Delhi Elections: ఆప్ ఎందుకు ఓడిపోయిందంటే.. ప్రశాంత్ కిషోర్ విశ్లేషణ

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పతనానికి అనేక కారణాలను వివరించారు జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్. అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ అస్థిరత, దేశ రాజధానిలో పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకత ఫిబ్రవరి 5న జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ పరాజయం పాలవడానికి ప్రధాన కారణాల్లో కొన్ని అని ఆయన అన్నారు.
ఢిల్లీ ఎన్నికల ఫలితాలను డీకోడ్ చేస్తూ, ఓ ఇంటర్వ్యూలో కిషోర్ మాట్లాడుతూ, సోనియా గాంధీ, లాలూ ప్రసాద్ వంటి నాయకులతో కూడిన ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌తో చేతులు కలపాలని కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం, ఎన్నికలకు ముందు ఆ గ్రూప్ నుంచి వైదొలగడం ఆప్ ఓటమిలో పెద్ద పాత్ర పోషించిందని అన్నారు.
గత సంవత్సరం మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్టయిన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం "వ్యూహాత్మక తప్పిదం" అని ఆయన అన్నారు.
"ఢిల్లీలో ఆప్ భారీ ఓటమికి మొదటి కారణం 10 సంవత్సరాల ప్రభుత్వ వ్యతిరేకత. రెండవది ఆప్ చేసిన పెద్ద తప్పు, అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా. మద్యం పాలసీ కేసులో అరెస్టు అయినప్పుడు ఆయన రాజీనామా చేసి ఉండాలి. అయితే, బెయిల్ పొందిన తర్వాత రాజీనామా చేసి, ఎన్నికలకు ముందు మరొకరిని ముఖ్యమంత్రిగా నియమించడం పెద్ద వ్యూహాత్మక తప్పిదమని నిరూపించబడింది" అని ఆయన అన్నారు. "అంతేకాకుండా, ఇటీవలి సంవత్సరాలలో అతని పాలనా విధానం పేలవంగా ఉంది" అని కిషోర్ తెలిపారు.
నీటి ఎద్దడి, రోడ్ల పరిస్థితిని మెరుగుపరచడం, మురికివాడల్లో నివసించే ప్రజల జీవితాలను మెరుగుపరచడం వంటి సమస్యలను పరిష్కరించడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందని కిషోర్ అన్నారు.
"ప్రజలు, ముఖ్యంగా జగ్గీలలో నివసించేవారు అనుభవించిన కష్టాలు, పరిపాలనలోని లోపాలను ఎత్తి చూపాయి. కేజ్రీవాల్ పాలనా నమూనాను గణనీయంగా బలహీనపరిచాయి" అని ఆయన అన్నారు.
ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలకు గాను 48 స్థానాలను గెలుచుకుని బీజేపీ ఢిల్లీలో 10 సంవత్సరాల ఆప్ పాలనకు ముగింపు పలికింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com