Durgs Mafia: డాక్టర్లపై నిఘా... కొత్త చట్టంతో డ్రగ్ మాఫియా కు చెక్..

Durgs Mafia: డాక్టర్లపై నిఘా... కొత్త చట్టంతో డ్రగ్ మాఫియా కు చెక్..
X
ఇకపై డాక్టర్లు చెప్పిన షాపులో మందులు కొనక్కరలేదు; జెనెరిక్ మందులను మరింత చౌకగా అందించే ప్రయత్నం; కొత్త చట్టంతో డ్రగ్స్ మాఫియాకు చెక్

Durgs Mafia: మీకు ఆరోగ్యం బాగాలేదు... జ్వరం వచ్చింది ఓ డాక్టర్ దగ్గరికి వెళ్లారు.. వెంటనే ఆయన ఒక యాంటీబయటిక్ మరికొన్ని మందులు ప్రిస్క్రిప్షన్ రాశారు. అయితే మామూలు జ్వరమే కదా ఇంటి దగ్గర ఉన్న మెడికల్ షాప్ లో కొనుక్కుందాం అనుకుంటారు. కానీ అక్కడ ఆ మందులు లభించవు. ఇంకో నాలుగైదు షాపులు తిరిగినా అవి దొరకవు. కేవలం డాక్టర్ సూచించిన మెడికల్ షాప్ లో మాత్రమే ఆ మందులు లభిస్తాయి.


అసలు వ్యవహారం అంతా ఇక్కడే ఉంది. సదరు సంస్థ ఆ మందుల ప్రిస్క్రిప్షన్ రాయడానికి ఆ డాక్టర్ కు ప్రతినెల కొంత ముట్టజెబుతుంది. అదేవిధంగా సంబంధిత డాక్టర్ క్లినిక్ కు అనుబంధంగా ఉన్న మెడికల్ షాప్ కు 40 నుంచి 70% దాకా లాభాలు ఉంటాయి. అంటే మీకు ఒక టాబ్లెట్ రాస్తే డాక్టర్ కు వచ్చే కిక్ బాక్స్ కాకుండా మెడికల్ షాప్ లో అమ్మినందుకు కొండంత లాభం కూడా వస్తుందన్నమాట. ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. అయితే ఈ దందాకు కేంద్రం చెక్ పెట్టబోతోంది. దీంతో ఫార్మసీ కంపెనీల ఆగడాలకు ఫుల్ స్టాప్ పడనుంది.



కేంద్ర ప్రభుత్వం ఫార్మాస్యూటికల్ కంపెనీల కోసం యూనిఫాం కోడ్ ఆఫ్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్ అంటే UCPMPలో మార్పులు చేయబోతోంది. మార్కెటింగ్ పేరుతో ఫార్మాస్యూటికల్ కంపెనీలు, డాక్టర్ల మధ్య ఉన్న ఆర్థిక అనుబంధం పై కేంద్రం కఠినంగా వ్యవహరించనుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఇప్పుడు ఈ కంపెనీలు వైద్యులకు ఇచ్చే బహుమతుల గురించి సమాచారాన్ని అందించాలి. ఇందుకోసం నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ బికె పాల్‌ అధ్యక్షతన కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

ఫార్మసిస్టులు జనరిక్ మందులను విక్రయించడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాటికి మార్జిన్లు చాలా తక్కువగా ఉంటాయి. కానీ, బ్రాండెడ్ మందులను అమ్మితే 40-70 శాతం లాభం వస్తుంది. ఫార్మాస్యూటికల్ కంపెనీ నుంచి వచ్చే కమీషన్‌ను డాక్టర్, డ్రగ్ విక్రేత ఇద్దరూ పంచుకుంటారు.

ఫార్మాస్యూటికల్ కంపెనీలు, వైద్యుల మధ్య ఉన్న అనుబంధంపై గతేడాదిలోనే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని సమాధానాలు కోరింది. ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (FMRAI) దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ సమాధానం కోరింది. ఫార్మాస్యూటికల్ కంపెనీలు వైద్యులకు పంపిణీ చేసే బహుమతులపై జవాబుదారీతనం ఉండాలని ఈ పిటిషన్‌లో డిమాండ్ చేశారు.


డోలో-650ఎంజి టాబ్లెట్‌ను తయారు చేసే సంస్థకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఈ పిల్ దాఖలైంది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు కేంద్రాన్ని సమాధానం కోరింది. దాంతో స్పందించిన కేంద్రం ఈ డ్రగ్ మాఫియా పై ఉక్కు పాదం మోపడానికి సిద్ధమవుతోంది. సంబంధిత చట్టంలో మార్పులు చేయడానికి కసరత్తు చేస్తోంది. ఇది సామాన్య ప్రజానీకానికి ఎంతో ఊరటనిచ్చే అంశం. తద్వారా జనరిక్ మందులు అతి తక్కువ ధరకే అందుబాటులోకి వస్తాయి.

Tags

Next Story