ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా..యువకుడికి డిప్యూటీ సీఎం వార్నింగ్

అనేక హామీలిచ్చి ఓట్లు వేయించుకున్నారు. గెలిచారు.. ఆ తర్వాత డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. నాలుగేళ్లు అయినా ఇచ్చిన హామీలు నెరవేర్చింది లేదు.. గ్రామ సమస్యలు పరిష్కరించి లేదు. దాంతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చిన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిని జనం నిలదీశారు. గ్రామ సమస్యలు పరిష్కరించాల్సిన డిప్యూటీ సీఎం ప్రజలపైనే తిరగబడ్డారు. తానొక ప్రజాప్రతినిధి అని మర్చిపోయి అనరాని మాటలతో బండబూతులు తిడుతూ జనంపైనే నోరుపారేసుకున్నారు.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం కురివికుప్పంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పర్యటించారు. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఇంటింటికి వెళ్లారు. ఎస్సీ కాలనీకి చెందిన శంకర్ అనే యువకుడు.. తమ కాలనీకి బస్సు సౌకర్యం, స్మశాన వాటిక, రోడ్డు బాగు చేయాలని కోరారు. పశువలు బాట, తాగునీటి వంటి సమస్యలు పరిష్కరించాలన్నారు. అంతే.. సమాధానం చెప్పాల్సిన డిప్యూటీ సీఎం ఆగ్రహంతో ఊగిపోయారు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా.. నేనూ ఎస్సీనే.. జాగ్రత్త.. ఏమనుకుంటున్నావ్ అంటూ ఆ యువకుడికి వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు.. యువకుడిపై చర్యలు తీసుకోవాలని అక్కడి ఎస్సైకి సూచించారు. నారాయణస్వామి తీరుపై గంగాధర నెల్లూరు నియోజకవర్గం ప్రజలు విస్తుపోయారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా.. సమస్యలు పరిష్కరించమని అడిగిన యువకుడిపై డిప్యూటీ సీఎం చిందులేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com