Editorial: విశాఖ వైసీపీ అధ్యక్షుడి కోసం అన్వేషణ...?

Editorial: విశాఖ వైసీపీ అధ్యక్షుడి కోసం అన్వేషణ...?
విశాఖ వైసీపీ అధ్యక్షుడి ఎంపిక అధినేతకు తలకు మించిన భారంగా మారిందా? పంచకర్ల రమేష్ బాబు రాజీనామా ప్రభావం వైసీపీపై తీవ్రంగా పడిందా? విశాఖ వైసీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు నేతలు విముఖత వ్యక్తం చేస్తున్నారా? అధ్యక్ష పదవి అలంకారప్రాయం తప్ప ప్రయోజనం లేదని వైసీపీ నేతలు భావిస్తున్నారా? పంచకర్ల ఝలక్ తో వైసీపీ పెద్దలకు తత్వం బోధపడిందా? పార్టీ విశాఖ అధ్యక్షుడి కోసం అధినేత జల్లెడ పడుతున్నారా?


విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పంచకర్ల రమేష్‌ బాబు రాజీనామా చేయడంతో ఆ పార్టీకి కొత్త చిక్కులు వచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం విశాఖ వైసీపీ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి పంచకర్ల రమేష్ బాబు రాజీనామా చేశారు. దీంతో పార్టీ అధినేత అధ్యక్షుని కోసం వేట మొదలెట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో అధ్యక్షుని ఎంపిక కనుచూపు మేరలో కన్పించడం లేదని టాక్ వినిపిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో విశాఖ జిల్లా అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. పంచకర్ల లాంటి నేతే పార్టీ నుండి బయటకు పోతే ఇక తమలాంటి వారి పరిస్థితి ఏంటని పలువురు నేతలు చెవులు కొరుక్కుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. విశాఖలో నెలకొన్న సిచ్చుయేషన్ పై అధినాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది..

వైసీపీకి రాజీనామా చేసిన పంచకర్ల వెళుతూ వెళుతూ ఆ పార్టీలో నెలకొన్న పరిణామాలను కళ్లకు కట్టినట్లు వివరించారని తెలుస్తోంది. అధ్యక్ష పదవి అలంకారప్రాయం తప్ప దానివల్ల పార్టీకి కష్టపడే వారికి న్యాయం చేయడానికి లేదన్నారు పంచకర్ల, దీంతో పార్టీ పరిస్థితులను అంచనా వేసుకున్న నేతలు అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ముందుకు రావడం లేదని టాక్ వినిపిస్తోంది. కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం ఇంఛార్జి వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో ఇప్పటికే అనేక సమావేశాలు జరిగినా క్లారిటీ రాలేదని క్యాడర్‌లో చర్చజరుగుతోంది. మరోవైపు అధ్యక్షుడి ఎంపిక కోసం పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు.

ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌ని అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కోరగా గతంలో ఎనిమిదేళ్లు చేశానని, ఎవరికైనా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, SA రెహమాన్ లను రిక్వెస్ట్ చేసినా ప్రెసిడెంట్ పదవితోపాటు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలను కోరినట్లు సమాచారం. ఎవర్ని అడిగినా అదే సమాధానం రావడంతో పార్టీ పెద్దలు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. చివరి ప్రయత్నంగా గత ఏడాది ఇదే పదవి నుంచి తప్పించిన మాజీమంత్రి అవంతి సైతం ససేమిరా.. అన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఓ వైపు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ మైలేజిని పెంచుకుంటుంటే అధికార పార్టీ మాత్రం నేతల వలసలతో సతమతం అవుతోందని పబ్లిక్‌లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అధ్యక్షుడి ఎంపిక అధినాయకత్వానికి కత్తిమీద సాములా మారింది. విశాఖే రాజధాని అని చెబుతున్న జిల్లాకి అధ్యక్షుడు లేకపోవడంతో వైసీపీకి మైనస్‌గా మారినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు కీలక ప్రాంతానికి సమర్ధుడైన వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించాలి. లేనిపక్షంలో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితి మరింత దిగజారే పరిస్థితి ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. సమర్థులనుకున్న నేతలంతా ససేమిరా అనడంతో పార్టీ పెద్దలకు ఏమీ చెయ్యలేని పరిస్థితి నెలకొంది. వెస్ట్ నియోజకవర్గానికి చెందిన బెహారా భాస్కరరావు, సౌత్ సెగ్మెంట్ కు చెందిన కొండా రాజీవ్ లు ప్రెసిడెంట్ పదవి చేపట్టడానికి సుముఖంగా ఉన్నప్పటికీ వారిని కీలక పదవి అప్పగించే సాహసం అధినాయకత్వం చేయడం లేదన్నది ఓపెన్ సీక్రెట్.

Tags

Read MoreRead Less
Next Story