35 ఏళ్ల క్రికెటర్.. మ్యాచ్ ఆడుతూ మైదానంలో కుప్పకూలి..
ఇమ్రాన్ పటేల్ అనే 35 ఏళ్ల క్రికెటర్ పుణెలో మ్యాచ్ ఆడుతూ మైదానంలో మరణించాడు. గురువారం నగరంలోని గార్వేర్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఆడుతూ గుండెపోటుకు గురయ్యాడు. ఇమ్రాన్ ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు వచ్చాడు, పిచ్‌పై కొంత సమయం గడిపిన తర్వాత ఛాతీ మరియు చేయి నొప్పిగా ఉందంటూ తోటి ఆటగాళ్లతో చెప్పాడు.
అతను సమస్యను ఆన్-ఫీల్డ్ అంపైర్లకు తెలియజేసాడు, దాంతో అంపైర్ ఫీల్డ్ వదిలి వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. దాంతో ఇమ్రాన్ పెవిలియన్ కు వెళుతుండగా కుప్పకూలిపోయాడు. మ్యాచ్ లైవ్ స్ట్రీమ్ అవుతుండగా ఘటన మొత్తం కెమెరాకు చిక్కింది. ఇమ్రాన్ కుప్పకూలిపోవడంతో మైదానంలో ఉన్న ఇతర ఆటగాళ్లు అతని వైపు పరుగులు తీశారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఇమ్రాన్ మరణించినట్లు నిర్ధారించారు.
ఇక్కడ ఆశ్చర్యానికి గురిచేసే విషయం ఏమిటంటే ఇమ్రాన్ మంచి ఆరోగ్యంతో ఉన్నాడు. శారీరకంగా దృఢంగా ఉన్నాడు, అయినప్పటికీ గుండె ఆగిపోయింది. ఆల్ రౌండర్ కావడంతో, ఇమ్రాన్ మ్యాచ్ అంతటా చురుగ్గా ఉండాల్సిన ఆటగాడు.
ఇమ్రాన్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో చిన్న కుమార్తె నాలుగు నెలల వయస్సు మాత్రమే. పటేల్ క్రికెట్ ఆడుతూ, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తాడు.
ఇదే ఏడాది సెప్టెంబరులో హబీబ్ షేక్ అనే మరో క్రికెటర్ కూడా పూణెలో మ్యాచ్ ఆడుతూ ఇలాగే మరణించాడు. అయితే, హబీబ్ డయాబెటిస్ తో బాధపడుతున్నాడు. కానీ ఇమ్రాన్ అందుకు పూర్తి విరుద్ధం. మంచి ఆరోగ్య స్థితిలో ఉన్నాడు, అయినా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com