ఉద్యోగులను మాయ చేస్తున్న జగన్ సర్కార్‌

ఉద్యోగులను మాయ చేస్తున్న జగన్ సర్కార్‌

ఎన్నికల ఏడాదిలో జగన్ సర్కార్‌ ఉద్యోగులను మభ్యపెట్టి మాయ చేస్తోంది. ఉద్యోగులు, సీపీఎస్‌ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులతో ఆటాడుకుంటోంది. డిమాండ్లు నెరవేర్చేశాం.. అని చెబుతూనే అందరి విషయంలో మెలికలు పెట్టింది. 2014 జూన్‌ 2వ తేదీకి ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారిని మాత్రమే క్రమబద్ధీకరిస్తామని కాంట్రాక్టు ఉద్యోగులను... పీఆర్సీ బకాయిలను 2024 జనవరి నుంచి నాలుగేళ్లలో విడతల వారీగా చెల్లిస్తామని ప్రభుత్వ ఉద్యోగులకు ఝలక్‌ ఇచ్చింది. సీపీఎస్‌ రద్దుపై మాత్రం పాతపాటే పాడింది. అమరావతి సచివాలయంలో ఉపసంఘం ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైంది. 2014 జూన్‌ 2 నాటికి ఐదేళ్లు పూర్తయిన కాంట్రాక్టు ఉద్యోగులను మాత్రమే క్రమబద్ధీకరిస్తామని ఉపసంఘం స్పష్టం చేసింది. నిజానికి... కాంట్రాక్టు ఉద్యోగులందరిని పర్మినెంట్‌ చేస్తామని జగన్‌ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రి అయిన నాలుగేళ్ల తర్వాత... ఇలా కొత్త మెలిక పెట్టారు. ఇది కాంట్రాక్టు ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టడమే అని అనుకుంటున్నారు. ప్రస్తుతం 20 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారు. వీరిలో 2014 జూన్‌ నాటికి ఐదేళ్లకంటే ఎక్కువ సర్వీసు పూర్తి చేసుకున్న వారి సంఖ్య ఏడువేలు మాత్రమే. అంటే... మిగిలిన 13వేల మందిని పర్మినెంట్‌ చేయడం కుదరదు. కొందరినే పర్మినెంట్‌ చేస్తే మిగిలిన వాళ్లు కోర్టును ఆశ్రయిస్తారు. అప్పుడు మొత్తం ప్రక్రియ మొదటికి వస్తుందని, ఎవరికీ న్యాయం జరగదని ఉద్యోగులు పేర్కొంటున్నారు.

ఎన్నికలకు ఏడాది కూడా సమయంలేని దశలో.. ఉద్యోగుల పీఆర్సీ.. ఇతర బకాయిలపై జగన్‌ సర్కార్‌ కొత్త ఎత్తు వేసింది. డీఏలతోపాటు చెల్లించాల్సిన 7 వేల కోట్ల పీఆర్సీ బకాయిలను.. నాలుగేళ్లలో చెల్లిస్తామని మంత్రివర్గ ఉపసంఘం హామీ ఇచ్చింది. అది కూడా నాలుగు వేర్వేరు విడతల్లో… మొత్తం 16 విడతల్లో చెల్లింపులు జరుపుతారట. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ చెల్లింపులు మొదలు పెడతామని మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. 2024లో పది శాతం బకాయిలను చెల్లిస్తారు. ఆ తర్వాతి సంవత్సరం 20 శాతం, ఆపై సంవత్సరం 30 శాతం, చివరగా 2027లో 40 శాతం బకాయిలను చెల్లిస్తారు. అందులోనూ... ప్రతి క్వార్టర్‌కు మాత్రమే! అంటే... 2024లో చెల్లించే 10 శాతం బకాయిల్లో నాలుగో వంతు మాత్రమే జనవరిలో జమ అవుతుంది. రెండో క్వార్టర్‌ వచ్చేసరికి ఎన్నికలు వస్తాయి. వెరసి... ఈ ప్రభుత్వ హయాంలో... 10 శాతం బకాయిల్లో ఒక్క క్వార్టర్‌ చెల్లింపులు మాత్రమే జరుగుతాయి. దీనికి ఉద్యోగ సంఘాల నేతలు అంగీకరించినట్లు ఉపసంఘం స్పష్టం చేసింది. అటు.. పాత పీఆర్సీలో బకాయిలు చెల్లించకుండానే కొత్త పీఆర్సీపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని ఉపసంఘం చెప్పింది.

సీపీఎస్‌ రద్దుపై ఉపసంఘం పాతపాటే పాడింది. పాతపెన్షన్‌ పునరుద్ధరణ కుదరదని తేల్చేసింది. గ్యారెంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌- జీపీఎస్‌కే కొన్ని మార్పులు చేసి కేబినెట్‌లో పెట్టేందుకు సర్వం సిద్ధం చేసింది. సీపీఎస్‌ ఉద్యోగులకు గ్యారెంటెడ్‌ పెన్షన్‌ ఇచ్చేలా జీపీఎస్‌కు తుది మెరుగులు దిద్దుతున్నామని... కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి బొత్స.. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కొంత జాప్యం జరిగిందంటున్నారు. ఐతే.. తమ ఉద్యమం కొనసాగింపుపై గుంటూరులో ఈ నెల 8వ తేదీన జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.

Read MoreRead Less
Next Story