కెనడాలోని భారతీయ విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తాం: జయశంకర్

కెనడాలోని భారతీయ విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తాం: జయశంకర్

కెనడాలో భారతీయ విద్యార్థులు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్పందించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు విదేశాంగ శాఖ, కెనడా హై కమిషన్ తో కలిసి పని చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులు ఒకవేళ ఏ తప్పు చేయకపోతే వారిని బహిష్కరించడం అన్యాయమే అన్నారు. ఈ విషయంపై కెనెడియన్ వ్యవస్థ న్యాయంగా వ్యవహరిస్తుందని భావిస్తున్నామన్నారు.


ఫేక్ డాక్యుమెంట్లతో తమ దేశంలోకి వచ్చారంటూ కెనడా ఇమిగ్రేషన్ అధికారులు పలువురు భారతీయ విద్యార్థులకు నోటీసులు జారీ చేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 700 మంది కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ ద్వారా బహిష్కరణ లేఖలు అందుకున్నారు. దీంతో గత్యంతరం లేక భారతీయ విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. బహిష్కరణ నిలిపివేయకపోతే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని వాపోయారు. కెనడాలో ఉన్నత విద్య కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇక్కడ టాప్ యూనివర్సిటీలో సీట్లు ఉన్నాయని ఆఫర్ లెటర్లు పంపించారని, తీరా ఇక్కడికి వచ్చాక యూనివర్సిటీలలో సీట్లు అయిపోయాయని చెప్పడంతో మరో యూనివర్సిటీలో చేరామన్నారు.

ఇదంతా జరిగి ఐదు సంవత్సరాలు పూర్తయిందని అయితే ఇప్పుడు తాము పర్మనెంట్ వీసా కోసం దరఖాస్తులు చేసుకోగా ఫేక్ లెటర్ల విషయం బయట పడిందన్నారు. బాధితుల సంఖ్య 700 కంటే ఎక్కువగానే ఉండొచ్చని విద్యార్థులు చెబుతున్నారు. ఈ నోటీసులు అందుకున్న వారిలో ఎక్కువ మంది పంజాబ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఉన్నారు. దీంతో స్పందించిన పంజాబ్ ఎన్ఆర్ఐ మంత్రి కులదీప్ సింగ్ దాలివాల్ విద్యార్థుల భవిష్యత్తు నాశనం కాకుండా చూడాలంటూ కేంద్ర విద్యా శాఖ మంత్రి జయశంకర్ కు లేఖ రాశారు. ఈ విషయంపై స్పందించిన జయశంకర్ ఎంతో చిత్తశుద్ధితో తన విద్యాభ్యాసాన్ని ముగించిన వారికి ఇలాంటి పరిస్థితి రావటం బాధాకరం అన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా తప్పు చేయని విద్యార్థులను శిక్షించడాన్ని ఎవరూ అంగకరించరన్నా విషయం కెనడా ప్రభుత్వం గుర్తించాలన్నారు. విద్యార్థులను తప్పుదోవ పట్టించిన వ్యక్తులను ఇందుకు బాధ్యులుగా పరిగణించాలన్నారు.

Tags

Next Story