ముదురుతున్న ఔటర్ వార్...రేవంత్ రెడ్డికి HMDA లీగల్ నోటీసులు

ఔటర్ రింగ్ రోడ్ వార్ ముదిరి పాకాన పడుతుంది. నిబంధన మార్చితే అది పెద్ద స్కామ్ అవుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యవహారంలో రేవంత్ 48 గంటల్లోగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని లేదంటే, న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని HMDA లీగల్ నోటీస్ పంపించింది. హెచ్‌ఎండీఏతో పాటు అధికారులపై రేవంత్‌రెడ్డి తప్పుడు, ఆధారాలు లేని వ్యాఖ్యలు చేస్తున్నారని మండి పడుతోంది.
అయితే హెచ్‌ఎండీఏ లీగల్ నోటీసులపై కోర్టులో తేల్చుకుంటానని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఓఆర్‌ఆర్ టెండర్ ఆపడానికి ఇది అవకాశమని.. కోర్టు ద్వారానే టెండర్ వివరాలు బయటపెట్టేలా చేస్తానని చెప్పారు. వాళ్లు తనకు లీగల్ నోటీసులు ఇస్తే.. తాను దానిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ అడుగుతానని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం విలువ వందకోట్లు అయితే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు స్కాం విలువ లక్ష కోట్లని ఆరోపించారు. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేయాలని డిమాండ్ చేశారు. తాను చేసిన ఆరోపణలపై కేటీఆర్,హెచ్‌ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ స్పందించాలన్నారు. ఆరోపణలు తప్పయితే తనపై చర్యలు తీసుకోవచ్చన్నారు.
ఔటర్ టోల్ టెండర్‌కు దక్కించుకున్న పుణేకు చెందిన ఐఆర్‌బీ సంస్థ ఒప్పందం ప్రకారం 30 రోజుల్లో 25శాతం,120 రోజుల్లో మిగతా 75 శాతం చెల్లించాలి. కానీ సంస్థ రూపాయి కూడా చెల్లించకుండా నిబంధనలను ఉల్లంఘించిందని,అందుకే ఆ టెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అలాంటి నిబంధనలు లేవని బీఆర్‌ఎస్ నేతలు వాదిస్తున్నారని, అయితే 27 ఏప్రిల్ 2023న జరిగిన లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ 20, 21 పేజీల్లో ఈ నిబంధన క్లియర్‌గా ఉందని రేవంత్ ఆరోపించారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com