలువురు ఆశావహులు కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిథిలోని శేరీలింగపల్లి కాంగ్రెస్‌లో ఆశావహుల మధ్య పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది.
2009లో ఏర్పాటయిన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తొలిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి భిక్షపతి యాదవ్ ( Bikshapathi Yadav )గెలుపొందగా, 2014లో బీజేపీ మద్దతుతో టీడీపీ అభ్యర్థి అరికెపూడి గాంధీ ( arekapudi gandhi )విజయం సాధించారు.ఆ తర్వాత సైకిల్ దిగి కారెక్కిన అరికెపూడి గాంధీ ....2018లో ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మళ్ళీ కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో నియోజకవర్గం కాంగ్రెస్‌లో ఆశావహుల మధ్య పోటీ నెలకొంది.
టీపీసీసీ జనరల్ సెక్రటరీ కోటింరెడ్డి వినయ్ రెడ్డి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. కోటింరెడ్డి వినయ్ రెడ్డి ( Kotam Reddy Vinay Reddy) 2014లో జూబ్లీహిల్స్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మెంబర్ షిప్ ఇంచార్జిగా నియోజకవర్గంలో 56 వేల డిజిటల్ మెంబర్ షిప్‌లు చేయించారు. శేరిలింగంపల్లి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న కోటింరెడ్డి వినయ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో హాత్ సే హాత్ జోడో యాత్ర చేపట్టారు. హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ ఆపదలో ఉన్న పేదలను అదుకుంటూ ప్రజలతో మమేకమవుతున్నారు వినయ్ రెడ్డి. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ, ముస్లింలకు ఇప్తార్ విందులు ఇవ్వడంతో పాటు గణేష్ ఉత్సవాల సందర్భంగా విగ్రహాలను ఇప్పించినట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పలు ఆందోళన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న తనకే శేరిలింగంపల్లి కాంగ్రెస్ టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కోటింరెడ్డి వినయ్ రెడ్డి.
శేరిలింగంపల్లి నియోజకవర్గ టీపీసీసీ ( TPCC ) ప్రతినిధి అయిన ఎస్ సత్యనారాయణ రావు ( S Satyanarayan Rao ) ఈ సారి శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ తరపున బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. SSR ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. సత్యనారాయణ రావు. ఆపదలో ఉన్న పేదలను ఆదుకుంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతే కాకుండా ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న సత్యనారాయణ రావు హాత్ సే హాత్ జోడో పాదయాత్రతో శేరిలింగంపల్లిలో విస్తృతంగా పర్యటించారు. విద్యావంతుడైన సత్యనారాయణ IT కంపెనీలతో ఉన్న సత్సంబంధాలు తనకు కలిసి వస్తాయని.....శేరిలింగంపల్లి కాంగ్రెస్ టికెట్ నాదే నంటున్నారు.
పీజేఆర్ శిష్యుడయిన జైపాల్ ( Jai Pal )1978 నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. TPCC జనరల్ సెక్రటరీగా పని చేస్తున్న జైపాల్ 2000 సంవత్సరంలో శేరిలింగంపల్లి మున్సిపల్ చైర్మన్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ సారి శేరిలింగంపల్లి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని జైపాల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఉంటున్న జైపాల్ కరోనా సమయంలో నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడంతో పాటు అన్నదానాలు చేశారు. వలస కార్మికుల కోసం ఫంక్షన్ హాల్ ఇచ్చి వసతి కల్పించారు. కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను విజయవంతం చేస్తూ....హాత్ సే హాత్ జోడో యాత్రలో చురుగ్గా పాల్గొన్నారు జైపాల్. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా.... శేరిలింగంపల్లి స్థానికుడి నైన తనకే కాంగ్రెస్ టికెట్ వస్తుందని జైపాల్ ఆశాభావంతో ఉన్నారు.
మొత్తం మీద శేరిలింగంపల్లి కాంగ్రెస్‌లో పోటీ పడుతున్న ముగ్గురు నేతలు నిరంతరం ప్రజాల్లోనే ఉంటూ, టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఎవ్వరికి టికెట్ ఇస్తుందో చూడాలి మరి
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com