Editorial : అమీతుమీ: అయితే సోమూ... లేదంటే మేము..!

Editorial : అమీతుమీ: అయితే సోమూ... లేదంటే మేము..!
ఏపీ బీజేపీలో కలకలం; పార్టీ అధ్యక్షుడిపై సీనియర్లు గుర్రు; పార్టీని వీడేందుకూ సిద్దం....



ఏపీ బీజేపీలో విస్పోటనం తప్పేలా లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహార శైలి, ఆయన రాజకీయ వైఖరిపై పార్టీ లో సీనియర్ నేతలు చాలా మంది అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.



సోము ఉన్నది బీజేపీని బలోపేతం చేయడానికా లేక అధికార వైసీపీకి ఇబ్బంది రాకుండా చూడటానికా అంటూ మండిపడుతున్నారు. చాలా కాలంగా వీర్రాజు వైసీపీ అనుకూల వైఖరి పట్ల పార్టీలో పెద్ద రచ్చ జరుగుతోంది. అంతర్గత సమావేశాల్లో కూడా ఈ అంశం అనేక సార్లు చర్చకు వచ్చింది. 2019 ఎన్నికలయ్యాక కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో అధ్యక్షుడైన ఆయన ఏ నాడూ ఏపీలో పార్టీ పటిష్టపరిచే కార్యక్రమాలు చేపట్టలేదనే విమర్శ ఉంది. అడపా దడపా జనంలో కెళ్లేలా కొన్నిసార్లు పిలుపునిచ్చినా అంత ప్రభావం చూపలేకపోయారు.



వైసీపీ సర్కారు మూడున్నరేళ్ళలో సాగించిన అరాచకాలపై బీజేపీ మాటలకే పరిమితమవుతోంది. టీడీపీ, జనసేన, వామపక్షాలు చేసే విమర్శల మాదిరే బీజేపీ కూడా మాట్లాడుతున్నా అది పైపైకి మాత్రమేననేది అందరికీ అర్దమైపోతోంది. మీడియాలో వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తే వారిని మొదట్లోనే కట్టడి చేశారు. కేవలం అతి కొద్ది మంది నేతలు తాము అనుకున్నట్లు పార్టీని నడిపిస్తున్నారనే బాధ పార్టీ వర్గాల్లో ఏర్పడింది. క్షేత్రస్థాయిలో పోరాటాలకు ఎన్ని అవకాశాలున్నా దూరంగా ఉండిపోతోంది.



కేంద్ర నిధుల దుర్వినియోగం, నిధుల మళ్ళింపు, మోడీ పథకాలకు జగన్ స్టిక్కర్ లాంటి అంశాలపై క్షేత్ర స్థాయి పోరాటాలేవి అని నేతలు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ పెద్దలు వచ్చినప్పడు మాత్రం మీ పోరాటాలు మీరు చేయండని ఎంకరేజ్ చేస్తున్నా సోము తీరు వల్లే నిద్రావస్థకు చేరామని నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బీజేపీ జనసేనతో పొత్తులో ఉందా లేక జగన్ సేన తో పొత్తుతో ఉందో తెలియడంలేదని వాపోతున్నారు. దీనిపై పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అయితే ఏకంగా పోరాటమే ప్రారంభించారు. పవన్ కల్యాణ్ తన దారి తాను చూసుకునే పరిస్థితి రావడానికి వీర్రాజే కారణమని బహిరంగ విమర్శలే చేశారు.


వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యం అన్న పవన్ కల్యాణ్ తో వీర్రాజు శ్రుతి కలపలేకపోయారు. క్రమంగా పవన్ టీడీపీతో కలిసి పోటీకి సిద్దమయ్యే ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు, పవన్ ల మధ్య ఒక భేటీ జరిగింది. ఫిబ్రవరిలో మరోసారి వారిద్దరూ కలసి మాట్లాడుకోబోతున్నారు.


నియోజకవర్గాల వారీ సభలతో చంద్రబాబు ,పాదయాత్రతో నారా లోకేష్, వారాహి యాత్రతో పవన్ కల్యాణ్ లు జగన్ సర్కారుపై ముప్పేట దాడి చేయబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సోము ఏం చేస్తున్నారనే ప్రశ్నకు సమాధానం లేదు. వైసీపీ సర్కారుని గద్దెదించాలని, బీజేపీని బలోపేతం చేయాలని భావించే పార్టీ నేతలు దీన్ని తట్టుకోలేకపోతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ నియమించిన వారనే ఒకే కారణంతో చాలా మంది జిల్లా అధ్యక్షులను సోము హఠాత్తుగా తొలగించేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో చిచ్చు రేపింది.



ఇటువంటి పరిస్థితులతో విసిగిపోయిన కన్నా ఏకంగా జనసేనలో చేరేందుకు సిద్దమవుతున్నారు. బీజేపీ పట్ల మోడీ, అమిత్ షా ల పట్ల విధేయత ఉన్నా వీర్రాజు ఉంటే పార్టీ బాగుపడదనే నిర్ణయానికొచ్చిన వారి జాబితా పెద్దగానే ఉంది. మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి లాంటి వారంతా తమ దారి తాము చూసుకుందామనే భావనకు వచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి.


సత్యకుమార్,పురంధేశ్వరి లాంటి సీనియర్ నేతలు కూడా ఏమీ చేయలేని స్థితికొచ్చారు. గతంలో కొంత యాక్టివ్ గా ఉంటూ జిల్లా పర్యటనలు చేసిన నేతలు ఇప్పడు ఇళ్ళకే పరిమితమవుతున్నారు.



ఎన్నికలకు సిద్దమవ్వాలంటే సోము స్థానంలో మరో సమర్ధ నేతకు అవకాశం ఇవ్వాలని ఎక్కువ మంది నేతలు ఢిల్లీ పెద్దలకు చెబుతున్నారు. జీవీఎల్ నరసింహారావు లాంటి ఒకరిద్దరు నేతలు మాత్రం సోము వీర్రాజు పట్ల అంత వ్యరేకత లేకుండా తటస్థంగా కనిపిస్తున్నారు. ఒక వేళ పదవి తమకొస్తుందనుకుంటే వారు కూడా రెడీ అవుతున్నారు.


పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ల పేర్లు కూడా కొత్త నేత జాబితాలో ఉన్నాయి. సోమును తప్పించి మరొకరికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నా ప్రత్యామ్నాయంపై ఏకాభిప్రాయం లేదు. అయితే వీర్రాజును తప్పిస్తే చాలనే భావన నేతల్లో ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షునిగా జేపీ నడ్డా కొనసాగుతున్నారు. ఈనెల మూడోవారంలో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సోము వీర్రాజు భవతవ్యం తేలిపోతుందంటున్నారు.



ఏపీ పట్ల అనుసరించబోయే వైఖరి విషయంలోనూ బీజేపీలో చర్చ జరిగే అవకాశముంది. దాన్ని బట్టే సోము కొనసాగుతారా ? కొత్త నేత వస్తారా అనే స్పష్టత కూడా వస్తుందంటున్నారు. ఒక వేళ వీర్రాజునే 2024 ఎన్నికల దాకా కొనసాగించే పక్షంలో పార్టీకి గుడ్ బై చెప్పేందుకు కీలక నేతలు రంగం సిద్దం చేసుకుంటున్నారు. మరి హస్తిన కమలం పెద్దలు ఏం చేస్తారో చూడాలి.



రావిపాటి...

Tags

Read MoreRead Less
Next Story