బీజేపీ నేత అతి వాగుడు.. కంట తడి పెట్టిన ఢిల్లీ సీఎం

అధికారంలో ఉన్న నాయకులు ఏదీ మాట్లాడినా చెల్లుతుందని అనుకుంటారు. వేదికలెక్కి, మైకు చేతబట్టి విచక్షణ లేకుండా ప్రవర్తిస్తుంటారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన నాయకులు నీచ వ్యాఖ్యలు చేస్తుంటారు. అయినా వారిని పెద్దలు దండించరు. వారి నోటిని కట్టడి చేసే ప్రయత్నం చేయరు. ఇలాంటి నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మరొకరు మాట్లాడడానికి భయపడతారు.
ఢిల్లీ ఎన్నికలు 2025కి ముందు భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారితీశాయి. దక్షిణ ఢిల్లీ నుంచి మాజీ లోక్‌సభ సభ్యుడు (ఎంపీ) బిదురి ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ బుగ్గల వలే కల్కాజీ రహదారిని నిర్మిస్తానని బిధూరి తెలిపారు. అనంతరం ఆయన వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవడంతో తాను చేసిన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేస్తూ వెనక్కి తీసుకున్నారు. అయినా బుద్ది రాలేదు.. మళ్లీ ఇంకో మహిళను బాధపెట్టారు తన నోటి దురుసుతనంతో.. ఆమె మరెవరో కాదు ఢిల్లీ తాత్కాలిక సీఎం అతిషి.
దేశ రాజధానిలో బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకురాలు అతిషి తన తండ్రిని మార్చుకున్నారని బిధురి అన్నారు . 2018లో అతిషి తన ఇంటిపేరును మార్లెనా నుండి సింగ్‌గా మార్చడాన్ని బిధురి ప్రస్తావించారు. రమేష్ బిదూరీ వ్యాఖ్యలు తనను తీవ్ర ఆవేదనకు గురిచేశాయని అతిషీ కంటతడిపెట్టారు.
బిధూరి వ్యాఖ్యలపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ, బీజేపీ నాయకులు 'సిగ్గులేనితనం' హద్దులు దాటుతున్నారని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com