Kakinada: మత్స్యకారుల వలలో అరుదైన మత్స్యరం.. ధర రూ. 4 లక్షలు

కాకినాడ మత్స్యకారుల వలలో అరుదైన కచిడి చేప చిక్కింది. దీని ధర రూ. 4 లక్షలు పలుకగా ఓ వ్యాపారి దీనిని రూ.3.95 లక్షలు ఇచ్చి తన సొంతం చేసుకున్నారు.
ఈ చేపలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయని అధికారులు తెలిపారు. అందుకే ఈ చేపలకు భారీ డిమాండ్ ఉంటుంది. తమ వలలో చిక్కిన కచిడి చేపను మత్స్యకారులు కుంభాభిషేకం రేవులో విక్రయించగా ఓ వ్యాపారి దానిని రూ. 3.95 లక్షలకు కొనుగోలు చేశాడు.
పులస చేప కంటే కచిడి చేపకు మరింత డిమాండ్..
సాధారణంగా గోదావరి నదిలో దొరికే పులస చేపలకు ఎంత డిమాండ్ ఉంటుందో.. అంతకుమించిన డిమాండ్ కచిడి చేపకు ఉంటుంది. రుచిలో పులస చేపను మించింది లేదు. అందుకే ఎంత ధర చెల్లించి అయినా కొనడానికి పోటీ పడుతుంటారు చేపల ప్రియులు. అయితే, కచిడి చేపలో మాత్రం ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. సర్జరీ చేశాక కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్ బ్లాడర్‌తోనే తయారు చేస్తారని చెబుతారు. ఈ చేపలోని ఒక్కో భాగానికి ఒక్కో రేటు ఉంటుంది. దీని పొట్ట భాగాన్ని బలానికి వాడే మందుల్లో ఉపయోగిస్తారు. ఇంకా మరెన్నో ఔషధ గుణాలు ఉండటంతో ఈ చేపకు అంత డిమాండ్. ఇవి బంగారు వర్ణంలో ఉండటంతో వీటిని గోల్డెన్ ఫిష్ అని కూడా పిలుస్తుంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com