ప్రతీ స్కీమ్ వెనుకాల ఏదో ఒక స్కామ్ దాగి ఉంది : లోకేష్

ప్రతీ స్కీమ్ వెనుకాల ఏదో ఒక స్కామ్ దాగి ఉంది : లోకేష్
కేవలం కమిషన్ల కోసం ఎండీయూ వాహనాల కొనుగోలుకు 536కోట్లు

సీఎం జగన్ రాష్ట్రంలో ఏ స్కీమ్ పెట్టినా దానివెనుక ఏదో ఒక స్కామ్ దాగి ఉంటుందని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆరోపించారు. యువగళం పాదయాత్రలో భాగంగా పాణ్యం నియోజకవర్గం పెదపాడులో రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులు లోకేష్‌ను కలిశారు. తమ సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్రంలో 29వేల మంది రేషన్ డీలర్లు దశాబ్దాలుగా ప్రజాపంపిణీ వ్యవస్థపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఆహారభద్రత చట్టానికి విరుద్దంగా రేషన్ డీలర్ల వ్యవస్థకు సమాంతరంగా ఎండీయూ ప్రవేశపెట్టారని వాపోయారు. టీడీపీ ప్రభుత్వం రాగానే ఈ వ్యవస్థను రద్దుచేయాలని కోరారు. టీడీపీ హయాంలో డీలర్ల సంక్షేమానికి కల్పించిన పథకాలు ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. జీవో-5 ప్రకారం డీలర్లను కార్మికులుగా గుర్తించే అవకాశం ఉన్నా.. అమలు చేయడం లేదన్నారు. డీలర్ షాపు నిర్వహణ ఖర్చులు పోను.. గ్రామీణ ప్రాంతాల్లో 18వేల 500, పట్టణ ప్రాంతాల్లో 22వేల 500 ఇచ్చి రేషన్ డీలర్ల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

కేవలం కమిషన్ల కోసం ఎండీయూ వాహనాల కొనుగోలుకు 536కోట్లు, ఆపరేటర్లకు జీతాలుగా ఏటా 250 కోట్లు దుర్వినియోగం చేశారని లోకేష్‌ ఆరోపించారు. ప్రభుత్వ చర్యల కారణంగా పనులు మానుకొని మరీ రేషన్ వాహనం కోసం ఎదురుచూసే పరిస్థితులు కల్పించారని మండిపడ్డారు. ఒకవైపు ప్రజలు, మరొకవైపు డీలర్లు, ఇంకోవైపు ఎండీయూ ఆపరేటర్లు ఈ కొత్త విధానం వల్ల ఇబ్బంది పడుతున్నారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎండీయూ వ్యవస్థను సమీక్షించి, ప్రజలు, డీలర్లకు సౌలభ్యంగా ఉండేలా సముచితమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. రేషన్ షాపులను మల్టీసర్వీస్ కేంద్రాలుగా తీర్చిదిద్దే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story