సంరక్షణ కేంద్రాల్లో దయనీయంగా శునకాల పరిస్థితి..

సంరక్షణ కేంద్రాల్లో దయనీయంగా శునకాల పరిస్థితి..




జంతువుల సంరక్షణ, ఆరోగ్య పర్యవేక్షణకు ఏబీసీ క్లినిక్‌ల నిర్వహణకు ప్రభుత్వ అధికారుల వద్ద ప్రత్యేక అనుమతులతో లైసెన్స్‌లను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా క్లినిక్‌లలో జంతువుల సంరక్షణపై అధికారుల తనిఖీ, పర్యవేక్షణ కొరవడింది. హైదరాబాద్‌లోని ECIL నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని చెంగిచర్లలో డాక్టర్ కర్నాటి శ్రీనివాస్ నిర్వహించే NGO ఆధ్వర్యంలో ఒక ఏబీసీ(ABC) సెంటర్‌ నిర్వహించబడుతోంది. ఈ సెంటర్‌పై అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో జంతుప్రేమికులు, జంతు హక్కుల కార్యకర్తలైన జైదీప్‌కుమార్‌, రాధాకుమారి, అనురాధలు ఆ సెంటర్‌ను సందర్శించారు. అక్కడి పరిస్థితులు, వారు గుర్తించిన వివరాలు వారు వెల్లడించారు.

అక్కడ ఉన్న అధ్వాన్న పరిస్థితులను చూసి వారు కంగుతిన్నారు. కుక్కల నుంచి సేకరించిన అవయవాలతో నిండిన టబ్‌లను చూసి షాకయ్యారు. వీరి సందర్శన కారణంగా రాష్ట్రంలోని జంతు సంరక్షణలో జరుగుతున్న ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.

ఎవరికీ తెలియని కారణాలతో వందలాది కుక్కలు చనిపోయాయని ఈ ముగ్గురు కనుగొన్నారు. కుక్కలకు ఆహారం ఇచ్చే వాటిలో కీటకాలు ఉన్నట్టు గుర్తించారు. ఆ ప్రాంతమంతా మలం, మూత్రం, కలుషితమైన ఆహారపు గుట్టలతో దుర్వాసన వెదజల్లుతోందని గుర్తించారు. చాలా వీధి కుక్కలు దయనీయమైన, అపరిశుభ్రమైన పరిస్థితులలో ఉంటున్నాయి. మెజారిటీ కుక్కలు అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు కనుగొన్నారు. ఈ కుక్కలు రక్తం, మూత్రం, కుల్లిన ఆహారం, మలంతో మురికిగా ఉన్న ప్రత్యేక గదులు, విశ్రాంతి గదులలో ఉంచబడ్డాయన్నారు.

ఆహారం అందించే పాత్రల్లో ఈగలు, కీటకాలు, చీమలు ఉన్నట్లు గుర్తించారు. రికార్డుల ప్రకారం, కనీసం ఒక డజను కుక్కలు కంటి లోపాలు, తీవ్రమైన దంత వ్యాధి, పాదాల ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు వీరు గుర్తించారు.

"కుక్కలను డూప్లెక్స్ హౌస్‌లోని బెడ్‌రూమ్‌లలో ఉంచారు. ఈ గదులు అపరిశుభ్రంగా, ఫ్యాన్లు, సరైన వెంటిలేషన్ వంటి సౌకర్యాలు లేకుండా ఉన్నాయి. అంతేకాకుండా కుక్కలను కొట్టడానికి ఉపయోగించే పెద్ద ఇనుప రాడ్లు కనుగొని విస్తుపోయారు. ఇంటి మొదటి అంతస్తులో ఆపరేషన్ థియేటర్ ఉంది. ఆ గది చుట్టూ దుమ్ము, సాలెపురుగులతో భయంకరంగా ఉంది. ఈ అంతస్తులో దాదాపు 3 కుక్కలను బోనుల్లో ఉంచినట్లు" తెలిపారు.

క్లినిక్‌లో పనిచేసే దౌలత్ బీ మాట్లాడుతూ.. "కుక్కలకు కింద గదుల్లో ఆపరేషన్ నిర్వహించి, ఆపై వైద్యం కోసం పైఅంతస్తుకు తీసుకువస్తారు. వాటికి ఎలాంటి సమస్యలు ఉండవు. బలహీనమైన కుక్కలు వ్యాధుల బారిన పడి చనిపోతాయి" అని వెల్లడించింది. ఒక గదిలో, కుక్కల నుండి సేకరించిన అవయవాలతో నిండిన తొట్టెలు నిండి ఉన్నట్లు చూశారు. అవయవాలను గది ఉష్ణోగ్రత వద్ద అపరిశుభ్రమైన పద్ధతిలో నిల్వ చేయబడ్డాయన్నారు. కొన్ని రోజుల తర్వాత వాటిని ఎక్కడికో తీసుకెళ్తారని ఆమె వివరించింది.

ఇంత నిర్లక్ష్యపు సంరక్షణలో కుక్కలు తమ మనుగడ కోసం పోరాడుతున్నాయని అనురాధ అన్నారు. "అవి ఆకలితో అలమటిస్తున్నాయి, కదలలేకపోతున్నాయి. దాదాపు అన్నింటి పరిస్థితి విషమంగా ఉంది" అని ఆమె చెప్పారు. ఈ ఎన్జీవో లైసెన్స్‌ను సస్పెండ్ చేసి, ఇన్‌ఛార్జ్ కమిషనర్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎస్‌ఓఎస్(SOS) పంపారు.

"బోడుప్పల్ మునిసిపాలిటీ కుక్కల స్టెరిలైజేషన్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ కఠిన హెచ్చరికలు జారీ చేయాలి. కుక్కలను వాటి సంరక్షణ, పునరావాసం కోసం తప్పనిసరిగా GHMC కేంద్రాలకు పంపాలి. ఈ NGO భవిష్యత్తులో ఏ ABC కేంద్రాలను నిర్వహించకుండా వెంటనే నిరోధించాలని మేము కోరుతున్నాము. కేసు నమోదు చేసి వెటర్నరీ డాక్టర్ కర్నాటి శ్రీనివాస్‌పై కేసు నమోదు చేయాలి. అతని వెటర్నరీ డిగ్రీని రద్దు చేయాలని వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నోటీసు పంపాలి" అని జైదీప్ కుమార్ పేర్కొన్నారు.












Tags

Read MoreRead Less
Next Story