విద్యుత్ వినియోగదారులపై మరో సారి ట్రూఅప్ పిడుగు

విద్యుత్ వినియోగదారులపై మరో సారి ట్రూఅప్ పిడుగు పడింది. యూనిట్‌కు 40 పైసల వంతున మే నెల బిల్లుతో కలిపి వసూలు చేస్తున్నాయి డిస్కంలు. దీంతో వినియోగదారులకు షాక్ తగిలే పరిస్థితి ఏర్పడుతుంది. ఏప్రిల్‌లో బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనడానికి చేసిన ఖర్చును ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద డిస్కంలు వసూలు చేస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి నెలా ఈ ఛార్జీలను వసూలు చేసుకునే వెసులుబాటును రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి డిస్కంలకు కల్పించింది. ఏపీఈఆర్‌సీ అనుమతి లేకుండా గరిష్ఠంగా యూనిట్‌కు 40 పైసలు వసూలు చేసే అధికారం డిస్కంలకు ఉంది. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని ఏడాది చివరలో సర్దుబాటు చేస్తాయి. ఇప్పటికే ప్రతి నెలా వచ్చే బిల్లులో దాదాపు 3 వేల కోట్లు ట్రూఅప్ మొత్తాన్ని డిస్కంలు కలిపి వసూలు చేస్తున్నాయి. దీనికి తోడు మూడో ట్రూఅప్ మొత్తం ప్రజలకు మరింత భారం కానుంది.
ఈ ఆర్థిక సంవత్సరం రెండు నెలల్లో చేసిన విద్యుత్ కొనుగోళ్లతో డిస్కంలకు తట్టుకోలేని నష్టాలు వచ్చాయని లెక్కలు తేల్చాయి. వేసవిలో డిమాండ్ మేరకు బహిరంగ మార్కెట్ నుంచి కొనడానికి డిస్కంలు కోట్లు ఖర్చు చేశాయి. టారిఫ్ ప్రకారం బిల్లులు వసూలు చేసినా.. అధిక ధరకు మార్కెట్‌లో కొన్న విద్యుత్ వల్ల ఇంకా యూనిట్‌కు రూ.1.20 వంతున నష్టం వస్తుందని అంచనా. ఈ నష్టాన్ని భర్తీ చేసుకోడానికి ట్రూఅప్ కింద యూనిట్‌కు 40 పైసల వంతున మే నెల బిల్లులో వసూలు చేసి.. మిగిలిన నష్టాలకు సంబంధించి ఏడాది చివరలో వసూలు చేసుకోడానికి వీలుగా అనుమతి తీసుకోవాల్సి ఉంది. యూనిట్‌కు 40 పైసలతో ఏప్రిల్‌కు సంబంధించిన ట్రూఅప్ భారం వదిలిపోయిందని ఊపిరి పీల్చుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే డిస్కంలు చూపుతున్న లెక్కల ప్రకారం ఇంకా యూనిట్‌కు 80 పైసల వంతున ట్రూఅప్ ప్రతిపాదనలను ఏడాది చివర్లో డిస్కంలు దాఖలు చేస్తాయి. మే నెల బిల్లులో డిస్కంలు వసూలు చేసిన మొత్తానికి మరో రెండు రెట్ల భారాన్ని ఏడాది చివరలో భరించడానికి వినియోగదారులు రెడీ ఉండాల్సిన పరిస్థితి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com