Karnataka Election 2023 : క్లైమాక్స్ కు చేరుకున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం
దేశ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ చేరుకుంది. విజయం కోసం బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ సర్వశక్తులు ఒడ్డుతున్నాయ్. వరుస ర్యాలీలు, ప్రచారసభలతో హోరెత్తిస్తున్నాయ్. ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయ్. దక్షిణాదిలో అధికారమున్న ఏకైక రాష్ట్రాన్ని బీజేపీ నిలుపుకుంటుందా?, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న హస్తం పార్టీ సత్తా చాటుతుందా?.. జేడీఎస్ మరోసారి కింగ్ మేకర్ అవుతుందా?
సార్వత్రిక ఎన్నికల సమరం ముందు సైమీఫైనల్స్‌గా భావిస్తున్న కర్నాటక శాసనసభ ఎన్నికలను అధికార బీజేపీ, విపక్షాలైన కాంగ్రెస్, జేడీఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం మూడు పార్టీలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ విజయం కోసం ప్రధాని మోదీ నేరుగా రంగంలోకి దిగారు. వరుస రోడ్‌షోలు, సభలతో కన్నడ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు చావో రేవోగా మారాయి. మొదటగా కర్నాటకలో అధికారం హస్తగతం చేసుకుంటే.. రేపు సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ పీఠాన్ని సులువుగా గెలవొచ్చని ఆ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ విజయం కోసం రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ శ్రమిస్తున్నారు. బీజేపీది కమిషన్ల ప్రభుత్వమంటూ అవినీతిని ఎండగడుతున్నారు. మరో ప్రతిపక్ష పార్టీ అయిన జేడీఎస్ పట్టును నిలుపుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, పెరుగుతున్న నిరుద్యోగం వంటి అంశాలు ఈ ఎన్నికల్లో బీజేపీకి శరాఘాతంగా మారే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీ కొంప ముంచే ఫ్యాక్టర్‌గా కనిపిస్తోంది. యడియూరప్పను దూరం పెట్టడం.. ఆ స్థాయిలో జనాకర్షణ ఉన్న నాయకుడు మరొకరు లేకపోవడం.. బీజేపీకి ఇబ్బందికర పరిణామంగా ఉంది. మోదీ చర్మిషా, సంస్థాగత పరంగా పార్టీకి ఉన్న బలమైన క్యాడర్, .. ఇంటింటికి కాషాయ శ్రేణుల ప్రచారం.. వీటిపైనే కమలం పార్టీ ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.
ఇక కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వ అవినీతినే ప్రధాన ప్రచార ఆస్త్రంగా చేసుకుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు సైతం తమ ప్రసంగాలలో బొమ్మై సర్కార్ అవినీతినే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. 40 శాతం కమిషన్ల ప్రభుత్వం నడుస్తోందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. టికెట్ల కేటాయింపులో ఆ పార్టీ వేసిన కొన్ని తప్పటడుగులు... త్రిముఖ పోరులో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉండటం..కాంగ్రెస్‌కు కాస్తా ఇబ్బందికర అంశాలు కనిపిస్తున్నాయి. అయినా బీజేపీ పాలనపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత తమను గెలిపిస్తుందని కాంగ్రెస్ గట్టిగా నమ్ముతోంది.
సొంతంగా అధికారంలోకి రాలేకపోయిన.. కాస్తా కూస్తో సీట్లు సాధించి కింగ్ మేకర్‌గా నిలవాలని జేడీఎస్ భావిస్తోంది. కాంగ్రెస్, బీజేపీలకు స్పష్టమైన మెజార్టీ రాకుండా హంగ్ ఏర్పడితే తాము మద్దతిచ్చిన పార్టీనే అధికారం చేపడుతుందని బలంగా నమ్ముతోంది. ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో పార్టీ బలంగా ఉండటం.. కాంగ్రెస్, బీజేపీలో టికెట్లు దక్కని నేతలను పార్టీలో చేర్చుకొని బరిలోకి దింపడం జేడీఎస్‌కు ప్లస్‌గా కనిపిస్తున్నాయి. కుటుంబ పార్టీ ముద్ర, బలమైన కాంగ్రెస్, బీజేపీలను.. అన్ని స్థానాల్లో ధీటుగా ఎదుర్కొని లేకపోవడం ఆ పార్టీకి మైనస్‌గా కనిపిస్తోంది.
కన్నడిగుల నాడి సర్వేలకు సైతం అంతుచిక్కడం లేదు. కొన్ని సర్వేలు కాంగ్రెస్‌దే అధికారమని చెబుతుండగా.. మరి కొన్ని సర్వేలు బీజేపీకి మెజార్టీ సీట్లు వస్తాయని చెబుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత, స్థానిక అంశాలే ఎన్నికల్లో పనిచేస్తాయని కాంగ్రెస్ నమ్ముతోంది. అవే తమను విజయతీరాలకు చేరుస్తాయని హస్తంపార్టీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ నేతలు మోదీ ప్రచారాన్ని మాత్రమే నమ్ముకున్నారు. ప్రధాని ప్రచారం తర్వాత జనంలో మార్పు వచ్చిందని.. తమకు మెజార్టీ సీట్లు రావడం పక్కా అని చెబుతున్నారు.
కాంగ్రెస్ నుంచి సీఎం రేస్‌లో మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ముందజలో ఉన్నారు. ఇవే చివరి ఎన్నికలు అంటూ సిద్ధ రామయ్య అంటూ సెంటిమెంట్‌ను రగలించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ మెజార్టీ సాధిస్తే తానే మరోసారి ముఖ్యమంత్రి అవుతానంటూ సిద్ద రామయ్య చెప్పకనే చెబుతున్నారు. అధిష్ఠానం నిర్ణయించే వ్యక్తే సీఎం అవుతారని పైకి చెబుతున్నా.. రేసులో ముందున్నట్లు ఆయన వర్గీయులు చెప్పుకుంటున్నారు. ఇక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సీఎం పదవిని ఆశిస్తున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు.. అన్ని రకాలు అండగా నిలిచిన తనకు అధిష్ఠానం తప్పక అవకాశం ఇస్తుందని నమ్ముతున్నారు. టికెట్ల కేటాయింపు నుంచి ప్రచారం వరకు అన్ని తానై వ్యవహరిస్తున్నారు డీకే శివకుమార్.
ప్రచారానికి ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో అన్ని పార్టీలు ఆఖరి ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలుకోకుండా ప్రత్యర్థి పార్టీలను డిఫెన్స్‌లోకి నెట్టడానికి ప్రయత్నిస్తున్నాయ్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com