Editorial : ఏపీ ఎన్నికల బరిలో బీఆర్ఎస్... హేమాహేమీలను దింపే యోచనలో టీఆర్ఎస్

Editorial : ఏపీ ఎన్నికల బరిలో బీఆర్ఎస్... హేమాహేమీలను దింపే యోచనలో టీఆర్ఎస్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి; ఎజెండాను సిద్ధం చేస్తున్న కేసీఆర్; పెద్ద నేతలనే దింపే యోచన....



తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వేడెక్కింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా అప్పుడే ఎన్నికల కోలాహలం మొదలైంది. కేసీఆర్ చాలా ముందు చూపుతో పావులు కదుపుతున్నారు. బీజేపీతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధపడ్డ కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర సమితిని రద్దు చేసి భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేశారు. దాంతో కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. ఇటీవల ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు కూడా ఏర్పాటు చేశారు. త్వరలో కర్ణాటకలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు.



ఈ ఏడాది జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో జేడీఎస్ కు పూర్తి మద్దతుగా కేసీఆర్ ప్రచారం చేయనున్నారు. బెంగళూరు, రాయచూరు, గుల్బర్గా జిల్లాలలో బిఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ పై కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇప్పటికే ఓ కాపు నేత అధ్యక్షుడిగా కమిటీని కూడా ప్రకటించారు.



రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ లో సుమారు 20 అసెంబ్లీ స్థానాలలో బిఆర్ఎస్ పోటీ చేయాలని ప్లాన్ చేసినట్లు చెప్తున్నారు. అలాగే మూడు లేక నాలుగు లోకసభ స్థానాల్లో కూడా కేసీఆర్ పోటీకి అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉంది. ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగొచ్చని వాదనలు వినిపిస్తున్న క్రమంలో కేసీఆర్ దూకుడు పెంచారు.



ఈ మేరకు ఇటీవల ఏపీలో బీఆర్ఎస్ సర్వే కూడా నిర్వహించిందట.. ఆ సర్వే రిపోర్ట్ లో అధికార వైసీపీకి పూర్తి వ్యతిరేకత వచ్చిందని, అందుకే కేసీఆర్ తమ అభ్యర్థులను నిలబెట్టాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ప్రత్యేక తెలంగాణ నినాదంతో ఉద్యమించి ఆంధ్రులను చెడామడా వాయించిన కేసీఆర్ ను ఏపీ ప్రజలు ఆదరిస్తారా? టీఆర్ఎస్ కు ఏపీ ప్రజలు ఓటు వేస్తారా?


తెలంగాణలో చేపడుతున్న సంక్షేమ పథకాలను ఏపీలో కూడా ప్రచారం చేసి ఓటు అడగాలని కెసిఆర్ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టాలని కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ సరిహద్దు జిల్లాలే టార్గెట్ గా ముందుకు వెళ్తున్నారు.



గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం, కర్నూలు, కృష్ణాజిల్లాలో అభ్యర్థులను బరిలో దింపాలని కేసీఆర్ ప్లాన్ చేసినట్లు సమాచారం. కృష్ణా జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు నియోజకవర్గాలు కూడా తెలంగాణకు చాలా దగ్గరగా ఉంటాయి.



కోదాడకు నందిగామ 45 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. జగ్గయ్యపేట కోదాడ మధ్య దూరం కేవలం 23 కిలోమీటర్లు మాత్రమే. ఈ రెండు నియోజకవర్గాల ప్రజలకు తెలంగాణతో సత్సంబంధాలు ఉంటాయి. వారికి కేసీఆర్ పథకాలపై ఒక అవగాహన ఉంటుంది. అందుకే ఈ నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. నల్గొండ జిల్లాకు సమీపంలో ఉన్న గుంటూరు జిల్లాలోని మాచర్ల అసెంబ్లీకి కూడా పోటీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.



మొత్తం 15 నుంచి 20 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయడానికి బీఆర్ఎస్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అలాగే నాలుగు నుంచి ఐదు లోకసభ స్థానాల్లో కూడా కేసీఆర్ తన అభ్యర్థులను నిలబెట్టే అవకాశముంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు కాపు నేత గుంటూరు రెండు నుంచి లోకసభకు పోటీ చేస్తారని వినవస్తోంది. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబును బాపట్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి నిలబెట్టాలని కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం.



గుంటూరు, విశాఖపట్నం లోకసభ నియోజకవర్గాల్లో కూడా పోటీ చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారట. అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్, కొణతాల రామకృష్ణ వంటి సీనియర్ నేతలను కూడా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని ప్రచారానికి ఉపయోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇంకొంతమంది సీనియర్ నేతలను పార్టీలో చేర్చుకొని రాబోవు ఎన్నికల్లో పోటీకి నిలబెట్టాలని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రాజకీయంగా ఎంత ప్రభావం చూపుతారో తెలియదు కానీ... బీఆర్ఎస్ పోటీ వల్ల ఎవరి ఓట్లపై ప్రభావం పడేలా చేయాలన్నది ప్రధాన ఉద్దేశం.


భారత రాష్ట్ర సమితిని ఆంధ్రా ప్రజానీకం ఎంత ఆదరిస్తారో అంచనా వేయలేం కానీ.. మొత్తం మీద రాబోయే ఎన్నికల్లో కొన్ని అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో బిఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టాలని కెసిఆర్ గట్టిగా ఫిక్స్ అయినట్లు పార్టీ వర్గాల సమాచారం. అలాగే కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టేందుకు కసరత్తు జరుగుతోంది. మరి ప్రజలు ఏమేరకు ఆదరిస్తారో భవిష్యత్తే నిర్ణయించాలి.

Tags

Read MoreRead Less
Next Story