Wimbeldon: రోజర్ ఫెదెరర్‌తో తలపడ్డ వేల్స్ యువరాణి కేట్..
బ్రిటిష్ రాజవంశ యువరాణి కేట్ మిడిల్‌టన్, టెన్నిస్ దిగ్గజ ఆటగాడు, స్విస్ యోధుడు రోజర్ ఫెదెరర్ ఓ టెన్నిస్ మ్యాచ్‌లో తలపడ్డారు. వీరిద్దరూ టెన్నిస్‌లో తలపడటం ఏంటనుకుంటున్నారా..? అయితే వీరు ఆడింది రియల్ మ్యాచ్ కాదు, కొద్ది రోజుల్లో ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నీ ఆరంభమవనున్న నేపథ్యంలో స్నేహపూర్వకంగా ఆడారు. కేట్ హాఫ్ స్లీవ్‌డ్ టీ షర్ట్, స్కర్ట్ ధరించి బరిలో దిగింది.
41 యేళ్ల కేట్ మిడిల్‌టన్ వింబుల్డన్ టోర్నీ జులై 3న ప్రారంభమవనున్న నేపథ్యంలో బాల్ బాయ్స్, బాలికలకు శిక్షణ ఇస్తున్న ప్రదేశాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా వింబుల్డన్ నిర్వాహకులు తమ అధికారిక ఇన్‌స్టాగ్రాం పేజీలో పోస్ట్ చేశారు.
రోజర్ ఫెదెరర్ vs కేట్ మిడిల్టన్
రోజర్ ఫెదెరర్ "ఒక మ్యాచ్ ఆడదామా..?" అంటూ ఆహ్వానించగా, "తప్పకుండా ఆడదాం.." అంటూ వేల్స్ యువరాణి కేట్ మిడిల్‌టన్ సమాధానమిచ్చి మ్యాచ్ ఆడారు. బలమైన షాట్లతో కేట్ తనలోని క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించింది. లైన్ మీదుగా సర్వీస్ చేస్తూ ఫెదెరర్ నుంచి పాయింట్లు కూడా రాబట్టింది. కేట్ నైపుణ్యాన్ని రోజర్ మెచ్చుకున్నాడు.
రోజర్ ఫెదెరర్ ప్రాక్టీస్ చేస్తుండగా బాల్ గర్ల్‌గా కూడా మారి అతడికి టెన్నిస్ బాల్స్ అందించింది. రోజర్ మిస్ చేసిన బంతిని కేట్ చేత్తో పట్టుకోగా వింబుల్డన్ టోర్నీలో బాల్‌ను చేతితో పట్టుకోవడం నిషేధం, కానీ ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో చేతితో పట్టుకోవచ్చంటూ కేట్‌కి వివరించాడు.
కేట్ మిడిల్‌టన్ ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ యజమాని. తరచుగా వింబుల్డన్ టోర్నీలను తమకు కేటాయించిన రాయల్ బాక్స్‌లో కూర్చుని వీక్షిస్తుంటారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com