Karnataka : ఉత్కంఠగా మారిన కర్నాటక సీఎం రేసు

Karnataka : ఉత్కంఠగా మారిన కర్నాటక సీఎం రేసు

కర్నాటక సీఎం రేస్ ఉత్కంఠగా మారింది. తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై సస్పెన్స్‌ కంటిన్యూ అవుతోంది. సీఎంగా ఎవరిని నియమించాలన్న విషయంలో తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. సీఎం రేస్‌లో సిద్ధరామయ్య, డీకే శివ కుమార్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరికాసేపట్లో బెంగళూరులో సీఎల్పీ భేటీ కానుంది. సీఎల్పీ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా ఏఐసీసీ ముగ్గురిని నియమించింది. మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే, పార్టీ నేతలు జితేంద్ర సింగ్, దీపక్ బబారియాలను అబ్జర్వర్లుగా నియమించారు. కేంద్ర పరిశీలకులు సీఎల్పీ సమావేశాన్ని పర్యవేక్షిస్తారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.

కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి ఏఐసీసీ పరిశీలకులు హాజరవుతారు. సీఎల్పీ సమావేశంలో పాల్గొనేందుకు కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ షెట్టర్‌ను కాంగ్రెస్ హైకమాండ్ బెంగళూరుకు పిలిపించింది. సీఎల్పీ నాయకుడి ఎంపిక విషయంలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల అభిప్రాయాలను తీసుకోనున్నారు. అవసరమైతే సీఎల్పీ నేతను ఎన్నుకోవడానికి ఓటింగ్‌ నిర్వహించే ఛాన్స్‌ ఉంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత పరిశీలకులు పార్టీ హైకమాండ్‌కు నివేదికను సమర్పించనున్నారు. అయితే ముఖ్యమంత్రి ఎంపిక నిర్ణయాధికారాన్ని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడి వదిలేస్తూ సీఎల్పీ తీర్మానం చేసే ఛాన్స్‌ కనిపిస్తోంది.

ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గే.. కాసేపట్లో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో సమావేశం కానున్నారు. కర్నాటక సీఎల్పీ నాయకుడి ఎన్నిక, డిప్యూటీ సీఎం, మంత్రి పదవులపై చర్చించనున్నారు. సీఎల్పీ సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాత.. అధిష్ఠానం నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఖర్గే ప్రకటించారు.

ఉదయం బెంగళూరులో మల్లికార్జున్‌ ఖర్గేతో కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య సమావేశం అయ్యారు. సీఎల్పీ సమావేశానికి కొన్ని గంటల ముందు ఇద్దరు నేతలు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరో వైపు మంత్రి పదవులను ఆశిస్తున్న నేతలంతా ఖర్గే ఇంటికి క్యూ కట్టారు. ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డికె శివకుమార్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో వారి మద్దతుదారులు తమ నేతలకు మద్దతుగా పోస్టర్లు వేశారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మద్దతుదారులు బెంగళూరులోని ఆయన నివాసం వెలుపల కర్ణాటక తదుపరి సీఎం అంటూ పోస్టర్‌ వేశారు. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ.. బెంగళూరులోని డికె శివకుమార్ ఇంటి వెలుపల అనుచరులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

ఇది జరిగిన కాసేపటికే తుముకూరులో మీడియాతో మాట్లాడిన పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్దరామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశానని.. సిద్దరామయ్యకు అండగా నిలిచానని అన్నారు. పార్టీ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని.. సిద్దరామయ్యకు అన్ని విధాల సహకరిస్తానని తెలిపారు. అయితే కాంగ్రెస్‌ అధిష్ఠానం సిద్దరామయ్య వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. డీకే శివకుమార్‌ కామెంట్స్‌ కూడా దానికి బలం చేకూరుస్తున్నాయి. సోమవారం లేదా మంగళవారం కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేస్తారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. టి. కాంగ్రెస్‌ ముఖ్యనాయకులు బెంగళూరుకు చేరుకున్నారు.

Next Story